నీరు లేక పొలాలు ఎండిపోతుండడాన్ని చూసి ఆ ఇద్దరు రైతులు తట్టుకోలేకపోయారు. ట్రాన్‌సఫార్మర్ మరమ్మతులకు స్వయంగా పూనుకున్నారు. ఫ్యూజ్ వేస్తుండగా షాక్‌కు గురై మృతి చెందారు. వీరిద్దరూ వరుసకు అన్నదమ్ములు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను బలిగొందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాదకర సంఘటన గంగాధరనెల్లూరు మండలంలో మంగళవారం చోటు చేసుకుంది.
గంగాధరనెల్లూరు, న్యూస్‌లైన్: మండలంలోని వెజ్జుపల్లెకు చెందిన బొజ్జారెడ్డి కుమారుడు ప్రశాంత్(26), గోవిందరెడ్డి కుమారుడు నరసింహారెడ్డి(40) వరుసకు అన్నదమ్ములు. వ్యవసాయంతో కుటుంబాలను పోషిస్తున్నారు. పొలాల వద్దనున్న ట్రాన్‌సఫార్మర్ రెండు రోజులుగా పనిచేయడం లేదు. మరోవైపు నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో ప్రశాంత్, నరసింహారెడ్డి గ్రామంలోని ట్రాన్‌సఫార్మర్ వద్దకు మంగళవారం వెళ్లారు. ఫ్యూజ్ పోయినట్లు గుర్తించారు. ప్రశాంత్ పైకి ఎక్కి ఫీజు వేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురయ్యాడు. రక్షించేందుకు కింద ఉన్న నరసింహారెడ్డి ప్రశాంత్‌ను పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ షాక్‌కు గురై మృతి చెందారు. ప్రశాంత్ అవివాహితుడు. నరసింహారెడ్డికి భార్య చిన్ని(35), కుమారులు నవీన్ (10 ) ఉదయ్( 9 ), కుమార్తె పద్మిని (7) ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ట్రైనీ ఎస్‌ఐ ధరణీధర్, ఏఎస్‌ఐ రాజేంద్రన్ పరిశీలించారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణం
విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఇద్దరు రైతుల ప్రాణాలు తీసిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేదని సంబంధిత అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ఆరోపించారు. సాధారణంగా ఉదయం 9 గంటలకు విద్యుత్ సరఫరా పోతే రాత్రి వరకు రాదన్నారు. ఇందుకు భిన్నంగా మంగళవారం ఉదయం తొమ్మిదన్నర గంటలకు విద్యుత్ సరఫరా రావడంతో ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆన్ ఆఫ్ లేక పోవడంతోనే విద్యుత్‌షాక్‌కు గురయ్యారని పేర్కొన్నారు. ఇంత జరిగినా ఏ ఒక్క అధికారీ ఇక్కడికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితుల్ని ఓదార్చిన నారాయణస్వామి
బాధిత కుటుంబాలను వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి ఓదార్చారు. విషయం తెలిసిన వెంటనే ఆయన వెజ్జుపల్లెకు చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. రెండునెలల వ్యవధిలో గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో విద్యుత్‌షాక్‌తో ముగ్గురు మృత్యవాత పడ్డారన్నారు. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని మండిపడ్డారు. ఈయన వెంట సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు చిన్నమరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నాయనిరెడ్డి, భాస్కరరెడ్డి, చంద్రబాబురెడ్డి పాల్గొన్నారు.
సమాచారం ఇవ్వలేదు: గుర్రప్ప, ఏఈత్రీ ఫేస్‌కు సంబంధించి తొమ్మిది గంటలకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నాం. అయితే సింగిల్ ఫేస్‌లో సరఫరా ఇస్తున్నాం. ట్రాన్‌సఫార్మర్ పాడైన విషయం, మరమ్మతులు చేస్తున్న సమాచారం రైతులు మాకు తెలియజేయలేదు.
10జిడిఎన్‌సి 01: ప్రశాంత్ (ఫైల్‌ఫొటో)
02: నరసింహారెడ్డి (ఫైల్‌ఫొటో)
03: మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
06: ప్రమాద వివరాలు తెలుసుకుంటున్న నారాయణస్వామి
కాటేసిన కరెంట్
Published Wed, Dec 11 2013 1:20 AM | Last Updated on Sat, Aug 25 2018 6:08 PM
Advertisement
Advertisement