సాక్షి ప్రతినిధి, విజయనగరం : హుదూద్ తుపాను ప్రళయ బీభత్సం సృష్టించింది. గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో విధ్వంస రచన చేసింది. ఓ వైపు 200 కిలోమీటర్ల వేగంతో వింత శబ్దాలతో విరుచుకుపడిన ప్రచండ ఈదురుగాలులు, మరోవైపు కుంభవృష్టిగా కురిసిన వర్షంతో జిల్లావాసులు భయకంపితులయ్యారు. శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారం భమైన హుదూద్ విధ్వంసం ఎటువంటి విరామం లేకుండానే కొనసాగింది. ఆదివారం ఉదయం తుపాను విశాఖ తీరానికి చేరిన సమయంలో ప్రారంభమైన భీకర ఈదురుగాలులు అందరినీ ఆందోళనకు గురి చేశాయి. జిల్లా ప్రజలతో పాటు పశు, పక్షాదులు చిగురుటాకుల్లా వణికాయి. తుపాను తీరం దాటిన తరువాత కూడా ఈదురుగాలులు వెన్నులో వణుకు పుట్టించాయి. తీర ప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురం, విజయనగరం మండలాల్లో పరిస్థితి మరింత భయానకంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సుమారు. రూ. 300 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈదురుగాలులు, భారీ ఎత్తున రాకాసి అలలు తీరంలోకి ఎగిసపడడంతో మత్స్యకారులు భీతిల్లిపోయారు. భగవంతుడిపైనే భారం వేశారు. ఇళ్లు పెకిలించేలా గాలులు, భారీ శబ్దంతో భయభ్రాంతులకు గురయ్యారు. బతికితే చాల నే అభిప్రాయానికొచ్చేశారు. శనివారం రాత్రి 11గంటల నుంచి ఏకధాటిగా పెనుగాలులతో కూడిన వర్షం పడడంతో అ డుగు తీయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఎదుర్కొన్నారు. కొందరు తమ ఇళ్ల వద్ద బితుకుబితుకుమని గడపగా, మరికొంతమంది అధికారులు ఏర్పాటు చేసిన 18 పునరావాస కేంద్రాల్లో ఉండి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. విశేషమేమిటంటే అక్కడి పరిస్థితులను పర్యవేక్షించేందుకు వెళ్లిన అధికా రుల వద్ద నుంచి కనీసం సమాచారం అందని పరిస్థితి నెలకొంది. ఆదివారం రాత్రైన భీకర గాలులు వదల్లేదు. వర్షం ఆగలేదు. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా, సహాయక బలగాలు ఉన్నా, కంట్రోల్ రూమ్, హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినా విలయం వచ్చేసరికి ప్రయోజనంలేకుండా పోయాయి. ఆదివారం అర్థరాత్రి వరకు విజయనగరం, పూసపాటిరేగ, భోగాపురం, నెల్లిమర్ల, గుర్ల, ఎస్.కోట మండలాల్లో పెను గాలుల ప్రచండం కొనసాగింది.
ఐదేళ్లలో ఇదే భారీ తుపాను
ఐదేళ్లలో చూసుకుంటే 2009 సంవత్సరంలో జల్, 2010 సంవత్సరంలో లైలా, 2011 సంవత్సరంలో థేన్, 2012 సంవత్సరంలో నీలం తుపాన్లు సంభవించగా 2013 ఒక్క సంవత్సరంలో పై-లీన్, హెలిన్, లెహర్ తుఫాన్‌లతో పాటు తీవ్ర అల్పపీడనాలు వరుసగా అటు రైతులు, ఇటు మత్స్యకారులను కుదేలుచేశాయి. తాజాగా హుదూద్ తుపాను విధ్వంసం సృష్టించడంతో అటు తీర ప్రాంత గ్రామాలతో పాటు జిల్లాలోని 34 మండలాలకు చెందిన ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. గతంతో పోల్చుకుంటే హుదూద్ విధ్వంసం భారీ స్థాయిలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
చెరువులకు గండ్లు
జిల్లావ్యాప్తంగా భారీ మొత్తంలో రహదారులు తుపాను దాటికి ధ్వంసం కాగా...చెరువులకు గండ్లు పడ్డాయి. విజయనగరం పట్టణంలో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన పెద్ద చెరువుకు గండిపడటంతో దిగువ ప్రాంతానికి వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. విజయనగరంలో మరో రెండు చెరువులు గండ్లు పడ్డాయి. దీంతో తోటపాలెం, సరస్వతినగర్‌లలోకి వరద నీరు చేరింది. ఇక రాజీవ్ నగర్ కాలనీ, కేఎల్‌పురం, కన్యకాపరమేశ్వరి జంక్షన్, న్యూపూర్ణ జంక్షన్, గంటస్తంభం ఏరియా, వీటి అగ్రహారం బీసీ కాలనీలు ముంపునకు గురయ్యాయి.
తుపానుబీభత్సంతో సుమారు 5000 వేల వరకు చెట్లు నేలకొరిగాయి. బీకర గాలలు ఇళ్లను, చెట్లును పెకిలించేసాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 700 ఇళ్లు నేల కూలినట్టు తెలుస్తోంది. దారిపొడవునా భారీ చెట్లు నెలకొరగడంతో మత్స్యకార గ్రామాలతో పాటు జిల్లాలోని పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎస్. కోట తహశీల్దార్ కార్యాలయంపై భారీ వృక్షం కూలిపోయింది. బొబ్బిలి ఆశ్రమ పాఠశాలలో భారీ చెట్లు కూలిపోవడంతో అక్కడి విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. కురుపాంలో రోడ్డుపై భారీ వృక్షం కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా అటు చెట్లు, ఇటు విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ రోడ్డుపై కూలడం, బలమైన గాలులు వీస్తుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. కొన్నిచోట్ల రోడ్లుపై ఉన్న వాహనాలు ఈదురు గాలులకు పల్టీకొట్టాయి. కొన్నిచోట్ల వాహనాలు దెబ్బతిన్నాయి. జిల్లా రైతాంగం ప్రధానంగా పండించే లక్షా 10వేల 505 హెక్టార్లలో వరి పంట సైతం నీటి పాలయ్యే పరిస్థితిలు కనిపిస్తున్నాయి.వేలాది హెక్టార్లలో మొక్కజొన్న, ప్రత్తి , చెరకు, అరటి కూరగాయలు పంటలు నీటి పాలయ్యాయి. ఈ నష్టాన్ని అంచనా వేయలేమని అధికారులు చేతులేత్తేశారు.
అత్యవసర సేవలైన విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. సుమారు 675 విద్యుత్ స్తంభాలు, 65ట్రా న్స్‌ఫార్మర్‌లు నేలకొరిగినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ సంఖ్య మరింత భారీగా ఉండొచ్చని తె లుస్తోంది. దీంతో శనివారం నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను ఇంతవేగంగా పునరుద్ధరించే పరిస్థితి లేదు. ఫలితంగా జిల్లా అంతా గాడ అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. బీఎస్‌ఎన్‌ఎల్ స్తంభాలు, కేబుళ్లు ధ్వంసమయ్యాయి. సెల్‌ఫోన్ టవర్లు నేలకూలాయి. దాదాపు సమాచార వ్యవస్థ కుప్పకూలిపోయింది. దీంతో ఫోన్‌లు దాదాపు మూగబో యాయి. ఇంటర్‌నెట్ పరిస్థితి కూడా అంతే.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, సెల్‌ఫోన్ సిగ్నల్స్ పనిచేయకపోవడం, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలిపోవడంతో ఎక్కడేం జరిగిందో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. మొత్తానికి అన్ని రకాలుగా కలిపి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.300కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికార వర్గాలు ప్రాథమిక అంచనా వేశాయి.
జామిలో ఒకరి మృతి
భీకరగాలులకు తాటిచెట్టు పడి జామిలో కర్రి రమేష్(22) అనే యువకుడు మృతి చెందాడు.అలాగే జిల్లాలో పలుచోట్ల వందలాది పశువులు మృత్యువాత పట్టాయి. ఎక్కడికక్కడ భయానక పరిస్థితులుండటంతో చూడటానికి కూడా జనాలు వెళ్లలేకపోయారు. తమ ప్రాణాలను కాపాడుకోవడమే కష్టంగా భావించారు. ముంపునకు గురయ్యాయి.
రూ. 300 కోట్ల నష్టం
Published Mon, Oct 13 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM
Advertisement
Advertisement