గాలీవాన బీభత్సం
చౌడేపల్లె, న్యూస్‌లైన్: మండలంలో శనివారం రాత్రి గాలీవాన బీభత్సాన్ని సృష్టించింది. మండలంలోని పలు గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. టమాట, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చారాల, దుర్గసముద్రం, ఏ కొత్తకోట గ్రామ పంచాయతీల్లో టమోట, మామిడి కాయలు నేలరాలాయి. దుర్గసముద్రం, దాదేపల్లె, ఓదులపేట, అంకుతోటపల్లె, కుంచినపల్లె, ఏ.కొత్తకోట, బుటకపల్లె తదితర గ్రామాల్లో వడగండ్లుతో పాటు గాలులతో కూడిన వర్షం కురవడంతో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.
బుటకపల్లె , ఓదులపేట కీలేరుల వద్ద సుమారు 12 స్తంభాలు నేలకొరిగాయి. రెండు ట్రాన్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులకు భారీ చెట్లు నెలకొరిగాయి. పంటలు చేతికివచ్చే సమయంలో మామిడి కాయలు నేలరాలడంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. గాలీవాన బీభత్సంతో 200 ఎకరాల్లో టమాట పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 200 ఎకరాల్లో మామిడి కాయలు గాలికి నేలరాలాయి లక్షలాది రూపాయలు ఆస్తినష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
పుంగనూరులో..
పుంగనూరు: గాలీవాన బీభత్సంతో పుంగనూరు మండలంలో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిం ది. శనివారం సాయంత్రం నుంచి గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీని కారణంగా పుంగనూరు మండలంలో సుమారు 96 ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. ఫలితంగా సుమారు రూ.20 లక్షల మేరకు నష్టం వాటిల్లింది. అలాగే మామిడి, వేప, తుమ్మ, మునగ, కొబ్బరి, అర్కీలిఫాం చెట్లు సైతం నేలకొరిగాయి. వీటితో పాటు కొత్తిమీర, టమాట పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని నల్లగుట్లపల్లెలో జి.చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన పది ఎకరాల మామిడి తోటలో కాయలు రాలిపోయాయి.
అలాగే మర్రిమాకులపల్లెకు చెందిన రత్నమ్మకు చెందిన 15 ఎకరాల్లో , నల్లురుపల్లె రామిరెడ్డికి చెందిన 4 ఎకరాల తోట, జయరామిరెడ్డికి చెందిన 30 ఎకరాల తోట , మర్రిమాకులపల్లె నాగరాజారెడ్డికి చెందిన 7 ఎకరాల తోట, అలాగే కృష్ణప్ప, శ్రీనివాసులు, చంద్రప్పకు చెందిన 20 ఎకరాల తోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి. పుంగనూరు సమీపంలోని మాదనపల్లెకు చెందిన వి.సుబ్రమణ్యంకు చెందిన 20 ఎకరాల మామిడి తోట,కృష్ణప్పకు చెందిన 5 ఎకరాల తోటలో మామిడి కాయలు రాలిపోయాయి. మామిడి తోటల్లో బెనీషా, బాదం, బెంగళూరు, నీలం కాయలు రాలిపోవడంతో ఒకొక్క రైతుకు సుమారు లక్షకుపైగా నష్టం వాటిల్లింది. ఆకాల వర్షాలతో మామిడి పంట రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటకు రాని కాయలను విక్రయించుకోలేక అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
పెద్ద పంజాణి మండలంలో..
పెద్దపంజాణి: పెద్దపంజాణి మండలంలో శనివారం రాత్రి పెనుగాలులు బీభత్సంతో భారీ నష్టం వాటిల్లింది. దీంతో పలువురు రైతులు, వ్యాపారస్తులు, ప్రజలు తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడడంతో చాలా పల్లెలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. సుమారు 200 ఎకరాల్లోని మామిడి కాయలు నేలరాలాయి. మామిడి తోటలు కొనుగోలు చేసిన వ్యాపారులు, రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
చాలా మంది అప్పులు చేసి మరీ మామిడి తోటలను కొన్నారు. అలాగే గురివిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దొరస్వామి, నరసింహయ్య, వెంకట్రామయ్యలకు చెందిన రేకులు గాలులకు లేచిపోవడంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలాగే ముత్తుకూరు రోడ్డులోని గుణ అనే వ్యక్తికి చెందిన ఇంటిపై చెట్టు కూలింది. అదృష్టవశాత్తూ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. రాయలపేట సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రైవేట్ పాఠశాలకు చెందిన రేకులన్నీ పూర్తిగా లేచిపోయాయి. కూరగాయల కొత్తపల్లెకు చెందిన హరినాథ్ నూతనంగా నిర్మిస్తున్న కోళ్లషెడ్ నేలమట్టమైంది. ఈ ప్రమాదంలో తీవ్ర నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.
అలాగే పలు చోట్ల పూరిగుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కెళవాతి, వీరప్పల్లె, మంగప్పల్లె, పాత వీరప్పల్లె, సుద్దగుండ్లపల్లె గ్రామాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. కెళవాతి వద్ద ఐదు విద్యుత్ స్తంభాలు, సుద్దగుండ్లపల్లె వద్ద నాలుగు, శ్రీరామాపురం వద్ద ఐదు విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. కొండేపల్లె క్రాస్ వద్ద 33కేవీ విద్యుత్ లైన్ తెగి పడడంతో కరసనపల్లె, ముత్తుకూరు గ్రామాలకు రాత్రంతా కరెంట్ సరఫరా నిలిచిపోయింది.