జగన్ రాక రేపు
విజయనగరం మున్సిపాలిటీ: హుదూద్ మిగిల్చిన నష్టాలను పరిశీలించి, బాధితులను పరామర్శించేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం జిల్లాకు రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. హుదూద్ పెను తుపాను వల్ల ఏర్పడిన నష్టం ఎవరూ పూడ్చలేనిదన్నారు. బాధిత ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శిస్తారని చెప్పారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు విజయనగరం, 11 గంటలకు గంట్యాడ మండలాల్లో పర్యటిస్తారని తెలిపారు. అనంతరం తీర ప్రాంత మండలమైన పూసపాటిరేగలో బాధిత కుటుం బాలను పరామర్శించిన తర్వాత సమయం చూసుకుని భోగాపురం మండలంలో కూడా పర్యటిస్తారని చెప్పారు. అధికార యంత్రాంగం చేపడుతున్న సహాయక చర్యల్లో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన మేర నిధులు తెప్పించేందుకు జగన్‌మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు సామాజిక దృక్పథంతో సేవలు అందించాలని కోరారు. పార్టీ నాయకులు అంబళ్ల శ్రీరాములునాయుడు, మా మిడి అప్పలనాయుడు, జమ్ము శ్రీనివాసరావు, ఎస్‌వీవీ రాజేష్, ఆశపు వేణు పాల్గొన్నారు.