చేనేత కార్మికుడి హత్యకు సంబంధించి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ చిదానంద రెడ్డి, నిందితుడు హత్యకు ఉపయోగించిన కొడవలి (సర్కిల్‌లో)
డబ్బు– మనిషి చేత ఎంతటి దుర్మార్గానికైనా పురిగొల్పుతుందనేందుకు మదనపల్లెలో జరిగిన చేనేత కార్మికుడి దారుణ హత్యలో తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలు నివ్వెరపరుస్తున్నాయి. కన్నతండ్రే హత్యకు స్కెచ్ వేయడం, దీనిని మరో కొడుకు చేత పూర్తి చేయించడం గమనార్హం! రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక కొడుకు తాలూకు వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. డబ్బు ముందు మానవ సంబంధాలు, రక్త సంబంధాలన్నీ ప్రశ్నార్థకమవుతున్నాయని ఈ ఉదంతం మరోసారి చాటిచెప్పింది.
చిత్తూరు, మదనపల్లె : మండలంలోని కోళ్లబైలు పంచాయతీలో అనంతపురం జిల్లా పెడబల్లికోటకు చెందిన పవన్‌కుమార్ మూడురోజుల క్రితం దారుణహత్యకు గురవడం విదితమే. మృతుడి భార్య మాధవి తన భర్తను అతడి తండ్రి రవి హత్య చేయించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. హతుడి జేబులో లభించిన సినిమా టికెట్ల పోలీసుల దర్యాప్తుకు కీలక ఆధారమయ్యాయి. హత్య మిస్టరీ ఛేదనకు దారిచాపాయి. బుధవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ చిదానందరెడ్డి వెల్లడించిన వివరాలు..
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పెడబల్లికోటకు చెందిన రవి (50)కి ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య ధనలక్ష్మికి ఇద్దరు కుమారులు.. పవన్ (29), విజయ్‌కుమార్. రెండో భార్య శ్యామలకు ఇంటర్మీడియెట్ చదువుతున్న కుమారుడు ఉన్నాడు. గోరంట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో 2014లో జరిగిన లారీ, ఆటో యాక్సిడెంట్‌లో మొదటి భార్య కుమారుడు విజయ్‌కుమార్ చనిపోయాడు. ఆ ఘటనలో విజయ్‌కుమార్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్ మొత్తం రూ.5.70 లక్షలు తల్లి, తండ్రి పేరిట వస్తున్నట్లు పవన్ తెలుసుకున్నాడు. తన తమ్ముడి పేరిట వస్తున్న డబ్బులు కేవలం తనకు, తన తల్లి ధనలక్ష్మికి మాత్రమే చెందుతాయని, తండ్రి రవికి సంబంధం లేదంటూ పవన్ వాదులాటకు దిగాడు. డబ్బుల్లో వాటాకు వస్తే ప్రాణాలు తీసేందుకైనా సిద్ధమేనని హెచ్చరించాడు. పవన్‌కు నేరప్రవృత్తి ఉండటం, డబ్బు కోసం అన్నంత పనిచేస్తాడేమోననే భయంతో అతడి తండ్రి రవి చిన్నభార్య కుమారుడితో కలిసి పవన్ హత్యకు వ్యూహం పన్నాడు.
ఈనెల 20న రెండో భార్య కుమారుడు తిరుపతి నుంచి మదనపల్లెకు చేరుకుని అన్న పవన్‌తో కలిసి సినిమాకు వెళ్లాడు. మధ్యలో తనకు అత్యవసరమైన పని ఉందని బయటకు వచ్చి చిత్తూరు బస్టాండ్‌లో కొడవలిని కొనుగోలు చేసి ముందుగానే అనుకున్న పథకం ప్రకారం కోళ్లబైలు పంచాయతీలోని మామిడితోపులో దాచిఉంచాడు. సినిమా వదిలిన తర్వాత ఇద్దరూ కలిసి మద్యం సేవిద్దామని మామిడి తోపుకు తీసుకెళ్లి అన్నకు మద్యం తాగించి, మత్తులో ఉన్న సమయంలో దాచిపెట్టిన కొడవలితో గొంతు కోసి దారుణంగా చంపేశాడు. ఉదయం అటుగా వెళుతున్న కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన వెలుగుచూసింది. నిందితుడైన మైనర్ ఆ తర్వాత ఆస్పత్రిలో తన సోదరుడి మృతదేహం వద్దకు వచ్చి ఏమీ తెలియనట్లు ఏడుపుతో రక్తి కట్టించాడు. ఇక, మృతుడి జేబులోని సినిమా టికెట్ల ఆధారంగా థియేటర్‌లోని సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించేసరికి అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు తండ్రి రవిని, మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో రూరల్ సీఐ రమేష్, ఎస్‌ఐ దిలీప్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment