సాక్షి, ఖమ్మం: జిల్లాపై హుదూద్ ప్రభావం పొంచి ఉంది. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాతీరాన్ని ఈ తుపాను అతలాకుతలం చేస్తే.. జిల్లాలో మాత్రం వాతావరణ ఒక్కసారిగా చల్లడింది. కొద్దిపాటి గాలులు వీస్తున్నాయి. ఏజెన్సీలో అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల వైపు ఈ తుపాను వెళ్లనుందని వాతావరణశాఖ సూచిస్తోంది. ఇదే జరిగితే జిల్లాలోని భద్రాచలం ఏజెన్సీకి తుపాను తాకిడి తగలనుంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్ అయింది.
హుదూద్ జిల్లా ప్రజలు, అధికారులను కలవరపెడుతోంది. రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలో తుపాను ప్రభావం ఉంటుందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వాయువ్య దిశ వైపు పయనిస్తున్న హుదూద్ భద్రాచలం డివిజన్‌పై ప్రభావం చూపనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అతివేగంగా వచ్చిన తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖను అతలాకుతలం చేయడంతో జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుందోనని అధికారుల్లో టెన్షన్ నెలకొంది.
చిన్నపాటి వర్షాలకే భద్రాచలం డివిజన్‌లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో ఇప్పుడు వర్షపాతం ఎక్కువ నమోదైతే ఏజెన్సీ జలయమం కానుంది. తుపానుపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి ఇప్పటికే జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నంబర్ 08742-224204, భద్రాచలంలో 08743-232444, 232426 నంబర్లను ఏర్పాటు చేశారు. భద్రాచలం ఏజెన్సీ మండలాల తహశీల్దార్లు తుపాను కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు.
ఈ మండలాలపై ప్రభావం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఆగస్టులో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వాజేడు మండలం పేరూరులో అత్యధికంగా 54 సెం.మీ వర్షం పడింది. ఇది రాష్ట్రంలో అప్పట్లో అత్యధికంగాా కురిసిన వర్షం. అయితే తుపానుతో భారీ వర్షం పడితే ఎలా.. గత పరిస్థితులను అధికారులు అంచనా వేస్తున్నారు.
శబరికి వరద తాకిడి..
తుపాను ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్తుండటంతో శబరినది పోటెత్తే అవకాశం ఉంది. ఒడిశాలోని మాచ్‌ఖండ్, బలిమెల, సీలేరు డొంకరాయి రిజర్వాయర్లు నిండితే వరద నీరు కిందకు వదలనున్నారు. ఇదంతా శబరిలో కలవనుంది. శబరి గోదావరిలో కలవనుండంతో వరద ఉధృతితో చింతూరు, కూనవరం మండలాల్లోని పలు గ్రామాలకు వరద ప్రమాదం పొంచి ఉంటుంది.
అయితే ఈ రిజర్వాయర్లలో నీరు ఎంత ఉంది..? వరద వస్తే ఎంత నీరు శబరిలోకి వస్తుందోనని అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే ఇంద్రావతి నది వరదతో తాలిపేరు ప్రాజెక్టులోకి నీరు చేరనుంది. తాలిపేరు అన్ని గేట్లు ఎత్తితే చర్ల పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించనున్నాయి. తుపాను ప్రభావం గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఎగువన ఉన్న రాష్ట్రాల్లో లేకపోవడంతో గోదావరి వరద పెరిగినా ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు.
ఏజెన్సీ రైతుల ఆందోళన..
విశాఖలో తుపాను తీవ్రతను చూసి ఏజెన్సీ రైతుల్లో ఆందోళన నెలకొంది. భధ్రాచలం డివిజన్‌లో పత్తి ఇప్పుడే పూత, పిందెకు వచ్చింది. గాలివాన వస్తే పిందె, పూత రాలడంతో పాటు పత్తి నేలవాలనుంది. తుపాను ప్రభావం మూడు రోజులు ఉండనుండడంతో మిర్చి పూర్తిగా నీట మునిగి కుళ్లిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.