
కూతుళ్లు లిఖిత, చందనతో ఆదినారాయణరెడ్డి
చిత్తూరు ,మదనపల్లె టౌన్ : తమిళనాడు వేలూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లెకు చెందిన ఒక నేత కార్మికుడు మృతిచెందాడు. మరో ముగ్గురు నేతన్నలు గాయపడ్డారు. క్షతగాత్రులు వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతున్నారు. టూటౌన్ పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. మదనపల్లె సిరికల్చర్ కాలనీకి చెందిన కె.ఆదినారాయణ(41) మగ్గం పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య హేమలత, కుమార్తెలు లిఖిత, చందన ఉన్నారు. ఈ నెల 10వ తేదీన తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి స్నేహితులు శ్రీనివాసులు(40), చలపతి(39), నరేష్(41) తో కలిసి కారులో వెళ్లారు.
11వ తేదీ ఉదయం స్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వేలూరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో వస్తుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాకొట్టింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో పోలీసులు వారిని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. మదనపల్లెలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదినారాయణ సోమవారం ఉదయం మృతి చెందాడు. మిగిలిన ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలియగానే మదనపల్లె సిరికల్చర్ కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆదినారాయణ మృతితో ఆ కుటుంబం వీధినపడినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment