మద్యం మత్తులో.. కూతురికే ఉరి | father murdered daughter At chittoor | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో.. కూతురికే ఉరి

Published Tue, Jul 30 2024 10:01 AM | Last Updated on Tue, Jul 30 2024 10:01 AM

father murdered daughter At chittoor

కుమార్తె ఆత్మహత్య చేసుకుందంటూ నమ్మించే యత్నం చేసిన తండ్రి 

ఆ తరువాత పోలీసుల కళ్లుగప్పి ఉడాయించిన వైనం   

రొంపిచెర్ల: మద్యం మత్తులో ఓ తండ్రి కన్న బిడ్డనే ఉరేసి చంపిన సంఘటన మండలంలోని పెద్దమల్లెల గ్రామ పంచాయతీ నడింపల్లెలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మృతురాలు మేనమామ జయరాం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నడింపల్లెకు చెందిన కె.మునిరత్నం(35), రెడ్డెమ్మ దంపతులకు ఒక కుమార్తె గౌతమి(14) ఉంది. పదేళ్ల క్రితం రెడ్డెమ్మ మృతి చెందారు. అప్పటి నుంచి గౌతమి తన తండ్రి, అవ్వతో కలసి ఉంటోంది.

గౌతమి పెద్దమల్లెల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే మునిరత్నం తల్లి ఐదు నెలల క్రితం మృతి చెందింది. అప్పుటి నుంచి ఆ ఇంట్లో తండ్రి, కుమారై జీవిస్తున్నారు. మునిరత్నం ఆదివారం రాత్రి తాగొచ్చి ఇంట్లో పడుకుని ఉన్న కుమారైను ఏమీ పని చేయడం లేదని మందలించాడు. దీంతో గౌతమి కూడా గట్టిగా బదులిచ్చింది. వెంటనే కోపంతో సెల్‌ చార్జింగ్‌ వైర్‌ను మెడకు వేసి చంపివేశాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉరి వేసుకుని మృతి చెందిందంటూ ఉదయాన్నే చుట్టుపక్కల వారికి చెప్పాడు. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులకు తండ్రి మీద అనుమానం రావడంతో  తమదైన శైలిలో విచారించారు. దీంతో తన బిడ్డను చార్జింగ్‌ వైరుతో చంపివేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే నిందితుడు మునిరత్నం పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. కల్లూరు సీఐ శ్రీనివాసులు, ఇన్‌చార్జి ఎస్‌ఐ రవి ప్రకాష్‌ రెడ్డి, సంఘటన స్థలాన్ని సందర్శించి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి మునిరత్నం కోసం రొంపిచెర్ల పోలీసులు గాలిస్తున్నారు. రెండు రోజుల్లో నిందితుడిని అరెస్టు చేస్తామని సీఐ శ్రీనివాసులు తెలిపారు.

ఎన్నో అనుమానాలు    
కుమారై గౌతమి మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గౌతమి తాను చనిపోతున్నానని తన చావుకు తన స్నేహితులను పిలవాలని రాసిన ఒక లేఖ సోమవారం బయటపడింది. అయితే మరోపక్క మునిరత్నమే తన కుమార్తెను చంపేశాడని ఒప్పుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తండ్రి కుమార్తెపై  లైంగిక దాడికి యతి్నంచి, చంపేసి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. పోస్టుమాస్టరం నివేదికలో వాస్తవం బయటపడుతుందని భావిస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement