trucks
-
అమెరికాలో దాడులు.. ట్రెండింగ్‌లో ఆ కంపెనీ
కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అమెరికాలో జరిగిన వరుస ప్రమాదాలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. న్యూ ఆర్లీన్స్‌లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ట్రక్కు దాడి.. లాస్ వెగాస్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. కాబోయే అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump)కు చెందిన హోటల్ వద్ద టెస్లా కారులో పేలుడు సంభవించింది. ఈ రెండు ఘటనల్లో పలువురు మృతి చెందారు.లాస్ వెగాస్‌లోని టెస్లా సైబర్‌ట్రక్ పేలుడు.. న్యూ ఓర్లీన్స్ ట్రక్ దాడికి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు ప్రమాదాలు ఒకే రోజు సంభవించాయి. అంతే కాకుండా ఈ రెండు వాహనాలను 'టూరో' (Turo) నుంచి అద్దెకు తీసుకున్నారు.న్యూ ఓర్లీన్స్లో జరిగిన సంఘటన తర్వాత, అనుమానితుడు 'షంసుద్ దిన్ జబ్బార్' కారును ఎలా స్వాధీనం చేసుకున్నాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఎఫ్‌బీఐ తెలిపింది. దాడి చేసిన ఈవీ పికప్ ట్రక్కులో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ జెండా కనిపించిందని ఎఫ్‌బీఐ వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే.. అనుమానితునికి ఐఎస్ఐఎస్ మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు పుడుతున్నాయి.లాస్ వెగాస్‌లోని ట్రంప్ హోటల్ వెలుపల టెస్లా సైబర్‌ట్రక్ పేలుడులో అనుమానితుడుగా 37 ఏళ్ల 'మాథ్యూ లైవెల్స్బెర్గర్'గా గుర్తించినట్లు యుఎస్ మీడియా నివేదికలు తెలిపాయి. అధికారులు ఈ సంఘటనను ఉగ్రవాద దాడిగా దర్యాప్తు చేస్తున్నారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. షంసుద్ దిన్ జబ్బార్ 2010 వరకు ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేసిన ఆర్మీ వ్యక్తి. మాథ్యూ లైవెల్స్బెర్గర్ కూడా యుఎస్ ఆర్మీ వెటరన్. అంటే వీరిరువురూ.. ఆర్మీలో పనిచేసినవారే. ఆర్మీలో పనిచేసిన వారు ఈ దాడులకు పాల్పడ్డారా? దీని వెనుక ఉన్న కారణం ఏమిటనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.టూరో కంపెనీ గురించిటూరో అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కార్ రెంటల్ యాప్. దీనిని శాన్ ఫ్రాన్సిస్కోలో 2010లో స్థాపించారు. 2010లో రిలే రైడ్స్గా ప్రారంభమై.. 2015లో టురోగా మారింది. ఇది వినియోగదారులు కలవకుండానే వారికి నేరుగా కార్లను అద్దెకు తీసుకునేందుకు అనుమతిస్తుంది.ఎలా అంటే.. వినియోగదారులు తమ లొకేషన్‌ను ఎంటర్ చేసిన తర్వాత సమీపంలో అందుబాటులో ఉన్న అద్దె కార్లను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. టయోట, పోర్షెస్, టెస్లాస్తో సహా అనేక రకాల కార్లు టూరోలో అద్దెకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కారును అద్దెకు తీసుకోవాలంటే.. 18 సంవత్సరాలు నిండి, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. కాబట్టి కార్లను బుక్ చేసుకున్న వారిగురించి తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
1000 ట్రక్కుల భారీ ఆర్డర్.. దక్కించుకున్న బెంగళూరు స్టార్టప్
ఎలక్ట్రిక్ ట్రక్కులు తయారు చేసే బెంగళూరు ఆధారిత స్టార్టప్ ట్రెసా మోటార్స్ లాజిస్టిక్స్ కంపెనీ భారీ ఆర్డర్ దక్కించుకుంది. జేఎఫ్‌కే ట్రాన్స్పోర్టర్స్ నుండి 1,000 ట్రక్కుల కోసం ప్రీ-ఆర్డర్‌ను పొందింది. ఈ కంపెనీ మోడల్ V0.1ని అందిస్తోంది. దీన్ని గతేడాది జూలైలో ఆవిష్కరించింది. ట్రెసా కంపెనీ 18T-55T స్థూల వాహన బరువు విభాగంలోనూ ఎలక్ట్రిక్ ట్రక్కులను అభివృద్ధి చేస్తోంది. ట్రెసా ట్రక్కులు ప్రస్తుతం 300kWh బ్యాటరీ ప్యాక్, 24,000Nm మోటరును కలిగి ఉన్నాయి. ఇవి 15 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జీకి సపోర్ట్ చేస్తాయి. 120kmph గరిష్ట వేగాన్ని ఇస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులు ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో ఎంత రేంజ్ ఇస్తాయన్నది కంపెనీ వెల్లడించలేదు."మేము ఈ స్థితికి చేరుకోవడానికి చాలా సంవత్సరాలు కష్టపడ్డాం. ఇంకా ఇది ప్రారంభం మాత్రమే. జేఎఫ్‌కే ట్రాన్స్పోర్టర్స్ వంటి ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీలు ముందుకు రావడం మరియు మాపై విశ్వాసం ఉంచడం మాకు చాలా ఆనందంగా ఉంది" అని ట్రెసా మోటర్స్ సీఈవో రోహణ్ శ్రవణ్ పేర్కొన్నారు. ట్రెసా మోటార్స్ అధునాతన ఎలక్ట్రిక్ ట్రక్కులను తమ ఫ్లీట్‌లో చేర్చడం ద్వారా కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించే తమ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తున్నామని జేఎఫ్‌కే ట్రాన్స్పోర్టర్స్ ఎండీ ఆదిల్ కొత్వాల్ అన్నారు. -
ట్రక్కు క్యాబిన్లలో ఏసీ తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్
సరకు రవాణా చేసే ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్లను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2025 అక్టోబర్ 1, ఆ తర్వాత తయారయ్యే ఎన్2, ఎన్3 కేటగిరి ట్రక్కులలో డ్రైవర్ల కోసం ఏసీ క్యాబిన్లు తప్పనిసరి చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 3.5 టన్నుల నుంచి 12 టన్నులు బరువుండే ట్రక్కులు ఎన్2 కేటగిరీ కిందకు, 12 టన్నులు దాటిన ట్రక్కులు ఎన్3 కేటగిరీ కిందకు వస్తాయి. డ్రైవర్లకు మెరుగైన పని వాతావరణం కల్పించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రక్కు క్యాబిన్లలో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలను తప్పనిసరి చేసేందుకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు ఆమోదం లభించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గత జులైలోనే తెలిపారు. దేశానికి అత్యంత ముఖ్యమైన రంగాలలో ఒకటైన రవాణా రంగంలో ట్రక్ డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి పని పరిస్థితులు, మానసిక స్థితికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
భారత సైన్యంలోకి బలిష్టమైన వాహనాలు - ఇవి చాలా స్పెషల్!
భారతదేశానికి రక్షణ కవచం 'ఇండియన్ ఆర్మీ' కోసం ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) ప్రత్యేకంగా తయారు చేసిన హైలక్స్ పికప్ ట్రక్కులను డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే మొదటి బ్యాచ్ డెలివరీ చేసిన టయోటా ఇప్పుడు రెండు కొత్త మోడిఫైడ్ వెర్షన్లను సైన్యానికి అందించింది. ఈ రెండు కార్లు ప్రత్యేక అవసరాల కోసం తయారైనవి.. కావున వీటికి ఫీల్డ్ డయాగ్నోసిస్ వెహికల్ (FDV), ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ వెహికల్ (RIV) అని పేరు పెట్టారు. ఫీల్డ్ డయాగ్నోసిస్ వెహికల్ భారతదేశ కఠిన భూభాగాల్లో ప్రయాణించడానికి అనుకూలంగా తయారైంది, కాగా ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ వెహికల్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి నిర్మించారు. ఇందులో ఫైర్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ పరికరాలు ఉంటాయి. మొత్తానికి భారత సైన్యంలో ఇవి రెండు తప్పకుండా ఉత్తమ సేవలను అందించేలా రూపొందించారు. డిజైన్ పరంగా కొంత భిన్నంగా ఉన్న ఈ పికప్ ట్రక్కులు చాలా వరకు అదే ఫీచర్స్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.8 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 204 పీఎస్ పవర్ అందిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 420 న్యూటన్ మీటర్ టార్క్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదీ చదవండి: ఏఐ అద్భుత చిత్రం.. చీకట్లో ల్యాండర్ ఇలాగే ఉంటుందా? ఇండియన్ ఆర్మీకి భారతీయ కార్ల తయారీదారులకు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రారంభం నుంచి సైన్యలో మహీంద్రా, ఆ తరువాత మారుతి వాహనాలు విస్తృతమైన సేవలు అందిస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు టయోటా తన హైలక్స్ ట్రక్కులతో సేవలందించడానికి అడుగులు వేస్తోంది. -
వర్షాల ఎఫెక్ట్.. సరుకు రవాణా బంద్.. తమిళనాడులో నిలిచిపోయిన 75వేల ట్రక్కులు
చెన్నై: ఉత్తరభారత దేశంలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వానల ధాటికి కాలువలు, వాగులు వంకలు నదులను తలపిస్తున్నాయి. రోడ్లు దెబ్బతిని రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వీటితో పాటు సరుకు రవాణా కూడా బంద్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన వేలాది ట్రక్కులు తమిళనాడులో నిలిచిపోయాయి. ఈ ట్రక్కులలో కొబ్బరికాయలు, సజ్జలు, స్టార్చ్, ఆరోగ్య సంరక్షణ మందులలో పదార్థాలుగా ఉపయోగించే ముడి పదార్థాలు, అగ్గిపెట్టెలు, క్రాకర్లు, వస్త్రాలు ఉక్కు మరియు ఇనుము పదార్థాలు వంటివి లోడ్లతో కూడిన 75 వేలకుపైగా ట్రక్కుల సరుకుని ఉత్తరాది రాష్ట్రాలకు రవాణా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ట్రక్కులన్నీ తమిళనాడులోని వివిధ పట్టణాలు, నగరాల్లో ఆగిపోయాయి. ఇవి ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లకు చేరుకోవాల్సి ఉంది. మరోవైపు తమిళనాడుకు రావాల్సిన 25,000కు పైగా ట్రక్కులు ఉత్తరాది రాష్ట్రాల్లో నిలిచిపోయినట్లు లారీ ఓనర్స్ ఫెడరేషన్-తమిళనాడు అధ్యక్షుడు తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరిన తర్వాత, ప్రయాణానికి అనుకూలంగా మారిన తర్వాతే తమిళనాడు నుంచి లారీలు బయలుదేరుతాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా భారీ వర్షాల వల్ల వస్తువులను ఆర్డర్ పెట్టిన కంపెనీలు, ట్రక్ కంపెనీలతో పాటు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చదవండి: ఇకపై కేదార్నాథ్ ఆలయంలో పిచ్చి పనులు చేస్తే జైలుకే.. -
బాబోయ్..! నదీ ప్రవాహంలో ట్రక్కు డ్రైవింగ్.. వీడియో వైరల్..
పట్నా: బిహార్‌లోని సోన్ నదిలో చిక్కుకున్న లారీలను బయటకు తీస్తున్నారు అధికారులు. ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో ఆ దృశ్యాలు బీతికొల్పుతున్నాయి. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సగం లారీ మునిగిపోయినప్పటికీ ప్రవాహంలో వాహనాలను బయటికి తీయడం సాహసంతో కూడిన పని అని నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే.. సోన్ నదీ ప్రవాహంలో ఇప్పటికే ఇద్దరు మరణించారు. ఇటీవల కురిసిన విపరీత వర్షాల కారణంగా సోన్ నదిలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటికే నదిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్న 28 లారీలు నదిలో చిక్కుకుపోయాయి. అదీగాక జులై 1 నుంచి సోన్ నదిలో ఇసుక తవ్వకాలు ఆపేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత వారం రోజుల నుంచి వాహనాలను బయటికి తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే.. రోహ్టాస్ జిల్లాలో ఖటూర్ బాలు ఘాట్ వద్ద లారీలను నదిలో వరద నీరు ఉద్దృతంగా ప్రవహిస్తున్నప్పటికీ బయటకు తీశారు. వాహనం సగంపైనే మునిగిపోయినప్పటికీ ఏమాత్రం వెనకకు తగ్గకుండా ప్రవాహాన్ని దాటేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: కేరళలో మరో అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే..! -
ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్లు.. ముసాయిదా నోటిఫికేషన్‌కు నితిన్ గడ్కరీ ఆమోదం!
న్యూఢిల్లీ: రవాణా ట్రక్కుల్లో డ్రైవర్ల క్యాబిన్లకు ఏసీలు అమర్చడాన్ని తప్పనిసరి చేసే ముసాయిదా నోటిఫికేషన్‌కు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. ఎన్2, ఎన్3 ట్రక్కుల క్యాబిన్లకు ఏసీలను బిగించడం తప్పనిసరి అని ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. రహదారి భద్రతలో ట్రక్ డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తున్నట్టు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ట్రక్కు డ్రైవర్లకు సౌకర్యవంతమైన పని వాతావరణం కల్పించడంతో ఈ నిర్ణయం కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఇది వారి పనితీరును సైతం మెరుగుపరుస్తుందన్నారు. Approved the draft notification to mandate the installation of air-conditioning systems in the cabins of trucks belonging to categories N2 and N3. Truck drivers play a crucial role in ensuring road safety. This decision marks a significant milestone in providing comfortable… — Nitin Gadkari (@nitin_gadkari) July 6, 2023 -
కంటైనర్‌లో రూ.1000 కోట్ల నగదు.. భారీ భద్రత, హఠాత్తుగా ఆగిపోయిన వాహనం
సాక్షి, చెన్నై: రిజర్వ్ బ్యాంక్ నుంచి విల్లుపురం వైపుగా రూ. 1000 కోట్ల నగదుతో వెళ్తున్న కంటైనర్ మార్గం మధ్యలో మరమ్మతులకు గురైంది. దీంతో ఆ వాహనానికి కట్టుదిట్టమైన భద్రతను కలి్పంచారు. వివరాలు.. చెన్నై రిజర్వు బ్యాంక్ నుంచి విల్లుపురం వైపుగా ఓ బ్యాంక్‌కు రూ. వెయ్యికోట్ల నగదును తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ నగదు తో రెండు కంటైనర్లు భారీ భద్రత నడుమ బుధవారం చెన్నై నుంచి బయలుదేరాయి. అయితే తాంబరం శానిటోరియం వద్ద ఓ వాహనం మరమ్మతుకు గురైంది. రోడ్డు మీద ఈ వాహనం హఠాత్తుగా ఆగడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ముందుగా వెళ్తు న్న మరో కంటైనర్‌ను కూడా ఆపివేశారు. కంటైన ర్ మరమ్మతుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సిద్ధ వైద్య కళాశాలలోకి ఆ వాహనాలను తీసుకెళ్లారు. తాంబరం పోలీసులు వాటికి భద్రత కల్పిస్తున్నారు. -
కొత్త స్కీం: మైలేజ్ ఇవ్వని వాహనాలు వాపస్ ఇచ్చేయండి!
ఏ కంపెనీ అయినా ఇలాంటి ప్రకటన ఇస్తుందా? అనే అనుమానం రావొచ్చు. కానీ, మహీంద్రా గ్రూపు ఈ ఆసక్తికర స్కీంతో వాహనదారుల్ని ఆకట్టుకుంటోంది. అధిక మైలేజీ ఇవ్వని వాహనాలను వెనక్కి ఇచ్చేయొచ్చంటూ వాహనదారులకు ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు మహీంద్రా ట్రక్ అండ్ బస్ (ఎంటీబీ) చేసిన ప్రకటన ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఎంటీబీ రూపొందించే బీఎస్6 ట్రక్కుల శ్రేణిలో ఏ ఒక్క మోడల్ అయినా అత్యధిక మైలేజీ ఇవ్వకపోతే దాన్ని వాపసు తీసుకుంటామని పేర్కొంది మహీంద్రా కంపెనీ. బీఎస్6 శ్రేణిలో భారీ, మధ్యస్థ, తేలికపాటి వాహనాలు ఉపయోగించేవాళ్లకు ఈ స్కీం వర్తిస్తుందని ప్రకటించుకుంది. ‘పోటీ కంపెనీ వాహనాల కంటే మా వాహనాలు మైలేజీ తక్కువ గనుక ఇస్తే.. వాహనదారులు నిరభ్యరంతంగా మా వాహనాల్ని వెనక్కి ఇచ్చేయొచ్చ’ని స్కీం గురించి వివరించింది కంపెనీ. ఈ మేరకు ‘బ్లేజో ఎక్స్ హెచ్ సీవీ, ఫ్యూరియో ఐసీవీ, ఫ్యూరియో 7, జేయో’ మోడల్ వాహనాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎంటీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే.. ఎండీఐ టెక్ ఇంజిన్లు, ఫ్యూయల్ స్మార్ట్ సాంకేతిక పరిజ్ఞానంతో ఎంటీబీ ఈ రవాణా వాహనాల్ని తయారు చేస్తోంది. ఇంధన ధరలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో వినియోగదారుల పరంగా చూస్తే ఇది సరైన పథకం అని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ సీఈవో వీజయ్ నక్రా చెబుతున్నారు. ‘మహీంద్రా సంస్థ సాంకేతిక సామర్థ్యంపై వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచాలనుకుంటున్నాం. తద్వారా రవాణా వాహన శ్రేణిలో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పడంలో నిబద్ధత కనబరుస్తున్నాం’ అని నక్రా ప్రకటించుకున్నారు. అయితే సరుకు రవాణా వాహన విభాగంలో పట్టు సాధించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఇలా సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తేం కాదు.. ‘‘మైలేజీ రాకపోతే వాహనాల్ని వెనక్కి ఇవ్వండి’’ అనే ప్రకటన మహీంద్రాకు కొత్తేం కాదు. 2016లో బ్లేజో ఎక్స్ హెచ్ సీవీ ట్రక్కుల విషయంలో ఇలాంటి స్కీమ్ అమలు చేసింది. అయితే ఆ టైంలో 33 వేల బ్లేజో ట్రక్కులు అమ్ముడుపోగా.. ఒక్క వాహనం కూడా వెనక్కి రాలేని ఎంటీబీ ప్రకటించుకుంది. చదవండి: ఐఫోన్ అమ్మకాలతో యాపిల్ ఉక్కిరిబిక్కిరి,భారత్‌లో దూసుకెళ్తున్న సేల్స్!! -
వంద శాతం రుణంతో మహీంద్రా సుప్రో ప్రాఫిట్ ట్రక్స్
Mahindra Supro Profit Truck హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా సుప్రో ప్రాఫిట్ ట్రక్ శ్రేణిని ప్రవేశపెట్టింది. ధర ముంబై ఎక్స్ షోరూంలో మినీ రూ.5.4 లక్షల నుంచి, మ్యాక్సీ రూ.6.22 లక్షల నుంచి ప్రారంభం. డీజిల్, సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది. సుప్రో ప్లాట్‌ఫాంపై ఇవి రూపొందాయి. కొనుగోలుదార్లు అయిదేళ్ల కాలపరిమితితో 100 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. ‘సామర్థ్యం, ఇంజినీరింగ్ కారణంగా కస్టమర్లు ఇష్టపడే చిన్న వాణిజ్య వాహనంగా సుప్రోకు ప్రాధాన్యత ఉంది. వినియోగదార్ల లాభదాయకతను దృష్టిలో పెట్టుకుని నూతన శ్రేణిని అందుబాటులోకి తెచ్చాం’ అని కంపెనీ ఆటోమోటివ్ విభాగం సీఈవో విజయ్ నక్రా తెలిపారు. -
పేద నిరుద్యోగులకు మినీ ట్రక్కులు
సాక్షి, అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. తాజాగా ఆయా వర్గాల్లోని పేద నిరుద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలని నిర్ణయించింది. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న 9,260 మంది పేద నిరుద్యోగులను ఎంపిక చేసి ప్రభుత్వం వారికి భారీ సబ్సిడీతో మినీ ట్రక్కులు ఇవ్వనుంది. ఇంటింటికీ సబ్సిడీ సరుకుల పంపిణీకి ఈ వాహనాలను వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో వాహనాల కొనుగోలుకు సంబంధించి సెప్టెంబర్ 11న పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసింది. ఆరేళ్లలో లబ్ధిదారునికి వాహనం సొంతం ఒక్కో వాహనం ఖరీదు రూ. 5,81,190గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 60% అంటే రూ.3,48,714 సబ్సిడీ కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. 30% అంటే రూ.1,74,357 బ్యాంకు రుణం కింద అందజేస్తుంది. మొత్తం వాహనం ఖరీదులో కేవలం 30% మాత్రమే బ్యాంకు నుంచి రుణంగా తీసుకుంటున్నందున లబ్ధిదారులపై పెద్దగా భారం పడదు. సులభ వాయిదాలలో రుణం చెల్లించేందుకు వీలవుతుంది. ఇక లబ్ధిదారుని వాటా కింద కేవలం 10% అంటే రూ.58,119 మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. కాగా బ్యాంకు రుణ మొత్తాన్ని ఆరు సంవత్సరాల్లో చెల్లించేట్లుగా నిబంధనలు విధించారు. అంటే ఆరేళ్లలో వాహనం లబ్ధిదారుని సొంతమవుతుందన్న మాట. ఏదైనా పథకం కింద ఇంత భారీ స్థాయిలో సబ్సిడీ ఇవ్వడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. నెలకు రూ.10 వేల నికర ఆదాయం ప్రభుత్వం వచ్చే జనవరి నుంచి ఇంటింటికీ సబ్సిడీ బియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేయనుంది. ఇప్పటివరకు చౌకధరల దుకాణాల నుంచి కార్డుదారులు బియ్యం తెచ్చుకుంటున్నారు. ఇకపై వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం ఇంటింటికీ బియ్యం, సరుకులు అందజేయనుంది. ఈ నేపథ్యంలోనే ట్రక్కుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదట మండల స్థాయి గోడౌన్ పాయింట్ల నుంచి సరుకులు మినీ ట్రక్కుల ద్వారా డీలర్ షాపులకు చేరుస్తారు. అక్కడి నుంచి ఇంటింటికీ చేర్చే కార్యక్రమాన్ని చేపడతారు. బ్యాంకు రుణం, ఇతర ఖర్చులు పోను లబ్ధిదారునికి నెలకు రూ.10 వేలు కార్పొరేషన్ చెల్లిస్తుంది. 27 వరకు దరఖాస్తుల స్వీకరణ మినీ ట్రక్కులకు దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలైంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకుని పూర్తి చేసిన అనంతరం తిరిగి అక్కడే అందజేయాలి. ఈనెల 27వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 4న ఇంటర్వ్యూలు ఉంటాయి. 5న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తారు. కార్పొరేషన్ల వారీగా ప్రభుత్వం ఎంపిక చేసే లబ్ధిదారుల సంఖ్య ఇలా.. బీసీలు 3,800 ఈబీసీలు 1,800 ఎస్సీలు 2,300 ఎస్టీలు 700 క్రైస్తవులు 104 మైనార్టీలు 556 మొత్తం 9,260 -
సరుకు రవాణా వాహనాలకు పాస్‌లు అవసరం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాల మధ్య నడిచే ట్రక్కులు, ఇతర సరుకు రవాణా వాహనాలు, అన్లోడ్ చేసి వెళ్లే ఖాళీ వాహనాలకు పాస్‌లు అవసరం లేదని హోం శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు సర్క్యులర్ జారీ చేసింది. లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూ ఏప్రిల్ 15న జారీ చేసిన ఉత్తర్వుల్లోని నిబంధన 12(1), నిబంధన 12(6)లపై స్పష్టత ఇచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో సరుకు రవాణా వాహనాలు, అన్లోడ్ చేసిన వాహనాలను పాస్‌ల పేరిట అడ్డుకుంటున్నట్లు ఫిర్యాదు లు వచ్చాయని, వీటికి పాస్‌లు అవసరం లేదని, డ్రైవర్‌కు లైసెన్స్ ఉంటే చాలునని తేల్చి చెప్పింది. దేశంలో వస్తువుల సరఫరా సజావుగా సాగేందుకు ఇది తప్పనిసరి అని వివరించింది. రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలు ఈ ఆదేశాలు పాటించేలా సూచనలు జారీ చేయాలని కోరింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులను స్వస్థలాలకు పంపే విషయంలో జారీ చేసిన మార్గదర్శకాలను, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. కరోనా ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని, వీరిని రోడ్డు మార్గంలో శానిటైజ్ చేసిన వాహనాల్లో తరలించాలని తెలిపింది. సంబంధిత రాష్ట్రాల అధికారులు ఈ విషయంలో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకుంటూ ఉండాలని సూచించింది. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం వేకువ ఝామున రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. కాన్పూర్ సమీపంలోని సజేటి దగ్గర ఓ బ్రిడ్జిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేయిస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ఘోర రోడ్డు ప్రమాదం
హమిర్పూర్: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో చోటుచేసుకుంది. గురువారం ఉదయం మోధ ప్రాంతంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు లారీలు ఎక్కువ వేగంతో వెళ్తూ ఢీకొనడంతో అవిపూర్తిగా ధ్వంసమయ్యాయి. -
15 ఏళ్లు దాటితే పక్కనబెట్టాల్సిందే..
కాలుష్య సమస్యతోపాటు ప్రమాదాలకు కారణమువుతున్న పాత వాహనాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు కొత్త విధానాన్ని రూపొందిస్తున్నామని, ఇది అమలైతే 15 ఏళ్ల నాటి 11.5 లక్షల ట్రక్కులు, బస్సులు కనుమరుగవుతాయని అధికారులు చెబుతున్నారు. న్యూఢిల్లీ : అనేక సమస్యలకు కారణమవుతున్న 15 ఏళ్లకు పైబడిన వాహనాలన్నింటినీ దశల వారీగా తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక విధానం రూపొందించాలని నిర్ణయించింది. ఈ విధానం అమలైతే రోడ్లపై చక్కర్లు కొడుతున్న 15 ఏళ్ల నాటి 11.5 లక్షల ట్రక్కులు, బస్సులు కనుమరుగవుతాయి. వాటి స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై రూ.నాలుగు వేల కోట్ల భారం పడనుంది. కాలుష్యభరితమైన పాత వాహనాల తొలగింపుపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రవాణా మంత్రి నితిన్ గడ్కారీ చర్చలు జరిపారు. పాత వాహనాల తొలగింపునకు ప్రత్యేక విధానం రూపొందించాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మొదటి దశలో పాత ట్రక్కులు, భారీ వాహనాలకు, రెండో దశలో 15 ఏళ్ల కిందటి 60 లక్షల నాలుగు చక్రాల వాహనాలకు స్వస్తి పలుకనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కాలుష్య నిబంధనలకు అనుగుణంగా లేని పాత వాహనాలను తప్పనిసరిగా తొలగించాలనే నిబంధనను తీసుకురావాలని ఆర్థిక మంత్రి భావిస్తున్నట్టు నితిన్ గడ్కారీ తెలిపారు. ‘పాత వాటి స్థానంలో కొత్తవి కొనేవారికి నేరుగా నగదు ప్రయోజనాలు కల్పిస్తాం. అయితే ఎక్సైజ్ డ్యూటీ మాత్రం చెల్లించాల్సిందే. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు లేకపోవడం వల్ల కొత్త వాహనాల అమ్మకంతో ప్రభుత్వానికి సుమారు రూ.19 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుంది. చమురు దిగుమతులు కూడా తగ్గించుకుని, ఏటా రూ.7,700 కోట్ల వరకు ఆదాయం సమకూర్చుకోవాలని మా మంత్రిత్వశాఖ నిర్ణయించింది’ అని మంత్రి గడ్కారీ వివరించారు. -
పదేళ్ళు దాటితే..
రాయపూర్ః దేశంలో పొల్యూషన్ పై పోరాటం ప్రారంభమైంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పద్ధతులతో కాలుష్యాన్ని నివారించేందుకు అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అందులోభాగంగా తాజాగా పదేళ్ళు దాటిన ట్రక్కులు, బస్సులు, ఆటోలను బ్యాన్ చేసేందుకు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ సంవత్సరం పాటు గడువు ఇస్తున్నామని, ఆలోపు కొత్త వాహనం కొనే ప్రయత్నం చేసుకోవాలని వాహన యజమానులకు రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అంతేకాక 'ఈ' రిక్షాలను కొనేవారికి ప్రత్యేక ఆర్థిక సాయం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన అమల్లోకి తెస్తోంది. పన్నెండేళ్ళు దాటిన బస్సులు, పదేళ్ళు దాటిన ట్రక్కులు, ఆటో రిక్షాలు వంటి కమర్షియల్ వాహనాలు రోడ్లపై తిరగకుండా నిలిపివేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గాలిలో కాలుష్యాన్ని తగ్గించి, వాతావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ముందడుగు వేయాలని ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్.. సీనియర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఛత్తీస్ ఘడ్ ఎన్విరాన్మెంట్ కంజర్వేషన్ బోర్డ్ ఛైర్ పర్సన్ అమన్ కుమార్ సింగ్ తెలిపారు. ఇప్పటినుంచీ పదేళ్ళు దాటిన ట్రక్కులు, ఆటోలు, పన్నెండేళ్ళు దాటిన బస్సులకు అనుమతులు ఇవ్వొద్దని, వాహన యజమానులు కొత్త వాహనాలు కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఓ సంవత్సరం పాటు గడువు ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన ఎనిమిదేళ్ళు దాటిన పాత వాహనాలకు రిజిస్ట్రేషన్లు కూడ చేయొద్దని ఆదేశించినట్లు తెలిపారు. 'ఈ' రిక్షాలను ప్రోత్సహించేందుకు గాను ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. వాతావరణ పరిరక్షణలో భాగంగా మరో నిర్ణయం తీసుకున్నామని, ఆన్ లైన్ మానిటరింగ్ తో పారిశ్రామిక కాలుష్య పరిమాణాన్ని అంచనా వేస్తామని సీఎం రమణ్ సింగ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నెల్లో రెండుసార్లు పరిశ్రమల యాజమాన్యాలు ప్రవర్తిస్తే ఆయా యూనిట్లను మూసివేయిస్తామన్నారు. రాష్ట్ర రాజధాని రాయపూర్ లో పొల్యూషన్ తగ్గించేందుకు ఓ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. గత నెల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ హెచ్ వో) వెల్లడించిన నివేదికల ప్రకారం అత్యధిక కాలుష్యంగల నగరాల్లో రాయపూర్ ఏడో స్థానంలో ఉందని, ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో రాయపూర్ లో వచ్చే రెండేళ్ళలో కాలుష్యం నివారించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా రాయపూర్ లోని రైల్వే ట్రాక్ ప్రాంతాల్లో నివసించే వారికి ప్రధానమంత్రి ఉజ్వల్ పథకం ద్వారా డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు అందిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక సర్వే చేపడుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. అలాగే రాజధానిలో ఈ సంవత్సరం సుమారు 30 లక్షల వరకూ మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, గృహాల్లోని వ్యర్థాలకోసం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు సైతం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. -
ఇది ఇసుక బాట..!
మహదేవపూర్ : ఈ చిత్రంలో మీరు చూస్తున్నది గోదావరి నదిలో నిర్మిస్తున్న రోడ్డు. ఇది ప్రభుత్వం ప్రజా రవాణా కోసం వేస్తున్న రోడ్డు కాదు. కొందరు అక్రమార్కులు ఇసుక రవాణా కోసం నిర్మిస్తున్న రహదారి. మహదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామ శివారులోని నదిలో ఒడ్డు నుంచి నీటి ప్రవాహం వరకు లారీల రాకపోకల కోసం వేస్తున్న బాట ఇది. ఇంత జబర్దస్తీగా రోడ్డు వేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని మాత్రం అడగొద్దు సుమా! ఎందుకంటే అధికారుల తీరు షరా‘మామూలే’నన్న సంగతి జరగమెరిగన సత్యమే కదా!! విశ్వసనీయ సమాచారం మేరకు.. పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రీచ్‌లకు టెండర్లు నిర్వహించింది. అటువైపు ఇసుక రీచ్‌లను టెండర్లలో పొందిన కొందరు ఆ ఇసుకను తెలంగాణకు తరలించేందుకు ఏకంగా గోదావరినదిలోనే సుమారు మూడు కిలోమీటర్ల వరకు మట్టితో భారీ రోడ్డు నిర్మాణానికి పూనుకున్నారు. గోదావరి తీరంలో ఇప్పటికే వరంగల్ జిల్లా భూపాల్పల్లి సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌లున్నాయి. ఈ రీచ్‌లను సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వం వద్ద కొన్ని సంవత్సరాలకు లీజ్‌కు తీసుకుంది. సదరు రీచ్‌ల పరిధిలో ఇతరులెవరూ రోడ్డు నిర్మించడానికి వీల్లేదు. కానీ సింగరేణి సంస్థకు ఇసుకను తరలించే కాంట్రాక్టర్‌తో మహారాష్ట్రలో ఇసుక రీచ్‌లు పొందిన కాంట్రాక్టరు మిలాఖత్ అయి అదే రోడ్డుతో పాటు మరికొంత రెవెన్యూ స్థలంలో రోడ్డు వేసి ఇసుకను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గోదావరిలోని ఇసుకతో పాటు నదిలోనీటి ప్రవాహంలో కూడా భారీగా మట్టిరోడ్డును వేస్తున్నారు. ఇసుకను ప్రొక్లయిన్తో తీయించి పొరకను వేసి దానిపై మట్టితో రోడ్డు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి ఇసుకలో రోడ్డు వేసేందుకు మట్టిని అక్రమంగా భారీ టిప్పర్లు, ప్రొక్లెన్లతో తరలిస్తున్నారు. ఈ వ్యవహారమంతా అక్రమంగా సాగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఈ రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకోవటానికి మీనమేషాలు లెక్కపెడుతున్నారు. స్పందించని అధికారులు ఈ విషయాన్ని కొందరు యువకులు స్థానికంగా ఉండే రెవెన్యూ సిబ్బంది దృష్టికి తీసుకుని పోయారు. వారు చుట్టపు చూపుగా వెళ్లి పనులను నిలిపివేస్తున్నట్టు నటిస్తున్నారు. కానీ గోదావరి నదిలో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేసేందుకు ఉపయోగిస్తున్న యంత్రాలు, భారీ వాహనాలను మాత్రం సీజ్ చేయటం లేదు. ఈ విషయమై మంథని ఆర్డీఓ శ్రీనివాసరెడ్డిని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. స్థానికంగా తహశీల్దార్ లేడని, ఆర్ఐ, వీఆర్వోలను పంపి పనులను నిలిపివేస్తామని అన్నారు. కలెక్టర్ స్పందించి గోదావరి నదిలో అక్రమంగా నిర్మిస్తున్న రోడ్డు వ్యవహారంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి అవసరముంది. -
మళ్లీ కూర‘గాయాలు’..
- నానాటికీ పెరిగిపోతున్న కూరగాయల ధరలు - ఉత్పత్తి తగ్గడమే ప్రధాన కారణమంటున్న అధికారులు - దీపావళి సమయానికి మరింత మండిపోయే అవకాశం - ఇబ్బందులు పడుతున్న స్థానికులు సాక్షి, ముంబై: కూరగాయల ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి కూరగాయల లోడుతో వస్తున్న ట్రక్కులు, టెంపోల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. ఫలితంగా సరుకు కొరత ఏర్పడి ధరలు మండిపోవడం మొదలుపెట్టాయి. ఏపీఎంసీకి యేటా సెప్టెంబర్‌లో దాదాపు 700 వరకు ట్రక్కులు, టెంపోలు కూరగాయల లోడ్లు వస్తాయి. కాని ఈ ఏడాది సెప్టెంబర్‌లో 350-400 లోపు వస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు జూన్, జూలై ఆఖరు వరకు కురవలేదు. దీంతో కూరగాయల పంటల దిగుబడి తగ్గిపోయింది. ఆ తర్వాత ఆగస్టులో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని ఏపీఎంసీ డెరైక్టర్ శంకర్ పింగలే చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 60 శాతం మాత్రమే కూరగాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. వాటి నాణ్యత కూడా సాధారణ స్థాయిలో ఉందని వ్యాపారులు అంటున్నారు. మంచి నాణ్యత ఉన్న కూరగాయలు రావడంలేదని, గత్యంతరం లేక నాణ్యత లోపించిన కూరగాయలనే విక్రయించాల్సి వస్తోందని వ్యాపారులు అంటున్నారు. సరుకు కొరత కారణంగా కూరగాయల ధరలు 25-30 శాతం పెరిగాయి. దీపావళి తర్వాత కొత్త పంటలు చేతికొస్తాయని, ఆ తరువాత కూరగాయల ధరలు వాటంతట అవే దిగివస్తాయని కొందరు హోల్ సెల్ వ్యాపారులు అంటున్నారు. త్వరలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సమయంలో అనేక మంది భక్తి శ్రద్ధలతో ఉపవాసాలుంటారు. దీంతో మాంసం, చేపలకంటే కూరగాయలకే మరింత డిమాండ్ పెరుగుతుంది. దీన్ని అదనుగా చేసుకుని చిల్లర వ్యాపారులు ధరలు పెంచేసి జేబులు నింపుకునే ప్రయత్నాలు చేస్తారు. కూరగాయల నిల్వలు ఉన్నప్పటికీ కావాలనే కృత్రిమ కొరత సృష్టించి కొందరు వ్యాపారులు అందినంత దండుకునేందుకు యత్నిస్తారు. చౌకధరల కూరగాయల కేంద్రాలు మాయం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన చౌక ధరల కూరగాయల కేంద్రాలు ముంబై, ఠాణే, నవీముంబైలో కనిపించడం లేదు. ఆకస్మాత్తుగా అవి మాయం కావడంతో పేదలు ఇబ్బందుల్లో పడిపోయారు. గత ఏడాదివర్షాలు లేక కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో అందరికి అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం ముంబై, ఠాణే, నవీముంబైలో అక్కడక్కడ 125 చౌక ధరల కూరగాయల కేంద్రాలు ప్రారంభించింది. ఈ మధ్యకాలంలో కూరగాయల దిగుబడి పెరిగి పరిస్థితులు ధరలు సాధారణ స్థితికి వచ్చాయి. దీంతో ఈ కేంద్రాలకు ఆదరణ కరువైంది. కాలక్రమేణా అవి మూతపడిపోయాయి. -
వాల్‌మార్ట్... ట్రాన్స్ఫార్మర్స్
వాషింగ్టన్: ట్రాన్స్ఫార్మర్స్ సినిమా చూశారా! అందులో అత్యాధునిక కార్లు, ట్రక్కులు సూపర్‌ఫాస్ట్‌గా పరుగులు తీస్తూ.. అంతలోనే భారీ రోబోలుగా మారిపోతుంటాయి. ఈ రోబోల భాగాన్ని పక్కన పెడితే అచ్చం ఆ తరహాలో భారీ ట్రక్కులను తయారు చేయించుకుంటోంది అమెరికన్ రిటైలింగ్ దిగ్గజం వాల్‌మార్ట్. అమెరికాలో 4,700 పైచిలుకు ఉన్న తమ స్టోర్స్‌కి సరుకులను చేరవేసేందుకు వీటిని వినియోగించనుంది. పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో పీటర్‌బిల్ట్ అనే సంస్థ వీటిని తయారు చేస్తోంది. ప్రస్తుతం వాల్‌మార్ట్ ఉపయోగించే ట్రక్‌లతో పోలిస్తే ఇవి 4,000 పౌండ్ల మేర తేలికగా ఉంటాయి. స్లైడింగ్ డోర్లు, స్పేస్‌షిప్‌లో కెప్టెన్ చెయిర్ తరహా డ్రైవరు సీటు, వాహనానికి అన్ని వైపులా ఏం జరుగుతోందన్నది తెలుసుకోవడానికి డాష్‌బోర్డ్‌కి రెండు వైపులా మానిటర్లు .. ఒకటేమిటీ అనేక హంగులు ఈ ట్రక్‌లో ఉంటాయి. ఈ ట్రక్‌లలో ఏకంగా 18 చక్రాలు ఉంటాయి. ఇలాంటి భారీ ట్రక్కులు ఒకదాని వెనుక మరొకటి నిర్దిష్ట దూరంలో వెడుతుంటే రోడ్డు మీద ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. ఏకకాలంలో ముందుకు దూసుకెడుతూ, ఒకేసారి బ్రేకులు వేస్తూ ప్లాటూనింగ్ విధానంలో ఈ వాహనాలు ప్రయాణించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీని వల్ల ఇంధన ఖర్చులు గణనీయంగా తగ్గడం, రోడ్డుపై రద్దీ తగ్గడం.. భద్రత పెరగడం, సరైన సమయానికి డెలివరీ చేయగలగడంతో వంటి అనేక సానుకూల అంశాలు ఉన్నాయంటున్నారు రూపకర్తలు. మనుషుల ప్రమేయం లేకుండా పరస్పరం సమన్వయపర్చుకునేలా వీటిని తీర్చిదిద్దడంపై దృష్టి సారిస్తున్నారు. దీంతో అసలు డ్రైవర్ల అవసరమే లేకుండా పోతుంది. ఇప్పటికే ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్స్‌ను ఉపయోగిస్తున్న పీటర్‌బిల్ట్ సంస్థ.. డ్రైవర్ల పనిని మరింత సులువు చేసే టెక్నాలజీలను రూపొందించే పనిలో ఉంది. ఆన్లైన్ రిటైలింగ్ దిగ్గజం అమెజాన్ ఇప్పటికే కస్టమర్లకు ఆర్డర్లను వేగంగా చేరవేసేందుకు డ్రోన్లను ఉపయోగిస్తోన్న సంగతి తెలిసిందే. -
ఐషర్ 5 టన్నులలోపు వాహనాలు వస్తున్నాయ్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన దిగ్గజాలు వోల్వో గ్రూప్, ఐషర్ మోటార్స్‌ల అనుబంధ కంపెనీ వీఈ కమర్షియల్ వెహికిల్స్(వీఈసీవీ) సరికొత్త సంచలనాలకు రెడీ అవుతోంది. ఐషర్ బ్రాండ్‌లో తేలికపాటి రవాణా వాహనాలను పరిచయం చేయాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం వీఈ కమర్షియల్ బస్‌లతోపాటు 5 నుంచి 49 టన్నుల సామర్థ్యం గల హాలేజ్, టిప్పర్, ఆర్టిక్యులేటెడ్ ట్రాక్టర్లను భారత్‌తోపాటు విదేశాల్లో విక్రయిస్తోంది. 5 టన్నుల లోపుండే తేలికపాటి వాహనాల విభాగంలోకి ప్రవేశిస్తామని వీఈసీవీ సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ మాలర్ సోమవారం తెలిపారు. ఐషర్ ప్రో సిరీస్ ట్రక్‌లను ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో ప్రత్యేకంగా మాట్లాడారు. మూడేళ్లలో కొత్త విభాగంలోకి.. 5-49 టన్నుల విభాగంలో ఐషర్ తన బ్రాండ్ హవా కొనసాగిస్తోందని శ్యామ్ మాలర్ చెప్పారు. అన్ని రకాల రవాణా వాహనాలను తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఈ నేపథ్యంలో 5 టన్నుల లోపు విభాగంలోని ప్రవేశించేందుకు కసరత్తు ప్రారంభించామని పేర్కొన్నారు. తేలికపాటి రవాణా వాహనాలకు(ఎల్సీవీ) భారత్‌లో విపరీత డిమాండ్ ఉందని తెలిపారు. వాహనాల అభివృద్ధి, ఉత్పత్తికి మూడేళ్ల సమయం పడుతుందని వివరించారు. పాతవాటి స్థానంలో.. ఐషర్ బ్రాండ్‌లో ఇప్పటి వరకు విక్రయిస్తున్న మోడళ్ల స్థానంలో ‘ప్రో’ పేరుతో కొత్తవాటిని పరిచయం చేస్తోంది. ఈ ఏడాది 40 వేరియంట్ల దాకా రానున్నాయి. ప్రస్తుతం ఐషర్ ప్రో 1000లో 5-14 టన్నుల్లో లైట్, మీడియం డ్యూటీ, ప్రో 3000 సిరీస్‌లో 9-14 టన్నుల సామర్థ్యం గల మీడియం డ్యూటీ వాహనాలను తయారు చేస్తున్నారు. ప్రో 6000లో 16-40 టన్నులు, ప్రో 8000లో 25-49 టన్నుల హెవీడ్యూటీ ట్రక్కులు కొద్ది రోజుల్లో మార్కెట్లోకి రానున్నాయి. స్కైలైన్ ప్రో బస్‌లు కూడా భారతీయ రోడ్లెక్కనున్నాయి. మెరుగైన పనితీరు కనబరిచేలా వీటిని తీర్చిదిద్దుతున్నట్టు కంపెనీ తెలిపింది. మార్కెట్ వాటా 15 శాతం.. భారత వాణిజ్య రవాణా వాహనాల రంగం 27 నెలలుగా తిరోగమనంలో ఉందని శ్యామ్ మాలర్ తెలిపారు. ఎన్నికల తర్వాత మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గోవాతోపాటు ఉత్తర కర్నాటక, ఒరిస్సాలో మైనింగ్ అనుమతులతో కొంతైనా మార్పు వస్తుందన్నారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్య, ఇండోనేషియా మార్కెట్లలో అవకాశాలను అందిపుచ్చుకుంటామని వివరించారు. 2013లో అన్ని విభాగాల్లో కలిపి 44 వేల ఐషర్ వాహనాలు అమ్ముడయ్యాయి. మార్కెట్ వాటా 13.8 శాతం ఉంది. 2014లో ఇది 15 శాతానికి చేరొచ్చని పేర్కొన్నారు. గతేడాది 2 వేల ఐషర్ వాహనాలను ఆంధ్రప్రదేశ్‌లో విక్రయించామని తల్వార్ గ్రూప్ ఎండీ సునీల్ తల్వార్ తెలిపారు. అమ్మకాల పరంగా భారత్‌లో టాప్-1 డీలర్‌గా కొనసాగుతున్నామని అన్నారు. -
అశోక్ లేలాండ్.. కెప్టెన్ ట్రక్లు
న్యూఢిల్లీ: అశోక్ లేలాండ్ కంపెనీ ఈ ఏడాది 18 రకాలైన ట్రక్‌లను మార్కెట్లోకి తేవాలని యోచిస్తోంది. ఈ వాణిజ్య వాహనాలను కొత్త బ్రాండ్ కెప్టెన్ కింద అందించనున్నామని అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ కె. దాసరి పేర్కొన్నారు. ఈ కంపెనీ టిప్పర్ మోడల్, కెప్టెన్ 2523ను సోమవారం మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో కెప్టెన్ బ్రాండ్ వాహనాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా పాల్గొన్నారు. కెప్టెన్ 2523 టిప్పర్ ధర రూ. 24 లక్షలకు మించి ఉంటుందని దాసరి వివరించారు. ఇక చిన్న ట్రక్ల ధరలను ఈ కంపెనీ రూ.30,000 వరకూ పెంచుతోంది. కెప్టెన్ రేంజ్ వాహనాల అభివృద్ధికి రూ.600-700 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టామని దాసరి పేర్కొన్నారు. ఈ కెప్టెన్ వాహనాలు 16-49 టన్నుల రేంజ్లో టిప్పర్లు, ట్రాక్టర్లు, హాలేజ్ వాహనాలుగా లభ్యమవుతాయని వివరించారు. వీటిని పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, అగ్నేయాసియా దేశాలకు ఎగుమతి చేయనున్నామన్నారు. సాధారణంగా ప్రతీ ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో అమ్మకాలు పుంజుకుంటాయని, అదే విధంగా ఈ ఏడాది కూడా అమ్మకాలు పుంజుకోగలవని ఆశిస్తున్నామని దాసరి చెప్పారు. -
మృత్యువుతో పోరాడి..ఓడి
సంతమాగులూరు, న్యూస్‌లైన్: రెండు లారీలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిలో ఏల్చూరు సమీపాన ఆదివారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో చోటుచేసుకుంది. హర్యానాకు చెందిన లారీ చెన్నై నుంచి ఢిల్లీకి టైర్ల లోడుతో వెళుతుంది. ఏల్చూరు సమీపంలోకి రాగానే కృష్ణా జిల్లా కోదాడకు చెందిన బొగ్గు లోడుతో లారీ రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో హర్యానాకు చెందిన లారీ డ్రైవర్ అబీర్ క్యాబిన్ రేకుల మధ్య చిక్కుకుపోయాడు. కోదాడకు చెందిన మరో లారీ డ్రైవర్ ఐలయ్య తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఏ శివనాగరాజు, సిబ్బంది తిరుపాల్‌రెడ్డి, హరి సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్యాబిన్లో ఇరుక్కున డ్రైవర్‌ను బయటికి తీసేందుకు ఆ మార్గంలో వచ్చిన ప్రయాణికుల సాయంతో రెండు గంటలపాటు య్రత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో పుట్టవారిపాలెం నుంచి జేసీబీని తెప్పించి ఉదయం ఐదు గంటలకు డ్రైవర్‌ను బయటికి తీశారు. క్షతగాత్రులను 108లో నరసరావుపేట తరలిస్తుండగా మార్గమధ్యంలో అబీర్ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై శివనాగరాజు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.