రాజధానికి కొత్త సబ్స్టేషన్లు
తుళ్లూరు, ఐనవోలు మధ్య 400 కేవీ సబ్‌స్టేషన్
అమరావతి, తాడేపల్లి, యూనివర్సిటీల దగ్గర 130 కేవీ
రాజధాని జోన్ అంతటా భూగర్భ కేబుల్ లైన్లు
నగరం పూర్తయితే పదేళ్ల వరకూ 500 మెగావాట్ల లోడ్ అంచనా
రూ.800 కోట్లతో పూర్తయ్యే పనులకు విద్యుత్ శాఖ ప్రతిపాదనలు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని కోసం కొత్తగా విద్యుత్ సబ్స్టేషన్లు రూపుదిద్దుకోనున్నాయి. రాగల పదేళ్లలో పెరిగే జనావాసాలు, నిర్మితమయ్యే ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలకు సరిపడా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు విద్యుత్‌శాఖ సిద్ధమవుతోంది. సుమారు 500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను అందుకునేందుకు వీలుగా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, అమరావతి ప్రాంతాల్లో నూతన సబ్స్టేషన్లు, భూ గర్భ కేబుల్ లైన్లు, విద్యుత్ ఫీడర్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తోంది. రాజధాని జోన్లో మొత్తం రూ.800 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) సిద్ధం చేస్తోంది. రాజధాని ప్రతిపాదిత తుళ్లూరు, మంగళగిరి ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్‌కు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో సింగపూర్ ప్రతినిధి ఖూ టెంగ్ షీ పర్యటన ముగిశాక నూతన రాజధాని రూపకల్పనకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుంది.
ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, వాణిజ్య సముదాయాలు, పరిపాలనా భవనాలు ఎక్కడ ఉంటాయో నిర్ణయించాక ఆ ప్రాంతాలకు ఎంతమేర విద్యుత్ అవసరమో ఒక అంచనా వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న విద్యుత్ శాఖ అధికారులు కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌కు చెందిన కన్స్ట్రక్షన్స్ విభాగం చీఫ్ ఇంజనీర్ దేవానంద్ బృందం రెండు రోజుల కిందట తుళ్లూరు మండలంలో పర్యటించి సబ్స్టేషన్ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను పరిశీలించింది. ఐనవోలు ప్రాంతంలో కనీసం 20 ఎకరాలన్నా అందిస్తే గ్యాస్ ఇన్సులేటెడ్ ఇండోర్ సబ్‌స్టేషన్ అయినా నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం రూ.300 కోట్లు ఖర్చు కావచ్చని సీఈ దేవానంద్ చెప్పారు. తాడేపల్లి దగ్గరున్న 130 కేవీ సబ్‌స్టేషన్‌ను 220 కేవీగా మార్చాలని నిర్ణయించారు. అమరావతి, అచ్చంపేట ప్రాంతాలతో పాటు అసెంబ్లీ సమావేశాలు జరుప నిశ్చయించిన నాగార్జునా యూనివర్సిటీ ప్రాంతంలో 130 కేవీ సామర్థ్యంగల 4 సబ్స్టేషన్లు నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు.
ప్రతిపాదిత రాజధాని జోన్‌లోని అన్ని క్లస్టర్లలోనూ అభివృద్ధి చేసే రోడ్ల కింద భూగర్భ కేబుల్ లైన్లు నిర్మించి విద్యుత్ సరఫరా చేయడానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. అలాగే రాజధాని ప్రాంతంలోని వ్యవసాయ భూముల్లో సుమారు ఐదువేలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిని ఐదేళ్ల పాటు అలాగే ఉంచి నీటి అవసరాలకు వినియోగించవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో మరోసారి రాజధాని జోన్లో పర్యటించే విద్యుత్ అధికారుల బృందం ఈ నెలఖారులోగా డీపీఆర్ నివేదికను ప్రభుత్వానికి అందజేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.