అప్పులు మరో నేతన్నను బలిగొన్నాయి. మగ్గం చెంతే చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. నన్నూ, పిల్లలను అనాథలను చేసి వెళ్లిపోయావా అంటూ భార్య రోదించిన తీరు అందరినీ కలచివేసింది.
ధర్మవరం అర్బన్: అప్పుల బాధ భరించలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ధర్మవరంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం యలహంకకు చెందిన వి.కుమార్ (25) చేనేత కార్మికుడిగా పనిచేసుకుంటూ జీవించేవాడు. ఈ క్రమంలో ధర్మవరానికి వలస వచ్చాడు. లక్ష్మీచెన్నకేశవపురానికి చెందిన కలిమిశెట్టి నాగరాజు, పార్వతి దంపతుల కుమార్తె యశోదను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. చంద్రబాబునగర్‌లో కాపురం పెట్టాడు. వీరికి మూడేళ్ల వయసు గల కుమారుడు దేవరాజ్, ఏడు నెలల వయసుగల కుమార్తె పూర్ణ ఉన్నారు. నిద్ర చేసేందుకని యశోద పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం కుమార్ మగ్గం వద్ద చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రెండు రోజుల తర్వాత గుర్తింపు..
పుట్టింటికి వెళ్లిన యశోద తన భర్తతో మాట్లాడాలని కాల్ చేస్తే ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. చార్జింగ్ లేదేమోనని భావించి మిన్నకుండిపోయింది. అలా పలుమార్లు చేసినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు గురైంది. శనివారం మధ్యాహ్నం చంద్రబాబునగర్‌లోని ఇంటికి చేరుకుంది. తలుపు తట్టినా లోపలి నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడంతో సమీపంలో క్రికెట్ ఆడుతున్న వారిని పిలిపించింది. వారు కిటికీలోంచి తొంగి చూడగా ఉరికి వేలాడుతున్న కుమార్ కనిపించాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని తలుపులు తెరిచారు. రెండు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని తేల్చారు. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు రూ.3 లక్షల వరకు ఉన్నాయని, వాటిని తీర్చలేకే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని భార్య తెలిపింది. విషయం తెలుసుకున్న చేనేత కార్మిక సంఘం నాయకులు బైముతక రమణ, చెన్నంపల్లి శ్రీనివాసులు మృతుడి భార్యను పరామర్శించారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment