
కాఫీ పంటకు ఎకరాకు రూ.లక్ష చెల్లించాలి
పాడేరు: హుదూద్ తుఫాన్ కారణంగా ఏజెన్సీలో జరిగిన నష్టంపై సమ గ్ర సర్వే జరిపి బాధిత గిరిజన కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలని సీఎం చంద్రబాబునాయుడును పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోరారు. ఏజెన్సీలో జరిగిన నష్టంపై ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గిరిజనుల ప్రధాన జీవనాధారమైన కాఫీ, మిరియాల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నందున ఎకరాకు కనీసం రూ.లక్ష పరిహారంగా చెల్లిం చాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే కాఫీ కుటుంబాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. వరి, ఇతర వాణిజ్య పంటలకు కూడా నష్టపరిహారం పెద్దమొత్తంలో చెల్లించాలన్నారు. ఇళ్లు కూలిన బాధిత గిరిజనులకు పక్కా గృహాలు వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీలోని పలు సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళుతూ ఐటీడీఏ సేవలు విస్తృతం చేయాలని, ఉన్నత విద్యా సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని, అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు.
విద్యార్థులకు సినిమాలు చూపించండి
ఏజెన్సీలోని గిరిజన విద్యార్థుల ఆలోచనా విధానంలో మార్పు రావాలం టే పాడేరులో ఓ థియేటర్ సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చి సినిమాలు చూపించాలని సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే నెలలో కనీసం మూడు రోజులు విశాఖ నగరంలో తిప్పాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను శుక్రవారం సందర్శించారు.
విద్యార్థులను పలు కుశలు ప్రశ్నలు వేశారు. సినిమాలు చూస్తారా, విశాఖ వెళ్తుంటారా వంటి ప్రశ్నలకు వారు సరియైన సమాధానం చెప్పక పోవడంతో సినిమాలు చూపించాలని ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్‌ను ఆదేశించారు. పాడేరులో అధునాతన సదుపాయాలతో ఓ థియేటర్ నిర్మించాలని సూచించారు. ల్యాప్‌టాప్, ఐపాడ్, కంప్యూటర్ వినియోగంపై సమాధానాలు చెప్పక పోవడంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్యపై అవగాహన కల్పించాలని తెలిపారు.
అనంతరం విద్యార్థినులందరితోను మాట్లాడి వారి ఆశయాలు తెలుసుకున్నారు. తల్లిదండ్రులు ఆర్థికంగా ఆసరా ఇచ్చే కాఫీ సాగు చేపట్టేలా ఒత్తిడి చేయాలని విద్యార్థులకు సూచించారు. అంతకు ముందు ఏజెన్సీలోని విద్యా కార్యక్రమాలపై గిరిజన సంక్షేమ క మిషనర్, ఐటీడీఏ పీఓ, గిరిజన సంక్షేమ డీడీలతో ముఖ్యమంత్రి సమీక్షించారు. సీఎం వెంట పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి మణికుమారి, గిరిజన సంక్షేమ కమిషనర్ ఉదయలక్ష్మి, ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్, సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, గిరిజన సంక్షేమ డీడీ మల్లికార్జునరెడ్డి ఉన్నారు.