మదనపల్లె టౌన్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లె శివనగర్‌లోని అక్కచెల్లెళ్లు సాయి దివ్య, అలేఖ్య హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో తల్లిదండ్రులతో పాటు వేరే వాళ్ల పాత్ర ఉందా అన్న కోణంలో పోలీసులు దృష్టిసారించారు. ప్రాథమిక దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు తండ్రి పురుషోత్తం నాయుడు, తల్లి పద్మజను 26న అరెస్టుచేశారు. ఈ హత్యల వెనుక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ దిలీప్‌కుమార్ దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న భూత వైద్యుడు సుబ్బరామయ్య మీడియాతో మాట్లాడుతూ పిల్లలు చనిపోకముందు తనను సాయిచిత్ర భాస్కర్, రాజు వారి ఇంటికి తీసుకువెళ్లారని తెలిపాడు.
ఆ సమయంలో మిద్దెపైన గదిలో యువతి కేకలు పెడుతుండ డాన్ని విన్నానని చెప్పాడు. వైద్యం చేయాలని కోరగా తాను తాయెత్తులు సిద్ధం చేసుకుని రెండో రోజు వెళ్లానని, అక్కడ పడుకుని ఉన్న యువతి చెవిలో ఒక వ్యక్తి శంఖం ఊదుతుండగా చూశానన్నాడు. శంఖం ఊదిన వ్యక్తి ఎవరన్న దానిపై రూరల్ పోలీసులు దృష్టి సారించారు. వారి ఇంటికి ఎవరెవరు వచ్చారో తెలుసుకోవడానికి అక్కడి సీసీ పుటేజీలను డీఎస్పీ రవిమనోహరాచారి పరిశీలించారు. భూత వైద్యుడితో పాటు మరో ఏడుగురిని గురువారం రూరల్ పోలీస్ స్టేషనుకు పిలిపించి విచారించారు. హత్య జరిగిన తర్వాత భాస్కర్, రాజు కనిపించకపోవడంతో అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. ఈ హత్యల వెనుక బలమైన కారణం ఉంటుందని, తల్లితండ్రులు తమ పిల్లలను ఎలా చంపుకుంటారని స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసును సవాలుగా తీసుకుని దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.
ఎస్కార్ట్ లేక ఆగిపోయిన తరలింపు
బిడ్డల హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న దంపతులు వల్లూరు పురుషోత్తం నాయుడు, పద్మజను ఎస్కార్ట్ లేకపోవడంతో తిరుపతి రుయా ఆస్పత్రిలోని మానసిక వార్డుకు తరలించడం ఆగిపోయింది. మానసిక స్థితి సరిగా లేని పురుషోత్తంనాయుడు, పద్మజను తిరుపతి రుయాకు తరలించాలని జిల్లా ఆస్పత్రి మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ రాధిక తెలిపారు. దీంతో జైలు సూపరింటెండెంట్ రామక్రిష్ణయా దవ్ కోర్టు నుంచి అదే రోజే అనుమతి పొందారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో రూరల్ పోలీసులు గురువారం వరకు ఎస్కార్ట్ ఇవ్వకపోవడంతో తరలించలేదు.
చిత్తూరులోనూ క్షుద్రపూజలు
చిత్తూరు అర్బన్: క్షుద్రపూజలు పేరిట మదనపల్లెలో వెలుగుచూసిన జంట హత్యల కేసు ఆనవాళ్లు చిత్తూరులో కనిపిస్తున్నాయి. మదనపల్లెకు చెందిన అలేఖ్య, సాయిదివ్య ఇద్దరూ వారి తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తం నాయుడు చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును తవ్వేకొద్దీ ఆసక్తికర కోణాలు వెలుగుచూస్తున్నా యి. చిత్తూరుకు చెందిన పద్మజ చాలాఏళ్ల క్రితమే మదనపల్లెలో స్థిరపడ్డారు. ఆమె తల్లి చిత్తూరులోని ఎస్‌బీఐ కాలనీలో నివాసముంటున్నారు. హత్యకు గురైన అలేఖ్య, సాయిదివ్య తరచూ అమ్మమ్మ ఇంటికి వచ్చేవారు. పద్మజ తల్లి ఇంట్లో తరచూ ఏవో పూజలు చేస్తుండేవారని తెలుస్తోంది. ఈమె వద్ద కాలనీ వాసులు మంత్రాలు కూడా వేసుకున్నట్టు సమాచారం. అర్ధరాత్రిళ్లు ఇంట్లో నుంచి పొగలు రావడం చూశామని స్థానికులు చెబుతున్నారు. పలు మార్లు అలేఖ్య, సాయిదివ్య కూడా ఇక్కడ పూజ లు చేశారని పేర్కొన్నారు. జంట హత్యల సమయంలో మూడో మనిషి చిత్తూరు నుంచి వెళ్లాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షుద్రపూజల పేరిట మోసాలకు పాల్పడేవారు తమిళనాడు నుంచి చిత్తూరుకు వస్తుంటారు. ఈ తరుణంలో పూజలు చేసిన వ్యక్తి చిత్తూరు మీదుగా మదనపల్లెకు వెళ్లి ఉండొచ్చనే అనుమానం తలెత్తుతోంది.
చదవండి : (‘కరోనా శివుడి రోమాల్లోంచి పుట్టింది’)
Comments
Please login to add a commentAdd a comment