ఆయన దత్తత గ్రామానికీ తప్పని కరెంటు కష్టాలు
దానవారుుపేటలో లోడెక్కువై పాడవుతున్న ట్రాన్స్‌ఫార్మర్లు
తొండంగి : కలెక్టర్ దత్తత తీసుకున్న దానవాయిపేట గ్రామానికి కరెంటు ఇక్కట్లు తప్పలేదు. తీరప్రాంత గ్రామమైన దానవాయిపేట పంచాయతీలో నర్సిపేట, తాటియాకులపాలెం, ఒంటిమామిడి, కొత్తపాకల గ్రామాలున్నాయి. కలిసి ఉండే దానవాయిపేట, నర్సిపేట, తాటియాకులపాలెం గ్రామాల్లో 4 వేల వరకూ జనాభా ఉంది. ఆయా గ్రామాల్లో 800 వరకూ ఇళ్లున్నాయి. ఓవర్‌లోడ్ విద్యుత్ సమస్య తలెత్తకుండా పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. తీరప్రాంతంలో హెచరీలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌కు డిమాండ్ ఏర్పడింది. విద్యుత్ కనెక్షన్లు అధికంగా ఉండటంతో, లోడు ఎక్కువై తరచూ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటున్నాయి. మూడేళ్ల క్రితం పలుచోట్ల కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. మళ్లీ అదే సమస్య పునరావృతం కావడంతో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమస్యను ట్రాన్‌సకో ఉన్నతాధికారులకు నివేదించామని సర్పంచ్ చొక్కా హరిబాబు తెలిపారు. రామాలయం వెళ్లే మార్గంలోనూ, హైస్కూలు వద్ద తదితర ప్రాంతాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లు సక్రమంగా పనిచేయడం లేదు.
టెన్త్ విద్యార్థులకూ ఇబ్బందులు
విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పదో తరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. టాన్స్‌ఫార్మర్లు మొరాయిస్తుండడంతో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. రాత్రివేళ కారుచీకట్లో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ట్రాన్స్‌ఫార్మర్ అస్తమాను పోతుంది
హైస్కూలు వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ నిత్యం మరమ్మతులకు గురవుతోంది. దీనిని బాగు చేసేందుకు అన్ని వేళల్లో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. దీంతో కరెంటు సక్రమంగా ఉండటం లేదు. - సిరిపిన హరిబాబు, గ్రామస్తుడు, దానవాయిపేట
కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నాం
రాత్రి, పగలు తేడాలేకుండా ఎక్కువ సార్లు కరెంటు పోతోంది. ఎండవేడి కారణంగా ఇంట్లోనూ కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నాం. విద్యుత్ సరఫరాలో సమస్యలు లేకుండా చూడాలి. - సీహెచ్ చిలకమ్మ, గ్రామస్తురాలు, దానవాయిపేట
విద్యార్థులకూ ఇబ్బందులు
గ్రామంలో విద్యుత్ సమస్యతో పదో తరగతి, ఇతర పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రాత్రి సమయాల్లో చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మరిన్ని ట్రాన్స్‌ఫార్మర్లు వేసి, సమస్యను పరిష్కరించాలి.
- యజ్జల మాంబుల్లోడు, గ్రామపెద్ద, దానవాయిపేట
చర్యలు తీసుకుంటున్నాం
గ్రామంలో విద్యుత్ సరఫరా సమస్య మా దృష్టికి వచ్చింది. అదనంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి, సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - శ్రీనివాసమూర్తి, ఎలక్ట్రికల్ ఏఈ, తొండంగి మండలం