‘కొత్త’కు జీవం... నేతకు ప్రాణం
- మగ్గంపై రూ.80 వేలకు పైగా విలువ చేసే చీరల తయారీ
- పోచంపల్లి ఇక్కత్ చీరలో అనేక ప్రయోగాలు, ఎన్నో ప్రత్యేకతలు
- ఆదర్శంగా నిలుస్తున్న చిలుకూరి రామ్మూర్తి
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు చిలుకూరి రామ్మూర్తి ఏకంగా రూ.80 వేలు విలువ చేసే ఖరీదైన చీరలు నేసి ఔరా అన్పించాడు. అంతేకాదు పోచంపల్లి చీరల్లో అనేక వినూత్న ప్రయోగాలు చేస్తూ అబ్బుర పరుస్తున్నాడు. తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నాడు.
నూతన ఆవిష్కరణలకు శ్రీకారం
చిలుకూరి రామ్మూర్తిది స్వస్థలం చండూరు. ఐదేళ్లుగా కుటుంబ సభ్యులతో పోచంపల్లికి వచ్చి ఇక్కడే మగ్గం నేస్తూ, నేయిస్తూ పలువురి కి ఉపాధి చూపుతున్నాడు. ఇతను పాతికేళ్ల నుంచి చేనేత వృత్తిని నమ్ముకున్నాడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య వద్ద కొన్నేళ్లు పని చేశాడు. చేనేతపనిలోనే ఏదైనా కొత్తదనం చూపించాలన్నది ఇతని తపన. తన బుర్రకు ఎప్పుడు పదును పెడుతుంటాడు. రొటీన్‌కు భిన్నంగా వినూత్నంగా చీరలను తయారు చేయాలని ఆలోచన చేశాడు. ఆ తపనలోనే ఎన్నో ఆవిష్కరణలకు జీవం పోశాడు.
రూ. 80 వేల చీర ప్రత్యేకత ఏమిటంటే..
బెంగళూరు నుంచి తెప్పించిన స్వచ్ఛమైన పట్టు దారం.. సూరత్ నుంచి తెప్పించిన వెండి జరీతో చీరను నేస్తాడు. చీర పొడవు 6 మీటర్లు, మీటరు బ్లౌజ్, వెడల్పు 50 ఇంచులు ఉంటుంది. చీర బరువు 900 గ్రాములు ఉంటుంది. చీరను నేయడానికి ప్రత్యేకమైన మగ్గం అవసరం. రెండు జకాత్ మిషన్లు తొక్కుతూ ప్రత్యేక శిక్షణ పొందిన కార్మికుడు మాత్రమే నేయగలుగుతాడు. 10 రోజులు నేస్తే ఒక చీర తయారవుతుంది.
కొనుగోలు చేస్తున్న ప్రముఖులు
ఖరీదైన చీరను సాధారణ మహిళలు కొనుగోలు చేయలేరు. అంత ఖరీదైన చీరలను ప్రత్యేకంగా ప్రముఖులు మాత్రమే కొనుగోలు చేస్తారు. సెలబ్రిటీల డిజైనర్లు, ఫ్యాషన్ డిజైనర్లు, పలు డిజైన్లు ఇచ్చి ఇలా నేసి ఇవ్వాలని ఆర్డర్ ఇస్తున్నారు. వారి కోసం ఆకర్షణీయమైన డిజైన్లతో చీరలను తయారు చేస్తాడు. గతంలో నటి అనుష్కకు రూ.80 వేల చీరను, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుటుంబంతో పాటు పలువురు వ్యాపార వేత్తలకు ఖరీదైన చీరలను అందజేసి వారి మెప్పును పొందాడు.
వినూత్న డిజైన్లను సృష్టించి..
ఇతనికి మొదటి నుంచి వస్త్ర తయారీలో ప్రయోగాలు చేయడమంటే ఇష్టం. ప్రయోగాలు చేసి విజయం కూడా సాధించాడు. ఇతర ప్రాంతాల్లో పేరుగాంచిన కంచి, ఉప్పాడ, జంథానీ, కోట డిజైన్లను, పోచంపల్లి ఇక్కత్ చీరల్లో మిళితం చేసి వినూత్న చీరలను సృష్టించాడు. ఒకే చీరలో పోచంపల్లి ఇక్కత్, కంచి బార్డర్, కొంగు కోటా డిజైన్. ఇలా మూడు రకాల వైరైటీ డిజైన్లను రూపొందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు.
మంచి ఆదరణ ఉంది
పోచంపల్లి ఇక్కత్‌లోనే అనేక డిజైన్లు ను రూపొందిస్తున్నాను. రిస్క్ ఎక్కువ ఉన్నా సరే నాకు చిన్నప్పటి నుంచి విభిన్నంగా చీరలను తయారు చేయాలని కోరిక. రూ. 6 వేల నుంచి రూ.80 వేల విలువైన చీరెలను తయారు చేస్తాను. ఖరీ దైన చీరలను మాత్రం ఆర్డర్‌పైన నేసి ఇస్తా ను. అంతేకాక పోచంపల్లి చీరలోనే కంచి, ఉప్పాడ, కోట, జంథానీ డిజైన్‌లతో చీరల ను కూడ తయారు చేశారు. చీరలకు మంచి ఆదరణ లభిస్తుంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని ఆవిష్కరణ చేస్తాను.
–చిలుకూరి రామ్మూర్తి, చేనేత కళాకారుడు