ఉప్పాడ చేనేత కళాకారుల అద్భుతసృష్టి జాంధానీ.. ఏళ్లు గడిచినా తరగని విలువ దీని ప్రత్యేకత. ఎటు నుంచి చూసినా కళాత్మకత ఉట్టిపడే ఈ చీరలకు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. జాంధానీ డిజైన్లతో కేంద్ర ప్రభుత్వం పోస్టల్ కవరు విడుదల చేయనుండడంతో ఈ చీర సోయగాల గొప్పతనం మరోసారి మార్మోగుతుంది. ఇప్పటికే పేటెంట్ హక్కుతో పాటు ఇండియన్ హ్యాండ్‌లూమ్స్‌లో ఉప్పాడ జాంధానీకి స్థానం లభించగా.. తాజాగా దక్కిన గౌరవంతో తమ బతుకుల్లో వెలుగులు వస్తాయని చేనేత కళాకారులు ఆశిస్తున్నారు. వీటి తయారీలో ఉపయోగించే నాణ్యమైన వెండి జరీ, అత్యంత నేర్పుతో ఒక్కొక్క పోగు చేతితో పేర్చే నేతన్న పనితనంతో ప్రపంచపటంలో జాంధానీకి అరుదైన స్థానం లభించింది.
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో తరతరాలుగా ఈ జాంధానీ చీరల తయారీని కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నారు. ఇవి అంత అందంగా కనిపించడానికి పూర్తిగా చేతితో నేయడమే కారణమని చెబుతారు. పాడై చిరిగిపోయినా.. కొన్న డబ్బులో సుమారు 30 శాతం వరకు తిరిగి వచ్చేస్తుంది. వెండి జరీలో సన్నని పట్టు, ఎర్రటి దారం ఉంటుంది. ఇది తొందరగా కాలదు, బూడిద కాదు. గీటురాయితో వెండి జరీ నాణ్యతను çపరీక్షించుకోవచ్చు. జరీని ఎన్ని పోగులు ఉపయోగిస్తే చీరకు అంత విలువ పెరుగుతుంది. నేతలో ఎక్కడా వదులు లేకుండా కార్మికులు చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎక్కడా లోపాన్ని పట్టుకోలేం.ఒక చీరపై ముగ్గురు నుంచి నలుగురు కార్మికులు పనిచేస్తారు. డిజైన్‌ను బట్టి పూర్తికావడానికి 20 నుంచి 40 రోజుల సమయం పడుతుంది. గతంలో రోజుకు ఒకట్రెండు చీరల కంటే ఎక్కువ తయారయ్యేవి కావు. ప్రస్తుతం 50 నుంచి 100 చీరలు తయారుచేస్తున్నారు. ముందు పేపరుపై డిజైన్ గీసుకుని నేత ప్రారంభిస్తారు.
జరీని బట్టి చీర ధర నిర్ణయం
చీరలో వాడే జరీని బట్టి విలువ నిర్ధారిస్తారు. చీరలో 240 గ్రాములు జరీ వాడితే దాని విలువ రూ 5 వేల వరకూ ఉంటుంది. డిజైన్ల కనుగుణంగా 500 గ్రాముల వరకూ జరీ వినియోగిస్తారు. చిలుక, హంస, నెమలి వంటి అనేక రకాల డిజైన్లు నేతన్నల కళాత్మకతను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. కొత్తపల్లి మండలంలోనే కొత్తపల్లి, కుతుకుడుమల్లి, వాకతిప్ప, అమీనాబాద్, ఉప్పాడ, మూలపేట తదితర గ్రామాల్లో గతంలో 50 వరకు ఉండే మగ్గాలు నేడు 500కు చేరాయి. గొల్లప్రోలు మండలం తాటిపర్తి తదితర గ్రామాల్లోను వీటి తయారీ ఉంది. అన్ని కులాల వారు చీరలు నేయడం విశేషం.
పోస్టల్ కవర్లపై ముద్రించేందుకు డిజైన్ల ఎంపిక
రూ.వెయ్యి నుంచి రూ.లక్ష వరకు ఖరీదు చేసే చీరల్ని ఇక్కడి నేతన్నలు తయారుచేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి ఆర్డర్‌లు వస్తుంటాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ షాషింగ్ సైట్లతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఇటీవల కాలంలో వ్యాపారం ఊపందుకుంది. జాంధాని పేటెంట్ హక్కు సాధించుకున్నాక అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లో స్థానం సంపాదించి విదేశీ ఆర్డర్లు కూడా పొందింది. ఇప్పుడు వీటిపై పోస్టల్ కవర్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉప్పాడ చేనేత కళాకారులకు వర్తమానం పంపింది. కవర్లపై ప్రింట్ చేసేందుకు చీరల డిజైన్లను పంపమని సూచించడంతో.. ఎంపిక చేసిన కొన్ని డిజైన్లకు ఢిల్లీకి పంపారు.
నేతన్న శ్రమకు దక్కని విలువ
మార్కెట్‌లో ఈ చీరలకు మంచి ధర పలుకుతున్నా.. నేత కార్మికుడికి దక్కే మజూరీ అంతంతమాత్రమే. కొన్ని చేనేత సహకార సంఘాలు మాస్టర్ వీవర్సుతో కుమ్మౖMð్క నేత కార్మికులను నట్టేట ముంచుతున్నాయి. తక్కువ మజూరీలు ఇస్తూ వారి శ్రమను దోచుకుంటున్నాయి. సహకార సంఘాల ద్వారా నేత కార్మికులతో చీరలు నేయించాల్సి ఉండగా ఎక్కడా అమలుకావడం లేదు. ముడిసరుకుల ధరలు చుక్కలనంటడం, చేసిన అప్పులు పెరిగిపోవడంతో నేతన్న ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. గత ఐదేళ్లలో చంద్రబాబు సర్కారు తమకిచ్చిన హామీల్ని నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కేవలం ఉప్పాడ పరిసర ప్రాంతాల చేనేత కార్మికులకు మాత్రమే సొంతమైన పేటెంట్ హక్కును కొందరు దళారులు పక్కదారి పట్టిస్తున్నారు. ఈ రకం చీరలను ఇతర ప్రాంతాల్లో నేయించడంతో ఇక్కడి చీరలకు గిరాకీ తగ్గుతోంది. పేటెంట్ హక్కును కాపాడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు.
నేతన్న నేరుగా విక్రయించేలా చూడాలి
అగ్గిపెట్టెలో పట్టే ఆరు గజాల చీర నేసిన ఘనత మా కార్మికులకుది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పోస్టల్ కవరు విడుదల చేయడంతో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మా కళాకారుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో వీటికి డిమాండ్ పెరుగుతుంది. నేరుగా కార్మికులే ఆన్‌లైన్‌లో విక్రయాలు జరుపుకునేలా
చర్యలు తీసుకోవాలి.
– ఆర్.నాగేశ్వరరావు, ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ సభ్యుడు, మూలపేట
Comments
Please login to add a commentAdd a comment