
రాలిపోతున్న రైతన్నలు
విద్యుత్ షాక్‌లు, ఆత్మహత్యలు
‘సాగు’ కష్టాలకు దర్పణం
తల్లడిల్లుతున్న మెతుకుసీమ
చోద్యం చూస్తున్న అధికారులు
ఒకవైపు విద్యుత్‌షాక్‌లు.. మరోవైపు ఆత్మహత్యల కారణంగా రైతన్నలు రాలిపోతుండటంతో మెతుకుసీమ తల్లడిల్లుతోంది. వర్షాభావ పరిస్థితులతో పంటలు పండే అవకాశం లేక.. అప్పులు తీర్చే మార్గం కానరాక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కాగా ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద తలెత్తే చిన్నచిన్న లోపాలను సరిచేయడంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులే సొంతంగా మరమ్మతులు చేయడానికి సిద్ధమవుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా సోమవారం కొండపాక మండలం మర్పడగ గ్రామంలో చోటుచేసుకున్న రైతు కనకయ్య దుర్ఘటన విషాదాన్ని నింపింది. జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు వ్యవసాయరంగ దుస్థితిని చాటుతున్నాయి.
గజ్వేల్: జిల్లాలోని ఆయా మండలాల్లో ఎంతోకాలంగా విద్యుత్ శాఖ రైతులకు సేవలందించడంలో వైఫల్యాన్ని చాటుకుంటూ వస్తోంది. పొలాల్లో స్తంభాలు వంగి వైర్లు చేతికందే స్థాయిలో వేలాడుతున్నా.. ట్రాన్స్‌ఫార్మర్లు చిన్నచిన్న లోపాలతో పనిచేయకున్నా, విద్యుత్ లైన్‌లు రైతులను ఇబ్బందిపడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నాలుగేళ్ల కాలంలో జిల్లాలో వందలాది మంది దుర్మరణం పాలయ్యారు. ప్రత్యేకించి గజ్వేల్ నియోజకవర్గంలో 60 మందికిపైగా రైతులు విద్యుత్ షాక్‌లతో మృతిచెందడం కలవరాన్ని సృష్టిస్తోంది. గజ్వేల్ పట్టణానికి చెందిన వెల్దండ నర్సారెడ్డి అనే రైతు క్యాసారం గ్రామ సమీపంలో అయిదెకరాల సొంత పొలం వుంది. ఇందులో వరినాట్లు వేసిన ఆ రైతు.. పొలంలో యూరియా చల్లుతూ చేతికందే స్థాయిలో వున్న వైర్లను తాకి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన.. 2010 ఆగస్టు 16న జరిగింది. అదే ఏడాది జూలై 7న తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద పాలేరుగా పనిచేస్తున్న వడ్డెపల్లి నర్సింలు ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు చేస్తూ షాక్‌కు గురై మృతిచెందాడు. 2011 జూలైలో బంగ్లావెంకటాపూర్‌లో మెతుకు అంజిరెడ్డి(60) విద్యుత్ షాక్‌కు బలైపోవడం ఆందోళన కలిగించింది. ఇదే క్రమంలో గజ్వేల్ మండలం రిమ్మనగూడలో ఏడాదిన్నర క్రితం గణేష్‌గౌడ్ అనే యువరైతు పొలంలోని వైర్లను తాకి మృత్యువాత పడ్డాడు. 2014 మార్చి 31న గజ్వేల్ మండలం కోమటిబండలో ఉబ్బని రామయ్య అనే రైతు అర్ధరాత్రి కరెంట్‌కు బలైన సంగతి తెలిసిందే. తడారిన పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన రామయ్య పొలంలో తెగిపోయి వేలాడుతున్న వైరును తాకడంతో షాక్‌కు గురై మృతిచెందాడు. ఈ క్రమంలోనే తాజాగా కొండపాక మండలం మర్పడగ గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను రిపేర్ చేస్తూ కనకయ్య దుర్మరణం చెందిన సంఘటన రైతుల దుస్థితిని చాటుతుంది.
ఆందోళన కలిగిస్తున్న రైతు ఆత్మహత్యలు..
వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు పండే అవకాశంలేదని, ఇలాంటి పరిస్థితుల్లో అప్పులు తీర్చలేమని మనోస్థైర్యం కోల్పోతున్న రైతులు జిల్లాలో వరుసగా బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఈ నెల 13న కొండపాక మండలం మంగోల్ గ్రామంలో చిట్యాల రామలింగారెడ్డి(69), 4న గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో కొడిశెల రవి(35), అదే గ్రామంలో జూన్ 24న ఫిరంగి ఎల్లయ్య(50), గత నెల 14న గజ్వేల్ మండలం ముట్రాజ్‌పల్లి గ్రామంలో చీర్ల యాదయ్య(50), 17న జగదేవ్‌పూర్ మండలం రాయవరం గ్రామంలో భిన్నమైన ముత్యాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.