తుపాను బాధితులకు జగన్ పరామర్శ
నేటినుంచి పర్యటన
విశాఖపట్నం సిటీ : హుదూద్ తుపాన్ బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నుంచి మూడురోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(కార్యక్రమాలు) తలశిల రఘురాం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించిన వివరాల ప్రకారం... వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకుంటారు.
అనంతరం నక్కపల్లి చేరుకుని అక్కడి తుపాను వల్ల నీటమునిగిన పంటపొలాలను పరిశీలిస్తారు. నక్కపల్లి మండలంలో తుపాను బాధితులను పరామర్శించనున్నారు. అక్కడి రైతులతో మాట్లాడి నష్టం జరిగిన తీరును తెలుసుకుంటారు. అనంతరం ఎలమంచిలి, అనకాపల్లిలో హుదూద్ బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.
అనంతరం హుదూద్ తీరం దాటిన పూడిమడక ప్రాంతాన్ని సందర్శించనున్నారు. మంగళవారం రాత్రికి గాజువాక చేరుకుని అక్కడే బస చేస్తారు. బుధ, గురువారాల్లో విశాఖలో పర్యటిస్తారు. నగరంలోని పలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. బాధితులను పరామర్శించడంతో పాటు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారని వివరించారు.