handloom worker
-
చేనేత కార్మికుడు నాగరాజుకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అరుదైన కానుక అందింది. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ది అందని అర్హులకు.. లబ్ది చేకూర్చే కార్యక్రమంలో సీఎం జగన్‌కి మంగళగిరికి చేనేత కార్మికుడు మురుగుడు నాగరాజు పట్టు వస్త్రాలు అందించారు. తాను స్వయంగా నేసిన చేనేత చీరను సీఎం జగన్ చేతికి అందించారు. ఈ కానుకను ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతికి అందించాలని నాగరాజు కోరారు. ఈ సందర్భంగా నాగరాజు నైపుణ్యాన్ని చూసి సీఎం జగన్ అభినందించారు. -
చేనేత కార్మికుడి మృతి.. ఇంటి యజమాని అమానుషం
జనగామ: అనారోగ్యంతో మరణించిన చేనేత కార్మికుడి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకువచ్చేందుకు యజమాని నిరాకరించిన విషాద ఘటన గురువారం జనగామ జిల్లా కేంద్రం వీవర్స్ కాలనీలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీకి చెందిన మండల శంకర్(60) నాలుగున్నర దశాబ్దాలుగా చేనేత వృత్తిని నమ్ముకుని అద్దింట్లో ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండేళ్ల పాటు కరోనాతో నమ్ముకున్న వృత్తి నట్టేట ముంచేయగా, ప్రస్తుతం పెరిగిన నూలు ధరలతో పట్టుచీర వ్యాపారం అట్టడుగు స్థాయికి పడిపోయింది. చీరల తయారీ, అమ్మకాలు మందగించడంతో కొన్ని నెలలుగా కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో మానసికంగా కుంగిపోయిన శంకర్ అనారోగ్యం పాలై ఇంటి వద్దనే మృతిచెందాడు. కార్మికుడు మృతి చెందడంతో అద్దె ఇంటి యజమాని మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు నిరాకరించడంతో అక్కడే ఉన్న బంధువుల ఖాళీ స్థలంలో చివరి మజిలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం మానవత్వంతో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కౌన్సిలర్ గుర్రం భూలక్ష్మినాగరాజు విజ్ఞప్తి చేశారు. మృతునికి భార్మ నిర్మల, నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. -
భార్యకు ఫోన్ చేసి.. ఆత్మహత్య
కర్నూలు ,వెల్దుర్తి: చేనేత కార్మికుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రం సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ శ్రీనివాసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. కృష్ణగిరి మండలం పోతుగల్లుకు చెందిన రాజ్‌కుమార్(35) వ్యవసాయం కలిసిరాకపోవడంతో అప్పుల పాలై నాలుగేళ్ల క్రితం కోడుమూరు మండల కేంద్రానికి వలస వెళ్లి కులవృత్తి మగ్గం నేసుకుంటూ జీవనం సాగించేవాడు. అప్పులకు వడ్డీ ఎక్కువై మొత్తం రూ.7లక్షలకు చేరింది. వాటిని తీర్చే మార్గం లేక బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరి బంధువులున్న వెల్దుర్తి పట్టణానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి భార్య శ్రీదేవికి ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. ఆమె బంధువులకు ఫోన్‌చేసి అప్రమత్తం చేసింది. వారు అక్కడికి వెళ్లేలోగా రైల్వేట్రాక్‌పై విగతజీవిగా కనిపించాడు. మృతునికి కుమారుడు, కూతురు ఉన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే ఎస్ఐ మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
తమిళనాడులో రోడ్డు ప్రమాదం
చిత్తూరు ,మదనపల్లె టౌన్ : తమిళనాడు వేలూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లెకు చెందిన ఒక నేత కార్మికుడు మృతిచెందాడు. మరో ముగ్గురు నేతన్నలు గాయపడ్డారు. క్షతగాత్రులు వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతున్నారు. టూటౌన్ పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. మదనపల్లె సిరికల్చర్ కాలనీకి చెందిన కె.ఆదినారాయణ(41) మగ్గం పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య హేమలత, కుమార్తెలు లిఖిత, చందన ఉన్నారు. ఈ నెల 10వ తేదీన తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి స్నేహితులు శ్రీనివాసులు(40), చలపతి(39), నరేష్(41) తో కలిసి కారులో వెళ్లారు. 11వ తేదీ ఉదయం స్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వేలూరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో వస్తుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాకొట్టింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో పోలీసులు వారిని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. మదనపల్లెలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదినారాయణ సోమవారం ఉదయం మృతి చెందాడు. మిగిలిన ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలియగానే మదనపల్లె సిరికల్చర్ కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆదినారాయణ మృతితో ఆ కుటుంబం వీధినపడినట్లయింది. -
తండ్రే హత్యకు స్కెచ్ వేశాడు.. తమ్ముడు గొంతు కోశాడు!
డబ్బు– మనిషి చేత ఎంతటి దుర్మార్గానికైనా పురిగొల్పుతుందనేందుకు మదనపల్లెలో జరిగిన చేనేత కార్మికుడి దారుణ హత్యలో తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలు నివ్వెరపరుస్తున్నాయి. కన్నతండ్రే హత్యకు స్కెచ్ వేయడం, దీనిని మరో కొడుకు చేత పూర్తి చేయించడం గమనార్హం! రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక కొడుకు తాలూకు వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. డబ్బు ముందు మానవ సంబంధాలు, రక్త సంబంధాలన్నీ ప్రశ్నార్థకమవుతున్నాయని ఈ ఉదంతం మరోసారి చాటిచెప్పింది. చిత్తూరు, మదనపల్లె : మండలంలోని కోళ్లబైలు పంచాయతీలో అనంతపురం జిల్లా పెడబల్లికోటకు చెందిన పవన్‌కుమార్ మూడురోజుల క్రితం దారుణహత్యకు గురవడం విదితమే. మృతుడి భార్య మాధవి తన భర్తను అతడి తండ్రి రవి హత్య చేయించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. హతుడి జేబులో లభించిన సినిమా టికెట్ల పోలీసుల దర్యాప్తుకు కీలక ఆధారమయ్యాయి. హత్య మిస్టరీ ఛేదనకు దారిచాపాయి. బుధవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ చిదానందరెడ్డి వెల్లడించిన వివరాలు.. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పెడబల్లికోటకు చెందిన రవి (50)కి ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య ధనలక్ష్మికి ఇద్దరు కుమారులు.. పవన్ (29), విజయ్‌కుమార్. రెండో భార్య శ్యామలకు ఇంటర్మీడియెట్ చదువుతున్న కుమారుడు ఉన్నాడు. గోరంట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో 2014లో జరిగిన లారీ, ఆటో యాక్సిడెంట్లో మొదటి భార్య కుమారుడు విజయ్‌కుమార్ చనిపోయాడు. ఆ ఘటనలో విజయ్‌కుమార్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్ మొత్తం రూ.5.70 లక్షలు తల్లి, తండ్రి పేరిట వస్తున్నట్లు పవన్ తెలుసుకున్నాడు. తన తమ్ముడి పేరిట వస్తున్న డబ్బులు కేవలం తనకు, తన తల్లి ధనలక్ష్మికి మాత్రమే చెందుతాయని, తండ్రి రవికి సంబంధం లేదంటూ పవన్ వాదులాటకు దిగాడు. డబ్బుల్లో వాటాకు వస్తే ప్రాణాలు తీసేందుకైనా సిద్ధమేనని హెచ్చరించాడు. పవన్‌కు నేరప్రవృత్తి ఉండటం, డబ్బు కోసం అన్నంత పనిచేస్తాడేమోననే భయంతో అతడి తండ్రి రవి చిన్నభార్య కుమారుడితో కలిసి పవన్ హత్యకు వ్యూహం పన్నాడు. ఈనెల 20న రెండో భార్య కుమారుడు తిరుపతి నుంచి మదనపల్లెకు చేరుకుని అన్న పవన్‌తో కలిసి సినిమాకు వెళ్లాడు. మధ్యలో తనకు అత్యవసరమైన పని ఉందని బయటకు వచ్చి చిత్తూరు బస్టాండ్‌లో కొడవలిని కొనుగోలు చేసి ముందుగానే అనుకున్న పథకం ప్రకారం కోళ్లబైలు పంచాయతీలోని మామిడితోపులో దాచిఉంచాడు. సినిమా వదిలిన తర్వాత ఇద్దరూ కలిసి మద్యం సేవిద్దామని మామిడి తోపుకు తీసుకెళ్లి అన్నకు మద్యం తాగించి, మత్తులో ఉన్న సమయంలో దాచిపెట్టిన కొడవలితో గొంతు కోసి దారుణంగా చంపేశాడు. ఉదయం అటుగా వెళుతున్న కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన వెలుగుచూసింది. నిందితుడైన మైనర్ ఆ తర్వాత ఆస్పత్రిలో తన సోదరుడి మృతదేహం వద్దకు వచ్చి ఏమీ తెలియనట్లు ఏడుపుతో రక్తి కట్టించాడు. ఇక, మృతుడి జేబులోని సినిమా టికెట్ల ఆధారంగా థియేటర్లోని సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించేసరికి అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు తండ్రి రవిని, మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో రూరల్ సీఐ రమేష్, ఎస్ఐ దిలీప్‌కుమార్ పాల్గొన్నారు. -
చేనేత కార్మికుడు దారుణ హత్య
చిత్తూరు, మదనపల్లె సిటీ: చేనేత కార్మికుడు దారుణ హత్యకు గురైన సంఘటన సోమవారం నీరుగట్టువారిపల్లె సమీపంలోని కాట్లాటపల్లె రోడ్డులో వెలుగులోకి వచ్చింది. చేనేత కార్మికుడు పవన్‌కుమార్‌ను ఆగంతకులు గొంతు కోసి హత్య చేశారు. హతుడు అనంతపురం జిల్లాలో పలు దొంగతనాల కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ...అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పెడబల్లికోటకు చెందిన ఎ.పవన్‌కుమార్ (29) చేనేత కార్మికుడిగా పని చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం మాధవిని వివాహం చేసుకున్నాడు. ఏడాది క్రితం నీరుగట్టువారిపల్లెకు నివాసం మార్చి, మగ్గం నేస్తూ జీవిస్తున్నాడు. నీరుగట్టువారిపల్లెలోని నివసిస్తున్న ధర్మవరానికి చెందిన సిద్ధు అనే చేనేత కార్మికుడితో హతుడికి ఇటీవల పరిచయమైంది. ఆదివారం మధ్యాహ్నం సిద్ధుతో కలిసి సినిమాకు వెళుతున్నట్లు తనకు భార్యకు చెప్పి పవన్‌కుమార్ వెళ్లాడు. రాత్రి కావస్తున్నా ఇంటికి రాకపోవడంతో మాధవి తన భర్తకు ఫోన్ చేసింది. తనకు పని ఉందని, ఆలస్యంగా వస్తానని ఆమెకు చెప్పాడు. ఈ నేపథ్యంలో, అతను దారుణ హత్యకు గురై ఉండటం ఉదయం కాట్లాటపల్లె రోడ్డులో వెలుగుజూసింది. స్థానికులు ఇది గుర్తించి మాధవికి తెలియజేశారు. హుటాహుటిన ఆమె అక్కడికి చేరుకుంది. రక్తపుమడుగులో ఉన్న భర్త మృతదేహాన్ని చూసి భోరున విలపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు. మాధవి ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ కేసు నమోదు చేశారు. హతుడి భార్యను విచారణ చేసిన డీఎస్పీ హత్యోదంతం తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి, వన్‌టౌన్ సీఐ నిరంజన్‌కుమార్ హతుడి భార్యను విచారణ చేశా>రు. త్వరలో హత్య కేసును ఛేదిస్తామన్నారు. ఇదలా ఉంచితే, పవన్‌కుమార్ హత్యపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్నేహితులు కలిసి హత్య చేశారా ? లేక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జీఎస్టీ నుంచి చేనేతను మినహాయించాలి
సాక్షి, హైదరాబాద్: చేనేత పరిశ్రమను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయించాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మాజీ ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. జాతీయ చేనేత బోర్డు సభ్యుడు కేఎన్ మూర్తి ఆ«ధ్వర్యంలో చేనేత రంగంపై జీఎస్టీ ప్రభావం అనే అంశంపై శనివారం ఇక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జీఎస్టీ వల్ల చేనేత కార్మికులు, చేతి వృత్తి కార్మికులు పన్ను భారంతో ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎంపీ గుండు సుధారాణి పేర్కొన్నారు. చేనేత రంగానికి జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై కేటీఆర్‌ను కలిసి పన్ను మినహాయింపుపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరతామని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ అమలు ఎత్తివేయాలంటూ చేనేత నాయకులు, కార్మికులు అనేక పోరాటాలు చేస్తున్నారని, తాను కూడా పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశానని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ తెలిపారు. దీనిపై తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల ఎంపీలందరూ ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేఎన్ మూర్తి మాట్లాడుతూ, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చేనేత రంగంపై జీఎస్టీ మినహాయింపుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. చేనేతపై పన్ను మినహాయింపు పోరాటంలో భాగంగా, ఈ నెల 3న తెలుగు రాష్ట్రాల ఎంపీలతో కలిసి ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిని, ప్రధాని మోదీని, జీఎస్టీ సబ్ కమిటీని కలవాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఒకవేళ కేంద్రం నుంచి సరైన సమాధానం రాకుంటే తెలుగు రాష్ట్రాల కలెక్టరేట్లలో వినతి పత్రాలివ్వడం ఆయా జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. జీఎస్టీ మినహాయింపు కోసం దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులతో కలిసి కామన్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. చేనేత రంగంపై పన్ను మినహాయింపుపై కేంద్రంపై ఒత్తిడి తేవడంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనము వెనుకబడి ఉన్నామని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. తాను ఈ సమస్యపై కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీని కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేశానన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోశిక యాదగిరి, పద్మశాలి యువజన సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
ఉసురు తీసిన అప్పు
అప్పులు మరో నేతన్నను బలిగొన్నాయి. మగ్గం చెంతే చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. నన్నూ, పిల్లలను అనాథలను చేసి వెళ్లిపోయావా అంటూ భార్య రోదించిన తీరు అందరినీ కలచివేసింది. ధర్మవరం అర్బన్: అప్పుల బాధ భరించలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ధర్మవరంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం యలహంకకు చెందిన వి.కుమార్ (25) చేనేత కార్మికుడిగా పనిచేసుకుంటూ జీవించేవాడు. ఈ క్రమంలో ధర్మవరానికి వలస వచ్చాడు. లక్ష్మీచెన్నకేశవపురానికి చెందిన కలిమిశెట్టి నాగరాజు, పార్వతి దంపతుల కుమార్తె యశోదను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. చంద్రబాబునగర్‌లో కాపురం పెట్టాడు. వీరికి మూడేళ్ల వయసు గల కుమారుడు దేవరాజ్, ఏడు నెలల వయసుగల కుమార్తె పూర్ణ ఉన్నారు. నిద్ర చేసేందుకని యశోద పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం కుమార్ మగ్గం వద్ద చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల తర్వాత గుర్తింపు.. పుట్టింటికి వెళ్లిన యశోద తన భర్తతో మాట్లాడాలని కాల్ చేస్తే ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. చార్జింగ్ లేదేమోనని భావించి మిన్నకుండిపోయింది. అలా పలుమార్లు చేసినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు గురైంది. శనివారం మధ్యాహ్నం చంద్రబాబునగర్‌లోని ఇంటికి చేరుకుంది. తలుపు తట్టినా లోపలి నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడంతో సమీపంలో క్రికెట్ ఆడుతున్న వారిని పిలిపించింది. వారు కిటికీలోంచి తొంగి చూడగా ఉరికి వేలాడుతున్న కుమార్ కనిపించాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని తలుపులు తెరిచారు. రెండు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని తేల్చారు. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు రూ.3 లక్షల వరకు ఉన్నాయని, వాటిని తీర్చలేకే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని భార్య తెలిపింది. విషయం తెలుసుకున్న చేనేత కార్మిక సంఘం నాయకులు బైముతక రమణ, చెన్నంపల్లి శ్రీనివాసులు మృతుడి భార్యను పరామర్శించారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘బతుకమ్మ’తో భరోసా
సిరిసిల్ల : మరమగ్గాల (పవర్‌లూమ్స్) మధ్య వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్న ఇతని పేరు బొమ్మెన నాగరాజు (41). సిరిసిల్లలోని శివనగర్‌లో సాంచాలపై బతుకమ్మ చీరలను నేస్తున్నాడు. నిత్యం 12 గంటలపాటు సాంచాల మధ్య నిలబడి వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తే.. నాగరాజుకు వారానికి రూ.4 వేల కూలి వస్తుంది. అంటే నెలకు రూ.16 వేలు వస్తున్నాయి. ఇదే పనికి గతంలో నెలకు రూ.8 వేలకు మించి కూలి రాకపోయేది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలను అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కార్మికులకు చేయూతనందించటం కోసం ప్రభుత్వం ఈ చీరల తయారీ ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అప్పగించింది. దీంతో ఒక్క నాగరాజుకే కాదు.. స్థానికంగా ఉన్న పదివేల మంది నేత కార్మికులకు చేతినిండా పనిదొరికింది. కూలి రెట్టింపు అయింది. ప్రస్తుతం ఇక్కడ నిత్యం 1.07 లక్షల చీరలను తయారు చేస్తున్నారు. 80 రంగుల్లో చీరలు.. సిరిసిల్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా 80 రంగుల్లో బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. గతేడాది బతుకమ్మ చీరలను సిరిసిల్లలో ఉత్పత్తిచేసినా.. గడువులోగా పూర్తి స్థాయిలో చీరల వస్త్రం అందలేదు. 45 లక్షల చీరలను సిరిసిల్లలో ఉత్పత్తి చేయగా, మరో 55 లక్షల చీరలను సూరత్ నుంచి టెండర్ ద్వారా కొనుగోలు చేశారు. దీంతో నాసిరకం చీరలు ఇచ్చారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యం లో గతంలో ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తూ.. మొత్తం ఆర్డర్‌ను సిరిసిల్ల నేతన్నలకు అందించారు. దీంతో జరీ అంచుతో కూడిన నాణ్యమైన చీరలను సిరిసిల్లలో ఉత్పత్తి చేస్తున్నారు. 20 వేల పవర్‌లూమ్స్‌పై చీరలను ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 14 వేల మగ్గాలపై ఉత్పత్తి సాగుతోంది. మరో 6 వేల సాంచాలపై బతుకమ్మ చీరల బీములను ఎక్కించేందుకు జౌళిశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 20 వేల సాంచాలపై బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేస్తే, గడువులోగా 90 లక్షల చీరలను ప్రభుత్వానికి అందించేందుకు అవకాశం ఉంది. కార్మికుల ఉపాధే లక్ష్యం.. సంక్షోభంలో ఉన్న నేతన్నలను ఆదుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళిశాఖ మంత్రి కె.తారక రామారావు కార్మికుల ఉపాధి లక్ష్యంగా బతుకమ్మ చీరల పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులైన ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరను సారెగా ఇవ్వడం.. ఇటు సిరిసిల్ల నేతన్నలకు బతుకుదెరువు చూపడమే ఈ పథకం ఉద్దేశం. ఇందులో చీరల వస్త్రం ఉత్పత్తికి ప్రతీ మీటరుకు రూ.32 ఇస్తుండగా.. ఆసామికి మీటరు వస్త్రం ఉత్పత్తి చేస్తే రూ.8.50, కార్మికుడికి రూ.4.25 చొప్పున ముందే కూలి ధరలను నిర్ధారించారు. వార్పిన్ కార్మికుడికి ఒక్కో బీముకు రూ.430, వైపని కార్మికుడికి ఒక్కో బీముకు రూ.375 కూలి రేట్లను నిర్ణయించడంతో గతంతో పోలిస్తే రెండింతల కూలి కార్మికులకు గిట్టుబాటు అవుతోంది. సిరిసిల్ల వస్త్రపరిశ్రమలో ఈ పథకంవల్ల అన్నిరంగాలకు చెందిన పదివేలమంది కార్మికులు మెరుగైన ఉపాధి పొందుతున్నారు. మంత్రి కేటీఆర్ చొరవతోనే తమకు మంచి ఉపాధి లభిస్తోందని కార్మికులు అంటున్నారు. చీరల ఉత్పత్తిపై నిఘా.. ఇక్కడి నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతోనే ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చింది. అయితే ఎవరైనా వస్త్ర వ్యాపారులు సూరత్, భివండి, షోలాపూర్, ముంబై వంటి ప్రాంతాల నుంచి చీరల బట్టను దిగుమతి చేస్తారనే అనుమానంతో అధికారులు బతుకమ్మ చీరల ఉత్పత్తిపై నిఘా ఉంచారు. హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్ నుంచి సిరిసిల్లలోకి ప్రవేశించే మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. జౌళిశాఖకు చెందిన ఏడు బృందాలతో వార్పిన్ యూనిట్లపై నిఘా ఉంచారు. ట్యాబ్‌లలో చీరల ఉత్పత్తి వివరాలను నమోదు చేస్తున్నారు. 20 మంది సాంకేతిక సిబ్బంది చీరల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఉత్పత్తి అయిన చీరల బట్టను ఎప్పటికప్పుడు సేకరిస్తూ.. గోదాములో నిల్వ చేస్తున్నారు. రేయింబవళ్లు సాంచాలు ఆగకుండా బతుకమ్మ చీరల ఉత్పత్తి సాగుతోంది. శ్రమ అధికమైనా మెరుగైన వేతనాలు రావడంతో కార్మికులు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. నేడు చైతన్య ర్యాలీ.. 20 వేల సాంచాలపై బతుకమ్మ చీరలను నేయాలని కోరుతూ సోమవారం కార్మికులు చైతన్య ర్యాలీని నిర్వహించనున్నారు. బీవై నగర్‌లోని నేతబజారు నుంచి వస్త్రోత్పత్తిదారులతో బైక్ ర్యాలీని నిర్వహిం చనున్నారు. ‘బతుకమ్మ’తో బతుకుదెరువు ఉందని చాటిచెప్పేందుకు పట్టణాల్లో ఈ ర్యాలీని నిర్వహించాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్ అధికారులకు సూచించారు. రోజుకు రూ.వెయ్యి వస్తున్నాయి.. బతుకమ్మ చీరల బీములు నింపితే రోజుకు రూ.వెయ్యి కూలీ లభిస్తుంది. గతంలో రూ.500 వచ్చేవి. రోజూ రెండు, మూడు బీములు నింపుతున్నా. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు. నా భార్య నవ్య బీడీ కార్మికురాలు. సిరిసిల్లలో కిరాయి ఇంట్లో ఉండి పని చేస్తున్నా. గతంలో భివండిలో పని చేశాను. అక్కడి కంటే సిరిసిల్లలోనే మంచి జీతం వస్తోంది. నా కంటే ఎక్కువ కూలీ సంపాదించే వాళ్లు కూడా ఉన్నారు. – మెండు శ్రీనివాస్, వార్పర్ చెల్లింపులకు ఇబ్బంది లేదు.. బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేస్తున్న వారికి డబ్బు చెల్లింపుల్లో ఇబ్బంది లేదు. ఆర్డర్ ప్రకారం వస్త్రొత్పత్తిదారులకు చెల్లింపులను ఆన్లైన్లోద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. గడువులోగా అందరూ బతుకమ్మ చీరలను అందించాలి. సిరిసిల్లలో సాంచాలపై ఇతర ఉత్పత్తులను నిలిపివేసి బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయాలి. – పి.యాదగిరి, టెస్కో జనరల్ మేనేజర్ అందరికీ ఆర్డర్లు ఇచ్చాం.. సిరిసిల్లలో వస్త్రోత్పత్తిదారులందరికీ బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చాం. 120 మ్యాక్స్ సంఘాలకు, మరో 77 చిన్నతరహా పరిశ్రమల యజమానులకు ఆర్డర్లు ఇచ్చాం. ఇంకా ఎవరైనా ముందుకు వస్తే ఇస్తాం. ప్రస్తుతం 14 వేల మగ్గాలపై చీరలు ఉత్పత్తి అవుతున్నాయి. కొందరు ఇంకా తెల్లని పాలిస్టర్ బట్ట ఉత్పత్తి చేస్తున్నారు. వాళ్లు బతుకమ్మ చీరలు నేయాల్సి ఉంది. – వి.అశోక్‌రావు, జౌళిశాఖ ఏడీ ఇవీ బతుకమ్మ చీరల ఆర్డర్లు.. అవసరమైన చీరలు : 90 లక్షలు ఇప్పటికే ఉత్పత్తయినవి : 30 లక్షలు చీరలు ఉత్పత్తి చేసే పవర్‌లూమ్స్: 14 వేలు అవసరం అయిన వస్త్రం : 5.94 కోట్ల మీటర్లు నిత్యం ఉత్పత్తవుతున్న వస్త్రం : 7 లక్షల మీటర్లు శ్రమించే నేత కార్మికులు : 10వేల మంది (అన్ని విభాగాల్లో) చీరల ఆర్డర్ల ఖరీదు : రూ.300 కోట్లు ఆర్డరు గడువు : సెప్టెంబర్ నెలాఖరు -
‘కొత్త’కు జీవం... నేతకు ప్రాణం
- మగ్గంపై రూ.80 వేలకు పైగా విలువ చేసే చీరల తయారీ - పోచంపల్లి ఇక్కత్ చీరలో అనేక ప్రయోగాలు, ఎన్నో ప్రత్యేకతలు - ఆదర్శంగా నిలుస్తున్న చిలుకూరి రామ్మూర్తి భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు చిలుకూరి రామ్మూర్తి ఏకంగా రూ.80 వేలు విలువ చేసే ఖరీదైన చీరలు నేసి ఔరా అన్పించాడు. అంతేకాదు పోచంపల్లి చీరల్లో అనేక వినూత్న ప్రయోగాలు చేస్తూ అబ్బుర పరుస్తున్నాడు. తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నాడు. నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చిలుకూరి రామ్మూర్తిది స్వస్థలం చండూరు. ఐదేళ్లుగా కుటుంబ సభ్యులతో పోచంపల్లికి వచ్చి ఇక్కడే మగ్గం నేస్తూ, నేయిస్తూ పలువురి కి ఉపాధి చూపుతున్నాడు. ఇతను పాతికేళ్ల నుంచి చేనేత వృత్తిని నమ్ముకున్నాడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య వద్ద కొన్నేళ్లు పని చేశాడు. చేనేతపనిలోనే ఏదైనా కొత్తదనం చూపించాలన్నది ఇతని తపన. తన బుర్రకు ఎప్పుడు పదును పెడుతుంటాడు. రొటీన్‌కు భిన్నంగా వినూత్నంగా చీరలను తయారు చేయాలని ఆలోచన చేశాడు. ఆ తపనలోనే ఎన్నో ఆవిష్కరణలకు జీవం పోశాడు. రూ. 80 వేల చీర ప్రత్యేకత ఏమిటంటే.. బెంగళూరు నుంచి తెప్పించిన స్వచ్ఛమైన పట్టు దారం.. సూరత్ నుంచి తెప్పించిన వెండి జరీతో చీరను నేస్తాడు. చీర పొడవు 6 మీటర్లు, మీటరు బ్లౌజ్, వెడల్పు 50 ఇంచులు ఉంటుంది. చీర బరువు 900 గ్రాములు ఉంటుంది. చీరను నేయడానికి ప్రత్యేకమైన మగ్గం అవసరం. రెండు జకాత్ మిషన్లు తొక్కుతూ ప్రత్యేక శిక్షణ పొందిన కార్మికుడు మాత్రమే నేయగలుగుతాడు. 10 రోజులు నేస్తే ఒక చీర తయారవుతుంది. కొనుగోలు చేస్తున్న ప్రముఖులు ఖరీదైన చీరను సాధారణ మహిళలు కొనుగోలు చేయలేరు. అంత ఖరీదైన చీరలను ప్రత్యేకంగా ప్రముఖులు మాత్రమే కొనుగోలు చేస్తారు. సెలబ్రిటీల డిజైనర్లు, ఫ్యాషన్ డిజైనర్లు, పలు డిజైన్లు ఇచ్చి ఇలా నేసి ఇవ్వాలని ఆర్డర్ ఇస్తున్నారు. వారి కోసం ఆకర్షణీయమైన డిజైన్లతో చీరలను తయారు చేస్తాడు. గతంలో నటి అనుష్కకు రూ.80 వేల చీరను, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుటుంబంతో పాటు పలువురు వ్యాపార వేత్తలకు ఖరీదైన చీరలను అందజేసి వారి మెప్పును పొందాడు. వినూత్న డిజైన్లను సృష్టించి.. ఇతనికి మొదటి నుంచి వస్త్ర తయారీలో ప్రయోగాలు చేయడమంటే ఇష్టం. ప్రయోగాలు చేసి విజయం కూడా సాధించాడు. ఇతర ప్రాంతాల్లో పేరుగాంచిన కంచి, ఉప్పాడ, జంథానీ, కోట డిజైన్లను, పోచంపల్లి ఇక్కత్ చీరల్లో మిళితం చేసి వినూత్న చీరలను సృష్టించాడు. ఒకే చీరలో పోచంపల్లి ఇక్కత్, కంచి బార్డర్, కొంగు కోటా డిజైన్. ఇలా మూడు రకాల వైరైటీ డిజైన్లను రూపొందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. మంచి ఆదరణ ఉంది పోచంపల్లి ఇక్కత్‌లోనే అనేక డిజైన్లు ను రూపొందిస్తున్నాను. రిస్క్ ఎక్కువ ఉన్నా సరే నాకు చిన్నప్పటి నుంచి విభిన్నంగా చీరలను తయారు చేయాలని కోరిక. రూ. 6 వేల నుంచి రూ.80 వేల విలువైన చీరెలను తయారు చేస్తాను. ఖరీ దైన చీరలను మాత్రం ఆర్డర్‌పైన నేసి ఇస్తా ను. అంతేకాక పోచంపల్లి చీరలోనే కంచి, ఉప్పాడ, కోట, జంథానీ డిజైన్లతో చీరల ను కూడ తయారు చేశారు. చీరలకు మంచి ఆదరణ లభిస్తుంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని ఆవిష్కరణ చేస్తాను. –చిలుకూరి రామ్మూర్తి, చేనేత కళాకారుడు -
చేనేత కార్మికుడి బలవన్మరణం
ధర్మవరం అర్బన్ : ధర్మవరం సాయినగర్‌లో నివసిస్తున్న చేనేత కార్మికుడు నాగేంద్ర(21) బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడని పట్టణ పోలీసులు తెలిపారు. రాజమ్మ, కంబగిరి దంపతుల కుమారుడైన నాగేంద్ర డిగ్రీ వరకు చదువుకుని మగ్గం నేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. పండుగ రోజు తండ్రి తిట్టాడని మనస్తాపంతో ఇంట్లో మగ్గానికి తాడుతో ఉరేసుకుని తనువు చాలించాడు. బంధువులు గమనించి వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్ : అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌లో మంగళవారం సాయంత్రం అప్పుల బాధ తాళలేక సింహం ఆదినారాయణ(40) అనే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సుకన్య, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదినారాయణ కూలి మగ్గం నేసేవాడు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. కుమారుడు కష్ణమోహన్, కుమార్తె మౌనికలను ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ చదివిస్తున్నాడు. కుటుంబ పోషణ, పిల్లల చదువు కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 లక్షల దాకా అప్పులు చేశాడు. మగ్గం పని గిట్టుబాటు కాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలోనని రోజూ మదనపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మగ్గానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. మతుని కుటుంబాన్ని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజినేయులు, వార్డు కౌన్సిలర్ రామాంజినేయులు పరామర్శించారు. -
చేనేత కార్మికుడి ఆత్మహత్య
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని పార్థసారధి నగర్లో ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పామిశెట్టి ఈశ్వరయ్య (55)కు ఇద్దరు కుమార్తెలు. మూడు మగ్గాలు ఉండగా కూలీ కూడా గిట్టుబాటు కాకపోవడంతో వాటిని అమ్మేశాడు. నేత పనులకు కూలీగా వెళుతూ రూ.4 లక్షల వరకు అప్పులు చేసి కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాడు. అప్పుల బాధతో మనస్తాపం చెందిన అతడు శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
రైలు కింద పడి చేనేత కార్మికుడి ఆత్మహత్య
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని కదిరిగేటు వద్ద ఓ చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడ్ని ధర్మవరం మండలం గొట్టూరు గ్రామానికి చెందిన శంకర్ (30)గా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
చేనేత కార్మికుని ఆత్మహత్య
ధర్మవరం: అనంతపురం జిల్లాలో ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధర్మవరం పట్టణం సూర్యప్రకాశ్‌రెడ్డి కాలనీలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన మారెప్ప(40) అనే చేనేత కార్మికుడు సరైన ఉపాధి దొరక్క కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు రూ.3 లక్షల వరకు ఉన్నాయి. రుణ భారం తీర్చే దారిలేక కుటుంబం నడిచే పరిస్థితి కష్టమవ్వడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం వేకువజామున ఇంటి వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. మారెప్ప మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
చేనేత కార్మికుడి ఆత్మహత్య
రాజంపేట: ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా రాజంపేట మండలం సింగారం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన రాజప్ప(56) నేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా పని లభించకపోవడంతో.. కరీంనగర్ జిల్లాకు వలస వెళ్లాడు. అక్కడ కూడా చేతినిండా పని దొరక్కపోవడంతో.. తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాజప్ప ఈ రోజు తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. -
‘ఫేస్బుక్ నేతన్న’కు అభినందనల వెల్లువ
ప్రొద్దుటూరు: ఫేస్బుక్ నేతన్నకు పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘సాక్షి’లో ఆదివారం ఫేస్బుక్ నేతన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. అభిశిల్క్స్ యజమానిగా ఎదిగిన చేనేత కార్మికుడు గుర్రం ఆంజనేయులు కథనాన్ని చదివిన పాఠకులు అతనికి అభినందనలు తెలిపారు. విజయవాడ నుంచి చందనా బ్రదర్స్ నిర్వాహకుడు చందనా రమేష్ ఆయనకు ఫోన్ చేసి అభినందించారు. త్వరలో తిరుపతిలో తమ బ్రాంచి షోరూంను ప్రారంభించనున్నామని, అందులో మీరు తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముతామని తెలిపారు. -
నేతన్నకు ఊతం...ఆ ‘ఫేట్’బుక్
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చేనేత కార్మికుడు గుర్రం ఆంజనేయులుకు ఫేస్బుక్ కాస్తా ‘ఫేట్’బుక్‌గా మారింది. తాను నేసిన వస్త్రాలను ఫేస్బుక్ ద్వారా ప్రపంచానికి చూపి అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారు. ఆన్లైన్ వ్యాపార సంస్థలు కూడా ఈయనతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఒకప్పుడు కూలి డబ్బు తీసుకున్న ఆయన ప్రస్తుతం 40 మందికి ఉపాధి కల్పించడమేగాక ఆదాయపన్ను చెల్లించేస్థాయికి ఎదిగారు. ప్రొద్దుటూరు మిట్టమడి వీధిలో నివసిస్తున్న గుర్రం ఆంజనేయులు టెన్త్ మాత్రమే చదివారు.వంశపారంపర్యంగా వస్తున్న చేనేత వృత్తిని చేపట్టారు. క్రమేణా ఎదుగుతూ 2005లో తన కుమారుడి పేరుతో అభి సిల్క్స్ ఏర్పాటు చేశారు. ఆయన రెండేళ్ల కిందట ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేశారు. తాను తయారు చేసిన వస్త్రాలను అందులో పెట్టారు. వాటిని మెచ్చుకున్న పలువురు కొనుగోళ్లు ప్రారంభించారు. కొత్త డిజైన్లు అందుబాటులోకి తెచ్చారు. తాను ఫేస్బుక్లో పెట్టిన వస్త్రాలను చూసి స్వయంగా మహిళలే ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారని ఆంజనేయులు ఈ సందర్భంగా తెలియజేశారు. బ్యాంక్‌లో డబ్బు వేసిన వెంటనే కొరియర్ ద్వారా పంపుతున్నామన్నారు. -
దయతలిస్తే.. ప్రాణం నిలుస్తది
అతనో అద్భుత నైపుణ్యమున్న నేత కార్మికుడు. ఉన్నంతలో కుటుంబాన్ని పోషించుకుంటూ హాయిగా జీవిస్తున్న ఆయన ‘ఖరీదైన’రోగంతో మంచం పట్టాడు. ఫలితంగా ఆ ఇంట చీకట్లు అలముకున్నాయి. కుటుంబ పెద్దదిక్కు మంచానికే పరిమితం కావడంతో కుటుంబ భారాన్ని నెత్తిపై వేసుకుని ఓ వైపు భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే మరోవైపు పిల్లలను సాకుతూ బతుకుబండిని నెట్టుకొస్తోందా ఇల్లాలు. భర్త ప్రాణాలు కాపాడే దాతల కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. - బచ్చన్నపేట మండలంలోని చినరామన్‌చర్ల శివారు గోపాల్‌నగర్‌కు చెందిన చక్రాల యాదగిరి(45) నేత కార్మికుడు. అతని భార్య మణెమ్మ. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. 20ఏళ్లుగా వృత్తినే నమ్ముకున్న యాదగిరి ఉన్నంతలో కుటుంబాన్ని పోషిస్తూ హాయిగా జీవించేవారు. ఇలా హాయిగా సాగిపోతున్న వారి జీవితంలోకి చీకట్లు ప్రవేశించాయి. కొన్నేళ్ల క్రితం ఓ రోజు హఠాత్తుగా కడుపులో నొప్పి రావడంతో జనగామలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన యాదగిరిని..పరీక్షల అనంతరం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు అక్కడి వైద్యులు. దీంతో చేసేది లేక దొరికిన చోటల్లా అప్పులు చేసి భర్తను హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చించింది భార్య మణెమ్మ. వివిధ పరీక్షల అనంతరం అక్కడి వైద్యులు చెప్పిన మాటలు విని నిర్ఘాంతపోయింది. కళ్లు తిరిగి కుప్పకూలిపోయింది. కాలేయం పాడైపోయి.. గుండె వాచిపోయి.. యాదగిరికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన కాలేయంలో ఓ పక్కన పాడైపోయిందని, గుండె వాచిపోయిందని చెప్పారు. కాలేయం మార్పిడికి రూ.20లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక భర్తను ఇంటికి తీసుకొచ్చింది మణెమ్మ. అప్పటికే పరీక్షలు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ. మూడు లక్షల వరకు అప్పుచేసి ఖర్చుచేయడంతో ఇప్పుడా కుటుంబం దుర్భర పరిస్థితి అనుభవిస్తోంది. ప్రస్తుతం ఇంటివద్దే ఉన్న యాదగిరి.. కాళ్లు ఉబ్బిపోయి రెండు అడుగులు కూడా వేయలేని దయనీయ స్థితిలో ఉన్నాడు. భర్త పరిస్థితి చూసి కన్నీరుమున్నీరుగా రోదిస్తున్న భార్య మణెమ్మ.. కుటుంబ పోషణ కోసం బీడీలు చుడుతూ వచ్చిన డబ్బులతో మందులు కొంటూ భర్త ప్రాణాల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. పతిభిక్ష పెట్టరూ.. రోజురోజుకు చావుకు దగ్గరవుతున్న తన భర్త ప్రాణాలను కాపాడాలని యాదగిరి భార్య మణెమ్మ చేతులెత్తి ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. నెలనెలా ఆస్పత్రి ఖర్చులకే రూ. ఆరేడు వేలు ఖర్చవుతున్నాయని కన్నీళ్ల పర్యంతమైంది. బీడీలు చుడితే తప్ప నోట్లోకి ముద్దపోయే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసింది. రోజురోజుకీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుండడంతో దయగల దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని అర్థిస్తోంది. భర్త ప్రాణాలు కాపాడి తనకు పతిభిక్ష ప్రసాదించాలని వేడుకుంటోంది. యాదగిరి కుటుంబానికి ఆర్థికసాయం అందించదలచిన దాతలు 95053 52850 మొబైల్ నంబర్లో సంప్రదించవచ్చు.