కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అమెరికాలో జరిగిన వరుస ప్రమాదాలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. న్యూ ఆర్లీన్స్‌లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ట్రక్కు దాడి.. లాస్ వెగాస్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. కాబోయే అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump)కు చెందిన హోటల్ వద్ద టెస్లా కారులో పేలుడు సంభవించింది. ఈ రెండు ఘటనల్లో పలువురు మృతి చెందారు.
లాస్ వెగాస్‌లోని టెస్లా సైబర్‌ట్రక్ పేలుడు.. న్యూ ఓర్లీన్స్ ట్రక్ దాడికి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు ప్రమాదాలు ఒకే రోజు సంభవించాయి. అంతే కాకుండా ఈ రెండు వాహనాలను 'టూరో' (Turo) నుంచి అద్దెకు తీసుకున్నారు.
న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన సంఘటన తర్వాత, అనుమానితుడు 'షంసుద్ దిన్ జబ్బార్' కారును ఎలా స్వాధీనం చేసుకున్నాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఎఫ్‌బీఐ తెలిపింది. దాడి చేసిన ఈవీ పికప్ ట్రక్కులో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ జెండా కనిపించిందని ఎఫ్‌బీఐ వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే.. అనుమానితునికి ఐఎస్ఐఎస్ మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు పుడుతున్నాయి.
లాస్ వెగాస్‌లోని ట్రంప్ హోటల్ వెలుపల టెస్లా సైబర్‌ట్రక్ పేలుడులో అనుమానితుడుగా 37 ఏళ్ల 'మాథ్యూ లైవెల్స్‌బెర్గర్'గా గుర్తించినట్లు యుఎస్ మీడియా నివేదికలు తెలిపాయి. అధికారులు ఈ సంఘటనను ఉగ్రవాద దాడిగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. షంసుద్ దిన్ జబ్బార్ 2010 వరకు ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేసిన ఆర్మీ వ్యక్తి. మాథ్యూ లైవెల్స్‌బెర్గర్ కూడా యుఎస్ ఆర్మీ వెటరన్. అంటే వీరిరువురూ.. ఆర్మీలో పనిచేసినవారే. ఆర్మీలో పనిచేసిన వారు ఈ దాడులకు పాల్పడ్డారా? దీని వెనుక ఉన్న కారణం ఏమిటనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
టూరో కంపెనీ గురించి
టూరో అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కార్ రెంటల్ యాప్. దీనిని శాన్ ఫ్రాన్సిస్కోలో 2010లో స్థాపించారు. 2010లో రిలే రైడ్స్‌గా ప్రారంభమై.. 2015లో టురోగా మారింది. ఇది వినియోగదారులు కలవకుండానే వారికి నేరుగా కార్లను అద్దెకు తీసుకునేందుకు అనుమతిస్తుంది.
ఎలా అంటే.. వినియోగదారులు తమ లొకేషన్‌ను ఎంటర్ చేసిన తర్వాత సమీపంలో అందుబాటులో ఉన్న అద్దె కార్లను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. టయోట, పోర్షెస్, టెస్లాస్‌తో సహా అనేక రకాల కార్లు టూరోలో అద్దెకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కారును అద్దెకు తీసుకోవాలంటే.. 18 సంవత్సరాలు నిండి, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. కాబట్టి కార్లను బుక్ చేసుకున్న వారిగురించి తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment