
పెనుగాలుల బీభత్సం
తిరుపతి నగరంలో మంగళవారం గాలీవాన బీభత్సం సృష్టించింది. నెహ్రూవీధిలో పెనుగాలుల తీవ్రతకు మసీదు మినార్ విరిగిపడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. తిరుపతి నుంచి వెళ్లే రేణిగుంట, చంద్రగిరి, కరకంబాడి రహదారుల్లో పెనుగాలికి పెద్దపెద్ద వృక్షాలు వేర్లతో సహా పెకలించుకుని రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. హోర్డింగ్‌లు గాలికెగిరాయి. పలు చోట్ల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలో అంధకారం అలముకుంది.
తిరుపతి, సాక్షి: తిరుపతి నగరంలో మంగళవారం గాలీవాన బీభత్సం సృష్టించింది. వేసవిలో కురిసిన వర్షం ప్రయోజనం కంటే నష్టాన్నే ఎక్కువగా కలుగజేసింది. నెహ్రూవీధిలో ఈదురుగాలుల తీవ్రతకు మసీదు మినార్ విరిగిపడి ఒక వ్యక్తి మృతి చెందాడు. పలు చోట్ల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పేలడం, విద్యుత్ తీగలు తెగిపడడంతో సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలో చీకటి అలముకుంది. చెట్లు వేర్లను పెకలించుకుని కూలాయి. హోర్డింగ్‌లు గాలికెగిరాయి. నగరంలో అన్ని వైపులా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గాలీవాన ప్రభావంతో రోడ్లపైకి వచ్చేందుకు జనం ఒక దశలో భయపడ్డారు.
తిరుపతిలో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి గంటపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రోడ్లపై డ్రైనేజీ నీళ్లు మడుగులు కట్టాయి. ఈదురుగాలులు రెండు గంటలు వీచాయి. దీంతో రోడ్లపైన నడుస్తున్న జనం, వాహనదారులు చెట్లు విరిగి పైన పడతాయేమోనని భయపడ్డారు. చెట్లు ఉన్న ప్రాంతం నుంచి వేగంగా దాటుకునేందుకు ప్రయత్నించారు. గాలీవాన ప్రభావంతో తిలక్‌రోడ్డు, గాంధీరోడ్డు, యూనివర్సిటీరోడ్డు, లీలామహల్, ఎయిర్‌బైపాస్‌రోడ్డు, బాలాజీకాలనీ, ఆర్‌టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సాయంత్రం ఈదురుగాలుల విధ్వంసం
మంగళవారం సాయంత్రం నగరంలో గంట పాటు ఈదురుగాలులు తీవ్ర ప్రభావం చూపాయి. కొద్దిసేపు వర్షంపడి ఆగినా, గాలుల ప్రభావంతో ఆరుబయట, మిద్దెలపైన, భవంతులపైన ఉన్న ప్రకటన హోర్డింగ్‌లు విరిగి పడ్డాయి. నెహ్రూవీధిలో ఉన్న మసీదు మినార్ పెనుగాలికి విరిగి ఓ దుకాణంపై పడడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రామానుజ సర్కిల్‌లో హైమాస్ట్ లైట్ల స్తంభం విరిగి బస్సుపై పడింది. ఆ సమయంలో విద్యుత్ లేకపోవడంతో బస్సులోని వారు సురక్షితంగా బయటపడ్డారు.
తిరుపతి నుంచి వెళ్లే రేణిగుంట, చంద్రగిరి, కరకంబాడి రహదారుల్లో పెనుగాలికి పెద్దపెద్ద వృక్షాలు వేర్లతో సహా పెకలించుకుని రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. తిరుమల బైపాస్‌రోడ్డులోనూ, ఎయిర్‌బైపాస్‌రోడ్డులోనూ పెద్ద పెద్ద భవనాలపై ఏర్పాటు చేసిన కమర్షియల్ హోర్డింగ్‌లు చిరిగిపోయాయి. కొన్ని చోట్ల దుకాణాల ముందు నీడ కోసం వేసిన రేకులు గాలికి ఎగిరి పక్కన పడ్డాయి. భవనాల కిటీకీలు కొట్టుకుని అద్దాలు పగిలాయి.
చీకట్లో తిరుపతి నగరం
సాయంత్రం గంటన్నర పాటు ఈదురుగాలుల బీభత్సానికి నగరంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హెచ్‌టీ, ఎల్‌టీ లైన్ల తీగలు తెగి రోడ్లపై పడ్డాయి. తిరుమల బైపాస్‌రోడ్డు, తిలక్‌రోడ్డు, భవానీనగర్ తదితర ప్రాంతాల్లో నాలుగు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు బ్రేక్‌డౌన్ అయ్యాయి. దీంతో నగరంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను ముందు జాగ్రత్తగా నిలిపేశారు. తిరుపతి నగరంలో మూడు గంటలకు పైగా పూర్తిగా చీకట్లు అలముకున్నాయి.
ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులకు, తెగిన విద్యుత్‌లైన్లు పునరుద్ధరించేందుకు కొన్ని చోట్ల రాత్రి 10 గంటల వరకు పట్టింది. విద్యుత్ సరఫరా సాయంత్రం 5.30 గంటల నుంచి 9.30 వరకు లేదు. దీంతో ఆస్పత్రులు, కార్యాలయాలు, వాణిజ్యసంస్థలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కార్పొరేషన్ అధికారులు రోడ్లపై విరగిపడిన చెట్లను తొలగించేందుకు యుద్ధ ప్రతిపాదికన రంగంలోకి దిగారు.