మరో 48 గంటలు చీకట్లే!
ఉత్తరాంధ్రలో కుప్పకూలిన విద్యుత్ సరఫరా వ్యవస్థ
కూలిన టవర్లు.. విరిగిన స్తంభాలు.. తెగిన తీగలు
రోడ్లపై చెట్లతో గ్రామాలకు సామాగ్రి
సరఫరాలో సమస్యలు
విశాఖ నగరానికి మాత్రం పాక్షిక విద్యుత్
నేడు పరిస్థితి మెరుగుపడే అవకాశం
హైదరాబాద్: ఉత్తరాంధ్రలో మరో 48 గంటలు చీకట్లు తప్పవని అధికారులు అంటున్నారు. హుదూద్ తుపాన్‌తో విద్యుత్ వ్యవస్థ కకావికలమైందని తెలిపారు. 60 ఏళ్ళుగా సమకూర్చిన అన్ని వ్యవస్థలూ కుప్పకూలాయని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ‘దీని నుంచి కోలుకోవడానికి ఎన్ని గంటలు కాదు... ఎన్ని రోజులు పడుతుందో కూడా చెప్పలేం’ అని ఏపీ జెన్‌కో సీఎండీ విజయానంద్ ‘సాక్షి’తో అన్నారు. తాజా పరిస్థితుల్లో దశలవారీగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. అతి కష్టం మీద మంగళవారం విశాఖ నగరానికి పాక్షికంగా విద్యుత్ ఇవ్వగలిగారు. గాజువాక 220 కేవీ సబ్‌స్టేషన్‌ను కొంతవరకు పునరుద్ధరించారు. దీనిద్వారా పరిసర ప్రాంతాలకు అతి తక్కువ విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. దీనికీ క్షణానికో సాంకేతిక అవాంతరం ఎదురవుతోంది. బుధవారం పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక విజయగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్యుత్ సరఫరాపై అధికారులు ఇతమిద్దంగా హామీ ఇవ్వలేకపోతున్నారు. పెద్ద ఎత్తున సబ్‌స్టేషన్లు కుప్పకూలాయి. స్తంభాలు విరిగిపోయాయి. తీగలు తెగిపోయాయి. ఈ పరిస్థితుల్లో రెండురోజుల వరకు దీనిపై స్పష్టత ఇవ్వలేమని, జిల్లా కేంద్రాలకు మాత్రం సరఫరా సాధ్యం కావచ్చునని అంటున్నారు.
సింహాద్రి గాడిలో పడాల్సిందే..
విశాఖను గాడిలో పెట్టేందుకు సోమవారం నుంచే అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కానీ మంగళవారం సాయంత్రం వరకు ఈ ప్రయత్నాలు ఫలించలేదు. మాంచ్‌ఖండ్ నుంచి లైన్ క్లియర్ కాలేదు. అన్నీ బ్రేక్ డౌన్‌లే ఉన్నాయి. వేమగిరి ప్లాంట్ అనుసంధానం కుదరలేదు. మార్గంలో అనేక టవర్లు కూలిపోయాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విద్యుత్ తీసుకునే అవకాశం లేకుండాపోయింది. విశాఖలో ప్రధాన ఆసుపత్రి కింగ్‌జార్జ్‌కు అతి కష్టం మీద కొన్ని గంటలు విద్యుత్ సరఫరా చేశారు. వేమగిరి ప్లాంట్ నుంచి గాజువాక 220 కేవీ సబ్‌స్టేషన్‌కు లింక్ చేసినా, ఇది విశాఖ అవసరాలు తీర్చే స్థాయిలో లేదు. జాతీయ థర్మల్ పవర్ స్టేషన్‌కు చెందిన సింహాద్రి యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన నిలిచిపోవడం పెద్ద అడ్డంకిగా మారింది. విపరీతమైన గాలికి ఊహించని విధంగా సింహాద్రి యూనిట్లలో నష్టం జరిగింది. యూనిట్ల రక్షణకు అమర్చిన రేకులు, గ్లాసులు పగిలిపోయాయి. దీంతో టర్బైన్లలోకి నీళ్లు వచ్చాయి. యథాతథ స్థితికి మరో 5 రోజులైనా పడుతుందని అధికారులు తెలిపారు. అప్పర్ సీలేరులోనూ ఇదే పరిస్థితి. మంగళవారం రాత్రి వరకు ఒక్క యూనిట్ ఉత్పత్తి జరలేదు.
ముమ్మరంగా మరమ్మతులు: అజయ్ జైన్
విశాఖ నగరంలో బుధవారం విద్యుత్ సరఫరా మెరుగయ్యే అవకాశం ఉందని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఇప్పటికే గాజువాక 220 కేవీని పునరుద్ధరించామని, మిగతా సబ్ స్టేషన్లను బాగు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. కాగా, మంగళవారం రాత్రి విశాఖ శివార్లలో విద్యుత్‌ను పునరుద్దరించారు. కొత్త గాజువాక/గోపాలపట్నం సబ్ స్టేషన్‌ల నుంచి పద్మనాభపురం, నరవ, మింది గ్రామాల్లో వున్న జీవీఎంసీ నీటి సరఫరా విభాగానికి విద్యుత్ సరఫరా చేశారు.