
ట్రాన్స్‌ఫార్మర్ల కష్టాలు
పెండింగ్‌లో 32 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు
తీవ్ర ఇబ్బందుల్లో రైతులు
బోర్లలో నీరున్నా ప్రయోజనం సున్నా
అనంతపురం టౌన్ :
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రైతులు నష్టపోతున్నారు. బోర్లలో నీరు పుష్కలంగా ఉన్నా.. సకాలంలో విద్యుత్ కనెక్షన్ రాకపోవడంతో పంటలు సాగు చేయలేకపోతున్నారు. అనధికారికంగా కనెక్షన్ తీసుకుందామంటే ట్రాన్స్‌ఫార్మర్‌పై అధిక లోడ్ పడుతుందన్న నెపంతో తోటి రైతులు అంగీకరించకపోతుండడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. దీంతో కనెక్షన్ కోసం ట్రాన్స్‌కో అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా అతీగతీలేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పుడు కనెక్షన్లు మంజూరు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో వర్షాధారంగా 8.75 లక్షల హెక్టార్లు, బోరుబావుల కింద 1.57 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 2.10 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు భూగర్భ జలాలు మెరుగ్గా ఉన్న చోట బోర్లు వేసుకోగా పుష్కలంగా నీరు పడటంతో 32 వేల మంది రైతులు విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ బోర్ల కింద కూడా పంటలు సాగైతే మరో లక్ష ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం పెరుగుతుంది. అయితే.. ట్రాన్స్‌కో అధికారులు మాత్రం కనెక్షన్ల మంజూరుకు కాలయాపన చేస్తున్నారు. ప్రస్తుతం రెండేళ్ల కింద దరఖాస్తు చేసుకున్న వారికి కనెక్షన్లు ఇస్తున్నారు. వీటన్నింటికీ మెటీరియల్ సరఫరా చేస్తే ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చడం కూడా అధికారులకు పెద్ద సవాలే.
పెండింగ్ కనెక్షన్లు పూర్తయ్యేదెన్నడో?
ప్రతి ఐదు వ్యవసాయ కనెక్షన్లకు ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలి. ఈ లెక్కన 32 వేల కనెక్షన్‌లకు ఏడు వేలకు పైగా ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చాలి. వీటితో పాటు దిమ్మెలు నిర్మించాలి. ప్రస్తుతం ప్రతి నెలా వంద కనెక్షన్లు కూడా మంజూరు చేయడం లేదు. దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ కనెక్షన్లు మంజూరు కావాలంటే ప్రజాప్రతినిధులు ప్రత్యేక బడ్జెట్ ద్వారా మెటీరియల్, ట్రాన్స్‌ఫార్మర్లు తీసుకురావాల్సిన అవసరముంది.
మెటీరియల్ కంటే దరఖాస్తులే ఎక్కువ
జిల్లాలో వ్యవసాయ కనెక్షన్ల కోసం రైతుల నుంచి భారీగా డిమాండ్ ఉంది. ప్రస్తుతం 32 వేల వరకూ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి ఎప్పటిలోగా పూర్తి చే యగలమని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వస్తున్న మెటీరియల్ కంటే రైతుల దరఖాస్తులే అధికంగా ఉంటున్నాయి. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నీ క్లియర్ కావాలంటే ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి.
- ప్రసాద్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ