కరెంటు తీగలు కరిగిపోతున్నాయ్..
సాక్షి, సిటీబ్యూరో: ఏసీలో కూర్చుంటే ఎవరికైనా వెన్నులో వణుకుపుట్టాలి. కానీ రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్ చూస్తే విద్యుత్ అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. మహానగరం రోజురోజుకు పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో తట్టుకోలేక తల్లడిల్లిపోతోంది. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం ఒక్కసారిగా పెరగడంతో విద్యుత్ వినియోగం కూడా రెట్టింపైంది. విద్యుత్ పంపిణీ సంస్థ చరిత్రలో అత్యధికంగా ఈ ఏడాది ఏప్రిల్ ఐదో తేదీన 54.74 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గత ఏడాది మే 26న రికార్డుస్థాయిలో 53.2 మిలియన్ యూ నిట్ల విద్యుత్ వినియోగం జరుగగా, ఈ ఏడాది నెల రోజుల ముందే రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం. రానున్న రోజుల్లో ఇది 58 ఎంయూలు దాటే అవకాశం ఉన్నట్లు ఓ అంచనా.
ఉడుకుతున్న కేబుళ్లు.. కరుగుతున్న తీగలు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 39 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 32.5 లక్షలు గృహ, 5.5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు మరో 40 వేలకుపైగా ఉన్నాయి. వీటి అవసరాలు తీర్చేందుకు అవసరమైన కరెంట్ ఉన్నా పగటి ఉష్ణోగ్రతలకు తోడు ఒక్కసారిగా వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పెరుగుతోంది. సూర్యుని వేడికి డిస్ట్రిబ్యూషన్ వైర్లు కరిగి సాగుతున్నాయి.
భూగర్భ కేబుళ్లు వేడికి ఉడికిపోయి జాయింట్స్ వద్ద కాలిపో తున్నాయి. ఇలా ప్రతి రోజూ రెండు మూడు ఫీడర్ల పరిధిలో ఈ సమస్య తలెత్తుతోంది. ఇదిలా ఉంటే ఆయిల్ లీకేజీలకు తోడు ఓవర్ లోడు వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. వీటి స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ అమర్చి విద్యుత్ పునరుద్ధరించడం లో తీవ్ర జాప్య ం జరుగుతోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు అత్యవసర లోడ్ రిలీఫ్‌ల పేరుతో కోతలు అమలు చేస్తున్నారు. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న శివారు ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది.