పంచుకుతిన్నది..రూ.15కోట్ల పైనే!
- ఎన్పీడీసీఎల్‌లో భారీ కుంభకోణం
- 11,223 ట్రాన్స్‌ఫార్మర్లకు అదనంగా చెల్లించిన అధికారులు
- ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.13వేల పైచిలుకు చెల్లింపు
హన్మకొండ, న్యూస్‌లైన్ : మనం ఏదైనా కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు వెళ్తే రూ.100 చెప్పిన వస్తువును రూ.80కు ఇవ్వాలంటూ బేరమాడతాం. రూ.100 వస్తువుకు రూ.150 మాత్రం చెల్లించేందుకు అంగీకరించం. కానీ, ఎన్పీడీసీఎల్ అధికారులు అదే చేశారు.
వినియోగదారుల నుంచి రూపాయి రూపాయి ముక్కుపిండి వసూలు చేస్తున్న సొమ్మును కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు. ఇప్పటికే కేబుల్ కుంభకోణంతో అభాసుపాలైన అధికారులు... ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలులోనూ చేతివాటం ప్రదర్శించారు. ఈ వ్యవహారంలో ఒకటి కాదు రెండు కాదు.. కాంట్రాక్టర్లతో కలిసి రూ.15 కోట్లు పంచుకున్నారు. కంపెనీ ధరను కాదని అదనంగా చెల్లించిన ఈ వ్యవహారం తాజాగా వెలుగు చూసింది.
హెచ్‌వీడీఎస్ కింద కొనుగోళ్లు
ఎన్పీడీసీఎల్ పరిధిలోని వరంగల్ సర్కిల్‌తో పాటు పలు డివిజన్లలో 2010-2011 ఆర్థిక సంవత్సరంలో ట్రాన్స్‌ఫార్మర్లను కొనుగోలు చేశారు. హై ఓల్టేజీ డిస్ట్రిబ్యూటరీ సిస్టం(హెచ్‌వీడీఎస్) కింద 16కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు 6114, 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు 5109 కొనుగోలు చేశారు.
వీటి కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించినప్పుడు కాంట్రాక్టర్లు 16 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.47,687, 25 కేవీకేకు రూ.54,553 చొప్పున కోట్ చేశారు. కానీ అంతకుముందు అధికారులు రూ.37,200, రూ.47,724 గానే ధర నిర్ధారించారు. అయితే, ఈ ధరకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో మూడుసార్లు పరిశీలించిన అధికారులు చివరకు 16 కేవీఏకు రూ. 46,350, 25 కేవీఏ ట్రాన్మ్‌ఫార్మర్‌కు రూ.54,570గా కంపెనీ ధరను నిర్ణయించారు.
ఇక్కడే కలిసిపోయారు..
మూడు సార్లు ధరలను పరిశీలన చేసి సవరించిన కాలంలోనే కాంట్రాక్టర్లు, అధికారులు కలిసిపోయారు. తలా కొంత పంచుకునేందుకు ప్లాన్ వేశారు. సవరించిన ధర కంటే అదనంగా చెల్లింపులు చేసేందుకు పకడ్బందీగా పథకం రచించారు. విద్యుత్ సరఫరాకు ట్రాన్స్‌ఫార్మర్లు ఇస్తే సరిపోతుంది... ధరలు ఎవరు చూస్తారనే నెపంతో ప్రజాధనాన్ని దోచుకోవాలని ప్లాన్ చేశారు. కాంట్రాక్టర్లు ట్రాన్స్‌ఫార్మరు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదనే సాకుతో ఎన్పీడీసీఎల్ అధికారులు ధరలను సవరించారు. 16కేవీఏ ట్రాన్మ్‌ఫార్మర్‌కు రూ.46,350, 25 కేవీకేకు రూ.54,570 చెల్లించేందుకు అంగీకరించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా 16 కేవీకే ట్రాన్మ్‌ఫార్మర్‌కు రూ.59,581 చొప్పున అంటే మార్కెట్ ధర కంటే రూ.13,231 అదనంగా చెల్లించారు. ఇక 25 కేవీకేకు రూ.68,248 చొప్పున అంటే ఒక్కో ట్రాన్మ్‌ఫార్మర్‌కు రూ.13,678 అదనంగా చెల్లించినట్టు. 16కేవీకే ట్రాన్మ్‌ఫార్మర్లు 6114 కొనుగోలు చేయగా అదనంగా రూ.8,08,94,334, 25 కేవీకే ట్రాన్మ్‌ఫార్మర్లు 5109 కొనుగోలు చేస్తే అదనంగా రూ.6,98,80,902 కాంట్రాక్టర్లకు చెల్లిం చారు.
మొత్తంగా రూ.15,07,75,236 కాంట్రాక్టర్లు అదనంగా చెల్లించిన అధికారులు ఇందులో చెరి సగం పంచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వినియోగదారుల నుంచి రెండు, మూడేళ్ల క్రితం వాడుకున్న విద్యుత్ బిల్లుల్లో రూపాయి సైతం వదలకుండా వసూలు చేసే అధికారులు.. కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు దోచిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.