జనగామ: అనారోగ్యంతో మరణించిన చేనేత కార్మికుడి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకువచ్చేందుకు యజమాని నిరాకరించిన విషాద ఘటన గురువారం జనగామ జిల్లా కేంద్రం వీవర్స్ కాలనీలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీకి చెందిన మండల శంకర్(60) నాలుగున్నర దశాబ్దాలుగా చేనేత వృత్తిని నమ్ముకుని అద్దింట్లో ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండేళ్ల పాటు కరోనాతో నమ్ముకున్న వృత్తి నట్టేట ముంచేయగా, ప్రస్తుతం పెరిగిన నూలు ధరలతో పట్టుచీర వ్యాపారం అట్టడుగు స్థాయికి పడిపోయింది.
చీరల తయారీ, అమ్మకాలు మందగించడంతో కొన్ని నెలలుగా కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో మానసికంగా కుంగిపోయిన శంకర్ అనారోగ్యం పాలై ఇంటి వద్దనే మృతిచెందాడు. కార్మికుడు మృతి చెందడంతో అద్దె ఇంటి యజమాని మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు నిరాకరించడంతో అక్కడే ఉన్న బంధువుల ఖాళీ స్థలంలో చివరి మజిలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం మానవత్వంతో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కౌన్సిలర్ గుర్రం భూలక్ష్మినాగరాజు విజ్ఞప్తి చేశారు. మృతునికి భార్మ నిర్మల, నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment