ఈ సొమ్మంతా ఇళ్ల నిర్మాణాలకే వెచ్చించాలని సీఎం నిర్ణయం
ఆ మేరకు అధికారులకు చంద్రబాబు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకోవడానికి సీఎం సహాయ నిధికి ఇప్పటి వరకు ఏకంగా రూ.100 కోట్లు వచ్చాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించారు. సహాయ నిధికి వచ్చిన నిధులతో.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇళ్లు కోల్పోయిన వారందరికీ ఒక్కో ఇంటికి రూ.2 లక్షల చొప్పున వెచ్చించి పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సహాయ నిధికి వచ్చిన నిధులన్నింటినీ ఇళ్ల నిర్మాణాలకే వెచ్చించాలని నిర్ణయించారు. రూ.100 కోట్లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన గృహ నిర్మాణ పథకాలను కూడా చేర్చి కనీసం 4000 పక్కా గృహాలను నిర్మించాలని యోచిస్తున్నట్లు సీఎం కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
నిధులిచ్చిన పెద్ద కంపెనీల ప్రతినిధులతో చర్చించి ఏ తరహా ఇళ్లు నిర్మించాలనే దానిపై చర్చించాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు. ఆ మేరకు.. నిధులిచ్చిన కంపెనీల ప్రతినిధులతో చర్చించడంతోపాటు నిర్మాణ ఏజెన్సీని కూడా ఎంపిక చేస్తామని ఆ ఉన్నతాధికారి తెలిపారు. ఈ బాధ్యతను ఎల్‌అండ్‌టీ లేదా టాటా ఇంజనీరింగ్ తదితర సంస్థలకు అప్పగించాలని ఆలోచిస్తున్నారు. కాగా, తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో 40 వేల ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఇళ్ల నిర్మాణాలకే రూ.3000 కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా.
రూ. 98.92 కోట్లు విడుదల
తుపాను వల్ల నష్టపోయిన వారికి పరిహారం అందించడంతోపాటు తాత్కాలిక పునరుద్ధరణ పనుల కోసం ప్రభుత్వం రూ. 98.92 కోట్లు విడుదల చేసింది. ఇందులో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇళ్లు దెబ్బతిన్న వారికి పరిహారం కింద రూ. 88.78 కోట్లు కేటాయించింది. తోపుడు బండ్లపై అమ్ముకునేవారు, వీధి వ్యాపారులు, రిక్షా, ఆటో కార్మికులకు సహాయం అందించేందుకు రూ. 2.30 కోట్లు, దుస్తులు, ఇతర ఇంటి సామగ్రి కోసం రూ.4.23 కోట్లు, రెవెన్యూ శాఖలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 3.60 కోట్లు కేటాయించింది.పారదర్శకంగా పరిహారం చేరేందుకు వీలుగా బాధితుల బ్యాంకు అకౌంట్లకే డబ్బు జమ చేయాలని సూచించింది.
తుపానుపై సీఎం నిధికి రూ.100 కోట్లు
Published Sat, Nov 22 2014 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM
Advertisement