అతనో అద్భుత నైపుణ్యమున్న నేత కార్మికుడు. ఉన్నంతలో కుటుంబాన్ని పోషించుకుంటూ హాయిగా జీవిస్తున్న ఆయన ‘ఖరీదైన’రోగంతో మంచం పట్టాడు. ఫలితంగా ఆ ఇంట చీకట్లు అలముకున్నాయి. కుటుంబ పెద్దదిక్కు మంచానికే పరిమితం కావడంతో కుటుంబ భారాన్ని నెత్తిపై వేసుకుని ఓ వైపు భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే మరోవైపు పిల్లలను సాకుతూ బతుకుబండిని నెట్టుకొస్తోందా ఇల్లాలు. భర్త ప్రాణాలు కాపాడే దాతల కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. - బచ్చన్నపేట
మండలంలోని చినరామన్‌చర్ల శివారు గోపాల్‌నగర్‌కు చెందిన చక్రాల యాదగిరి(45) నేత కార్మికుడు. అతని భార్య మణెమ్మ. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. 20ఏళ్లుగా వృత్తినే నమ్ముకున్న యాదగిరి ఉన్నంతలో కుటుంబాన్ని పోషిస్తూ హాయిగా జీవించేవారు. ఇలా హాయిగా సాగిపోతున్న వారి జీవితంలోకి చీకట్లు ప్రవేశించాయి. కొన్నేళ్ల క్రితం ఓ రోజు హఠాత్తుగా కడుపులో నొప్పి రావడంతో జనగామలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన యాదగిరిని..పరీక్షల అనంతరం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు అక్కడి వైద్యులు. దీంతో చేసేది లేక దొరికిన చోటల్లా అప్పులు చేసి భర్తను హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చించింది భార్య మణెమ్మ. వివిధ పరీక్షల అనంతరం అక్కడి వైద్యులు చెప్పిన మాటలు విని నిర్ఘాంతపోయింది. కళ్లు తిరిగి కుప్పకూలిపోయింది.
కాలేయం పాడైపోయి.. గుండె వాచిపోయి..
యాదగిరికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన కాలేయంలో ఓ పక్కన పాడైపోయిందని, గుండె వాచిపోయిందని చెప్పారు. కాలేయం మార్పిడికి రూ.20లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక భర్తను ఇంటికి తీసుకొచ్చింది మణెమ్మ. అప్పటికే పరీక్షలు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ. మూడు లక్షల వరకు అప్పుచేసి ఖర్చుచేయడంతో ఇప్పుడా కుటుంబం దుర్భర పరిస్థితి అనుభవిస్తోంది. ప్రస్తుతం ఇంటివద్దే ఉన్న యాదగిరి.. కాళ్లు ఉబ్బిపోయి రెండు అడుగులు కూడా వేయలేని దయనీయ స్థితిలో ఉన్నాడు. భర్త పరిస్థితి చూసి కన్నీరుమున్నీరుగా రోదిస్తున్న భార్య మణెమ్మ.. కుటుంబ పోషణ కోసం బీడీలు చుడుతూ వచ్చిన డబ్బులతో మందులు కొంటూ భర్త ప్రాణాల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.
పతిభిక్ష పెట్టరూ..
రోజురోజుకు చావుకు దగ్గరవుతున్న తన భర్త ప్రాణాలను కాపాడాలని యాదగిరి భార్య మణెమ్మ చేతులెత్తి ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. నెలనెలా ఆస్పత్రి ఖర్చులకే రూ. ఆరేడు వేలు ఖర్చవుతున్నాయని కన్నీళ్ల పర్యంతమైంది. బీడీలు చుడితే తప్ప నోట్లోకి ముద్దపోయే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసింది. రోజురోజుకీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుండడంతో దయగల దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని అర్థిస్తోంది. భర్త ప్రాణాలు కాపాడి తనకు పతిభిక్ష ప్రసాదించాలని వేడుకుంటోంది.
యాదగిరి కుటుంబానికి ఆర్థికసాయం అందించదలచిన దాతలు 95053 52850 మొబైల్ నంబర్లో సంప్రదించవచ్చు.
దయతలిస్తే.. ప్రాణం నిలుస్తది
Published Thu, Jul 24 2014 2:41 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement