పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు, స్వాధీనం చేసుకున్న రాగివైరు చుట్టలు, చిత్రంలో నాటు తుపాకులు
పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం అందులోని రాగి వైరు చోరీ చేసే ఆరుగురు ముఠా.. ఇళ్లల్లో దొంగతనాలు చేయడమే కాదు; ఆలయాల్లో హుండీలు పగులగొట్టి నగదు దోచుకుంటున్న ఇద్దరు తమిళనాడు దొంగలను చిత్తూరు సబ్‌డివి జన్ పోలీసులు పట్టుకున్నారు. సోమల ఉదంతం నేపథ్యంలో 32 నాటు తుపాకులను సైతం స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరు అర్బన్: ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం వెల్లడించిన వివరాలు..ఐరాల, తవణంపల్లె, కాణిపాకం, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాల్లో రెండేళ్ల కాలంలో పలు వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగివైరును దొంగలు అపహరించారు. రైతులకు కంటికి కునుకు లేకుండా చేశారు. వీరి దెబ్బకు ఆయా ప్రాంతాల రైతులు చేతికందే పంటలు కూడా నష్టపోయారు. బాధితుల ఫిర్యాదుపై డీఎస్పీ సుబ్బారావు పర్యవేక్షణలో చిత్తూరు పశ్చిమ పోలీసులు ఎట్టకేలకు దొంగల భరతం పట్టారు. ఎస్‌ఐలు ప్రసాదరావు, కృష్ణమోహన్, ఉమామహేశ్వర్ సిబ్బందితో ఓ ప్రత్యేక బృందం సభ్యులు ఆరుగురు ముఠాతో కూడిన ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలను అరెస్ట్ చేశారు. పూతలపట్టు మండలం ఆండ్రవారిపల్లెకు చెందిన రాజబాబు, నవీన్, పెనుమూరు మండలం రాజాఇండ్లుకు చెందిన చిన్నబ్బ, పెద్దబ్బ, బాబు, సురేష్‌ను అరెస్టు చేసి వీరినుంచి 250 కిలోల బరువున్న రాగి, అల్యూమినియం, మోటారు కేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు.
నాటు తుపాకులు సీజ్
ఇటీవల సోమల మండలంలో పోలీసులు తమను చూపి పారిపోతున్న కారును వెంబడించి పట్టుకోవడం, అందులో రెండు నాటుతుపాకులు లభ్యం కావడంతో ఉలిక్కిపడ్డారు. దీంతో అక్రమ ఆయుధాలపై పోలీసులు దృష్టి సారించారు. చిత్తూరు పశ్చిమ సీఐ ఆదినారాయణ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు విక్రం, మనోహర్, ఉమామహేశ్వర్ సిబ్బందితో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం మంగళవారం గుడిపాల, చిత్తపార అడవుల్లో పది నాటు తుపాకులు, యాదమరి, భూమిరెడ్డిపల్లె, నంజర్ల ప్రాజెక్టు సమీపంలో 12 తుపాకులు, తవణంపల్లె, ఉప్పరపల్లె, ఎర్రకొండ అడవుల్లో పది నాటు తుపాకులను గుర్తించి వాటిని సీజ్ చేశారు. కాగా ఈ కేసుల ఛేదనలో కృషి చేసిన ఏఎస్పీ సుప్రజ, డీఎస్పీ సుబ్బారావు, సీఐ ఆదినారాయణ, హరినాథ్ తదితరులను ఎస్పీ అభినందించారు. సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు.
దొంగే కాదు.. రేపిస్ట్ కూడా..!
♦ పోలీసుల కన్నుగప్పి తిరుగుతూ చోరీలు చేస్తున్న తమిళనాడు వాసులు
♦ గత నెల 19న పులిచెర్ల మండలంలోని కల్లూరులో మద్యం దుకాణంలో చోరీ జరిగింది. దుకాణం పైకప్పు తొలగించి రూ.48 వేల నగదు చోరీ చేశారు.
♦ 20న గుడిపాల మండలంలోని పేయనపల్లెలో వెన్నెల అనే మహిళ ఊరికి వెళ్లగా, ఆమె ఇంట్లోకి దొంగలు పడ్డారు. రూ.36 వేలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేశారు. అదే రోజు గుడిపాలలోని చీలాపల్లెలో వెంకటేష్ ఇంటి తలుపులు పగులగొట్టి రూ.20 వేలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశారు.
♦ గతనెల 21న వైఎస్ గేటు వద్ద చాముండేశ్వరమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహానికి ఉన్న బంగారు తాళిబొట్టు, హుండీ పగులగొట్టి అందులోని నగదును చోరీ చేశారు.
♦ 24న పాకాల మండలం మొగరాల పంచాయతీకి చెందిన రామ్మూర్తి ఇంటిని పగులగొట్టిన రూ.60 వేలు విలువ చేసే బంగారుచైన్ దొంగతనం చేశారు.
దీనిపై దర్యాప్తు చేసిన పాకాల పోలీసులు తమిళనాడులోని వాలాజకు చెందిన బాలాజి అలియాస్ వెంకటేష్ (38), వేలూరు జిల్లా కందిపేటకు చెందిన శివం (29)ను అరెస్టు చేసి, రూ.1.75 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను పాకాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకడైన వెంకటేష్ తమిళనాడులో ఇద్దరు మహిళల్ని రేప్ చేశాడని, అక్కడ ఇతనిపై పీడీ యాక్టు సైతం ప్రయోగించేందుకు ప్రతిపాదనలున్నాయి. ఓ కేసులో అక్కడి పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్నట్లు పాకాల పోలీసులు దర్యాప్తులో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment