పట్టణాలకు వెలుగులు
మెరుగైన విద్యుత్ సరఫరా కోసం ఏర్పాట్లు
ఎన్పీడీసీఎల్ పరిధిలో రూ.200 కోట్లతో పనులు
33 నగరాలు, పట్టణాల్లో కొత్త సబ్‌స్టేషన్లు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు
కేంద్రం సాయంతో ప్రత్యేక ప్రాజెక్టు అమలు
వరంగల్ : దేశంలోని ప్రతీ ఇంటికి మెరుగైన విద్యుత్ సరఫరా చేయడం లక్ష్యంగా కేంద్రప్రభుత్వం సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు భారీగా మేలు జరగనుంది. ప్రతీ నగరం, పట్టణంలో అవసరాలకు సరిపడా విద్యుత్ సరఫరా కోసం మెరుగైన ఏర్పాట్లను ఈ పథకం ద్వారా చేపడుతారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ప్రతీ కాలనీలో విద్యుత్ సరఫరా లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇలా కేంద్రప్రభుత్వ పథకం ద్వారా డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్) ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది.
ప్రతీ ఇంటికి విద్యుత్
దేశంలోని ప్రతీ ఇంటికి విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ విద్యుదీకరణ ప్రాజెక్టును అమలు చేస్తోంది. నగరాలు, పట్టణాలు, పల్లెల్లోని ప్రతీ ఇంటికి కరెంట్ ఇవ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద చేపట్టే పనులకు 60 శాతం నిధులను కేంద్రం మంజూరు చేస్తోంది. మిగిలిన మొత్తాన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కం) భరించాల్సి ఉంటుంది. అయితే, విద్యుత్ పంపిణీ సంస్థలు భరించే మొత్తాన్ని రుణాల రూపంలో సమకూర్చుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ రుణాలను సమకూర్చుకుంటాయి.
17 జిల్లాలు.. 33 పట్టణాలు
సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకం కింద తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగపరిచేందుకు పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు 17 జిల్లాల్లోని 33 పట్టణాల్లో ఈ పథకం అమలు కానుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు పట్టణాల్లో ఈ పథకం పనులు చేపడుతారు. మొత్తం ప్రాజెక్టు కోసం రూ.200 కోట్లు ఖర్చవుతుందని ఎన్పీడీసీఎల్ ప్రణాళికలు రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.120 కోట్లు చెల్లిస్తుంది. ఎన్పీడీసీఎల్ మిగిలిన రూ.80 కోట్లను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణాల రూపంలో సమకూర్చుకోనుంది. కాగా, కొత్త ప్రాజెక్టు అమలులో భాగంగా వరంగల్ పట్టణంలో రెండు 33/11 కేవీ సబ్‌స్టేషన్లు కొత్తగా నిర్మించనున్నారు. ఇంకా మిగిలిన జిల్లాల్లోనూ సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లతో పాటు కొత్త లైన్లను ఏర్పాటుచేస్తారు.