పరిహారం... పరిహాసం!
కామారెడ్డి : తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాలో 76 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందులో ప్రభుత్వం 11కుటుంబాలకు మాత్రమే పరిహారం అందించింది. డివిజనల్ స్థాయి త్రిసభ్య కమిటీ (ఆర్డీవో, డీఎస్పీ, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు)బృందం బాధిత కుటుంబాలను కలిసి ఆత్మహత్యకు గల కారణాలు, అప్పుల వివరాలను సేకరించాల్సి ఉంటుంది. అయితే చాలాచోట్ల అధికారులు మొక్కుబడి విచారణ జరిపి ఆత్మహత్యలకు ఇతర కారణాలను చూపడం వల్లే సాయం అందకుండాపోయిందని బాధిత కుటుంబాలు ఆవేదన చెందుతున్నా యి.
ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు గతంలో రూ.లక్షన్నర ఇచ్చేవారు. తెలంగాణ ప్రభుత్వం 2015 జూన్ నుంచి రూ.6 లక్షలకు పెంచింది. మొదట రూ.లక్ష, తర్వాత రూ.5 లక్షలు చెల్లించే విధానాన్ని తీసుకువచ్చింది. ఆత్మహత్యలతో వీధినపడ్డ రైతు కుటుంబాలకు ఈ సాయం ఆసరానిస్తుందనకుంటే, అధికారుల రిపోర్టులతో సాయం అందకుండాపోయింది.
రైతుల కుటుంబాలది ఒక్కొక్కరిదీ ఒక్కో పరిస్థితి..
ఇంటిపెద్దను కోల్పోయిన బాధ ఒక వైపు, అప్పులు ఆ కుటుంబాలకు మరింత భారమయ్యాయి. పిల్లల పోషణకే పాట్లు పడాల్సిన పరిస్థితి, మరోవైపు అప్పులు బాధిత కుటుం బాలను మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. బాన్సువాడలోని సంగమేశ్వరకాలనీ కి చెందిన రైతు ముర్కుంజల అశోక్ (32) 2014 సెప్టెంబర్ 10న పంటచేనులోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహ త్య చేసుకున్నాడు. సొంతభూమితో పాటు కౌలుకు తీసుకుని సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీం తో ఆయనపై ఆధారపడ్డ భార్య స్వరూప, పిల్లలు సద్గుణ, సయిప్రసాద్‌లు అనాథలయ్యారు. భర్త మృతితో అప్పులు తీర్చేదారి లేక అశోక్ భార్య అనేక తంటాలు పడుతోంది. పూరిగుడిసెలో నివాసముంటున్న స్వరూప పిల్లల్ని ఎలా పోషించాలో తెలియక ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం సాయం అందించి ఆదుకుంటుందని ఆశించిన ఆ కుటుంబానికి నిరాశే ఎదురైంది.
సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లికి చెందిన శివశెట్టి భూమప్ప(46) 2015 అక్టోబర్ 12న పొలంవద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బోరు ఎత్తిపోయి పంట దెబ్బతిని అప్పులపాలైన భూమన్న ఆత్మహత్యకు పాల్పడడంతో ఆయన భార్య లక్ష్మి, కొడుకు కుమార్ ఇబ్బందులపాలయ్యారు. ఆత్మహత్యపై అధికారులు విచారణ జరిపి వెళ్లినా ఇప్పటిదాకా సాయం అందలేదు. ఇదే మండలంలోని మర్కల్‌కు చెందిన రైతు ఏనుగు లింగారెడ్డి (35) బోర్లు తవ్వించి అప్పుల పాలయ్యా డు. అప్పులు తీర్చే దారిలేక, పంటలు సరిగా పండక 2016 జూన్ 21న ఉరివేసుకుని చనిపోయాడు. దీంతో ఆయన తల్లిదండ్రులు ఆశన్న, శ్యామవ్వ, భార్య భానుమతి, కూతురు రసజ్ఞలు కష్టాల్లో కూరుకుపోయారు. అప్పుల భారం వారిపై పడింది. ఇలా జిల్లాలో 76 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు రికార్డులు చెబుతున్నా యి. అయితే ప్రభుత్వం 11 మంది రైతులకు మాత్రమే పరిహారం అందిం చి చేతులు దులుపుకుంది. మిగతా రైతుల మరణాలకు ఏవో కారణాలు చూపిన అధికారులు చేతులెత్తేశారు.
మాచారెడ్డి మండలం పాల్వంచకు చెందిన రైతు చాకలి నర్సింలు 2014 అక్టోబర్ 21న పంట చేనులోనే చెట్టు కు ఉరివేసుకున్నాడు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిలో బోరు వేసి వ్యవసాయం చేసేవాడు. బోరు ఎత్తిపోవడంతో అప్పు చేసి మరో బోరు తవ్వించాడు. నీళ్లు పడలేదు. అప్పు మీదపడింది. ఇక్కడ లాభం లేదని మరింత అప్పు చేసి గల్ఫ్‌కు వెళ్లాడు. అక్కడ ఆయన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. విజిట్ వీసాలపై వెళ్లినవాళ్లను వెనక్కి పంపడంతో తిరిగివచ్చాడు. మళ్లీ అప్పు చేసి బోరు వేయించగా కొద్దిపాటి నీళ్లు వచ్చాయి. ఆశతో పంటలు సాగు చేసిన నర్సింలు అనేక ఇబ్బందులకు గురయ్యా డు.
ప్రభుత్వం బ్యాంకు రుణాలు మాఫీ చేస్తుందని తెలిసి తనకున్న అప్పు మాఫీ అవుతుందని ఆశపడ్డ నర్సింలు మండల కార్యాలయాలకు వెళ్లాడు. అక్కడ జాబి తాలో తన పేరు లేకపోవడంతో నిరాశకు గురై పంట చేను వద్దకు వెళ్లి ఉరిపోసుకుని చనిపోయాడు. దీంతో ఆయన భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డునపడ్డారు. ప్రభుత్వం నుంచి మాత్రం నర్సింలు కుటుంబానికి నయాపైసా రాలేదు. ఇలా ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలు సాయం కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి అలసిపోయారు.