
హడలెత్తిన.. విజయనగరం, శ్రీకాకుళం
విఫలమైన సహాయక చర్యలు
అరచేతిలో ప్రాణాలతో 22 గ్రామాల్లోని ప్రజలు
హుదూద్‌తో చివురుటాకులా వణికిన జిల్లాలు
సాక్షి ప్రతినిధులు, విజయనగరం/శ్రీకాకుళం: హుదూద్ తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లా కకావికలమైంది. తుపాను విధ్వంసంతో జిల్లా యావత్తూ చివురుటాకులా వణికిపోయింది. తీర ప్రాంతంతో పాటు మైదాన ప్రాంతాన్ని కూడా తుపాను అతలాకుతలం చేసింది. ఒకవైపు 100 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో కూడిన ప్రచండ గాలులు, మరోవైపు కుండపోత వర్షంతో జిల్లా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. శనివారం రాత్రి 11 గంటల నుంచి ఏకధాటిగా పెనుగాలులతో వర్షం పడడంతో జన జీవనం స్తంభించింది.
చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. జిల్లా పూర్తిగా అంధకారమైంది. సమాచార వ్యవస్థ కుప్పకూలింది. ఎక్కడేం జరుగుతుందో తెలియని పరిస్థితి చోటు చేసుకుంది. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా, సహా యక బలగాలున్నా, కంట్రోల్ రూమ్, హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినా ఏ మాత్రం ప్రయోజనం ఇవ్వలేకపోయాయి. జామి మండలంలో తాటిచెట్టు కూలడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని: మత్స్యకార గ్రామాల్లోకి సముద్రం చొచ్చుకు రావడంతో ఆ యా గ్రామాల్లోని వారు బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడిపా రు. ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసు, ఇతర బలగాలు సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. దీంతో దాదాపు 22గ్రామాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. విజయనగరం, ఎస్.కోట, నెల్లిమర్ల, డెం కాడ, చీపురుపల్లి, మెరకముడిదాం, గుర్ల, కొత్తవలస, గజపతినగరం, గంట్యాడ, బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ, బొబ్బిలి, రామభద్రపురం మండలాలు అతలాకుతలమయ్యాయి.
పొంగి ప్రవహిస్తున్న నదులు, చెరువులు: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడంతో జిల్లాలో ప్రధానమైన నాగావళి, చంపావతి, గోస్తనీ, గోముఖీ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.
చివురుటాకైన శ్రీకాకుళం: ప్రచండ తుపాను హుదూద్ శ్రీకాకుళం జిల్లాను హడలెత్తించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి వీస్తున్న పెనుగాలులు, కురుస్తున్న భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. వేలాది ఎకరాల్లో వరి, ఇతర ప్రధాన పంటలు నేలమట్టమయ్యాయి. విద్యుత్, సమాచార, రవాణా వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. చెట్టుకూలి మీద పడడంతో ఒకరు మృతి చెందాడు.
తుపాను తీరం దాటినా సోమవారమూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, జిల్లా యంత్రాంగం ప్రకటించింది. జిల్లాలోని 11 మండలాల పరి ధిలో విస్తరించిన తీరప్రాంతంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కా లం గడుపుతున్నారు. సముద్రపు అలలు 2 మీటర్ల ఎత్తుకు ఎగసి పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో సుమారు 100 అడుగుల మేరకు చొచ్చుకురావడంతో తీరప్రాంత గ్రామాల ప్రజలు వణికి పోతున్నారు. తుపాను తీరం దాటినా సోమవారం రాత్రి వరకు ప్రజలు బయటకు రావద్దని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు.