
బి.కొత్తకోట/చిత్తూరు: తంబళ్లపల్లె మండలం ఏటిగడ్డ తాండాకు చెందిన తల్లి, కూతురు, ముగ్గురు పిల్లలు అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు పిల్లల తల్లి సరళ(35), ఈమె తల్లి గంగులమ్మ(65) దారుణ హత్యకు గురయ్యారని దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. అదే గ్రామానికి చెందిన మౌలాలిని నిందితుడిగా గుర్తించారు. తానే వారిద్దరినీ హతమార్చి, సరళ కుమార్తెలు శ్రావణి(15), శశికళ(10), శ్యాము(06)ను కర్ణాటకలోని గౌనిపల్లెలో నిర్బంధించినట్లు నిందితుడు తెలిపాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పిల్లలను విడిపించారు. కేసు విచారణలో భాగంగా మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి ఆదివారం తంబళ్లపల్లెకు వచ్చారు. మౌలాలి తమను బెదిరించి కర్ణాటకలోని గౌనిపల్లెలో నిర్భంధించాడని డీఎస్పీకి పిల్లలు తెలిపారు. తమ తల్లి, అవ్వ ఎక్కడున్నారంటూ పిల్లలు ప్రశ్నించడంతో వారి దీన పరిస్థితిని చూసి ఏటిగడ్డ తాండా మహిళలు బోరున విలపించారు.
చలించిన డీఎస్పీ
ఖాకీలు కఠినమంటారు.. అయితే ఆ ఖాకీ దుస్తుల వెనుక హృదయం ఉంటుందని డీఎస్పీ మనోహరాచారిని చూసిన తర్వాత నిజమనిపించింది. తమ తల్లి,అవ్వ చనిపోయిన విష యం తెలియక ఆడపిల్లలు పడుతున్న బాధను చూసి డీఎస్పీ చలించిపోయారు. ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనను చూసి గ్రామస్తులు సైతం కన్నీరుమున్నీరయ్యారు. ఈ ముగ్గురు పిల్లలు తమతో గడుపుతూ పెరిగారని, ఇప్పుడు వీరి పరిస్థితి ఏమిటని చిన్నారులను చూసి విలపించారు. డీఎస్పీ మాట్లాడుతూ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని, పిల్లల సంరక్షణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment