పదేళ్ళు దాటితే..
రాయపూర్ః దేశంలో పొల్యూషన్ పై పోరాటం ప్రారంభమైంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పద్ధతులతో కాలుష్యాన్ని నివారించేందుకు అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అందులోభాగంగా తాజాగా పదేళ్ళు దాటిన ట్రక్కులు, బస్సులు, ఆటోలను బ్యాన్ చేసేందుకు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ సంవత్సరం పాటు గడువు ఇస్తున్నామని, ఆలోపు కొత్త వాహనం కొనే ప్రయత్నం చేసుకోవాలని వాహన యజమానులకు రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అంతేకాక 'ఈ' రిక్షాలను కొనేవారికి ప్రత్యేక ఆర్థిక సాయం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన అమల్లోకి తెస్తోంది. పన్నెండేళ్ళు దాటిన బస్సులు, పదేళ్ళు దాటిన ట్రక్కులు, ఆటో రిక్షాలు వంటి కమర్షియల్ వాహనాలు రోడ్లపై తిరగకుండా నిలిపివేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గాలిలో కాలుష్యాన్ని తగ్గించి, వాతావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ముందడుగు వేయాలని ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్.. సీనియర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఛత్తీస్ ఘడ్ ఎన్విరాన్మెంట్ కంజర్వేషన్ బోర్డ్ ఛైర్ పర్సన్ అమన్ కుమార్ సింగ్ తెలిపారు. ఇప్పటినుంచీ పదేళ్ళు దాటిన ట్రక్కులు, ఆటోలు, పన్నెండేళ్ళు దాటిన బస్సులకు అనుమతులు ఇవ్వొద్దని, వాహన యజమానులు కొత్త వాహనాలు కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఓ సంవత్సరం పాటు గడువు ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన ఎనిమిదేళ్ళు దాటిన పాత వాహనాలకు రిజిస్ట్రేషన్లు కూడ చేయొద్దని ఆదేశించినట్లు తెలిపారు. 'ఈ' రిక్షాలను ప్రోత్సహించేందుకు గాను ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు.
వాతావరణ పరిరక్షణలో భాగంగా మరో నిర్ణయం తీసుకున్నామని, ఆన్ లైన్ మానిటరింగ్ తో పారిశ్రామిక కాలుష్య పరిమాణాన్ని అంచనా వేస్తామని సీఎం రమణ్ సింగ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నెల్లో రెండుసార్లు పరిశ్రమల యాజమాన్యాలు ప్రవర్తిస్తే ఆయా యూనిట్లను మూసివేయిస్తామన్నారు. రాష్ట్ర రాజధాని రాయపూర్ లో పొల్యూషన్ తగ్గించేందుకు ఓ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. గత నెల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ హెచ్ వో) వెల్లడించిన నివేదికల ప్రకారం అత్యధిక కాలుష్యంగల నగరాల్లో రాయపూర్ ఏడో స్థానంలో ఉందని, ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో రాయపూర్ లో వచ్చే రెండేళ్ళలో కాలుష్యం నివారించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా రాయపూర్ లోని రైల్వే ట్రాక్ ప్రాంతాల్లో నివసించే వారికి ప్రధానమంత్రి ఉజ్వల్ పథకం ద్వారా డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు అందిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక సర్వే చేపడుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. అలాగే రాజధానిలో ఈ సంవత్సరం సుమారు 30 లక్షల వరకూ మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, గృహాల్లోని వ్యర్థాలకోసం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు సైతం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.