ఇది ఇసుక బాట..!
మహదేవపూర్ : ఈ చిత్రంలో మీరు చూస్తున్నది గోదావరి నదిలో నిర్మిస్తున్న రోడ్డు. ఇది ప్రభుత్వం ప్రజా రవాణా కోసం వేస్తున్న రోడ్డు కాదు. కొందరు అక్రమార్కులు ఇసుక రవాణా కోసం నిర్మిస్తున్న రహదారి. మహదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామ శివారులోని నదిలో ఒడ్డు నుంచి నీటి ప్రవాహం వరకు లారీల రాకపోకల కోసం వేస్తున్న బాట ఇది. ఇంత జబర్దస్తీగా రోడ్డు వేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని మాత్రం అడగొద్దు సుమా! ఎందుకంటే అధికారుల తీరు షరా‘మామూలే’నన్న సంగతి జరగమెరిగన సత్యమే కదా!!
విశ్వసనీయ సమాచారం మేరకు.. పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రీచ్‌లకు టెండర్లు నిర్వహించింది. అటువైపు ఇసుక రీచ్‌లను టెండర్లలో పొందిన కొందరు ఆ ఇసుకను తెలంగాణకు తరలించేందుకు ఏకంగా గోదావరినదిలోనే సుమారు మూడు కిలోమీటర్ల వరకు మట్టితో భారీ రోడ్డు నిర్మాణానికి పూనుకున్నారు. గోదావరి తీరంలో ఇప్పటికే వరంగల్ జిల్లా భూపాల్‌పల్లి సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌లున్నాయి. ఈ రీచ్‌లను సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వం వద్ద కొన్ని సంవత్సరాలకు లీజ్‌కు తీసుకుంది.
సదరు రీచ్‌ల పరిధిలో ఇతరులెవరూ రోడ్డు నిర్మించడానికి వీల్లేదు. కానీ సింగరేణి సంస్థకు ఇసుకను తరలించే కాంట్రాక్టర్‌తో మహారాష్ట్రలో ఇసుక రీచ్‌లు పొందిన కాంట్రాక్టరు మిలాఖత్ అయి అదే రోడ్డుతో పాటు మరికొంత రెవెన్యూ స్థలంలో రోడ్డు వేసి ఇసుకను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గోదావరిలోని ఇసుకతో పాటు నదిలోనీటి ప్రవాహంలో కూడా భారీగా మట్టిరోడ్డును వేస్తున్నారు.
ఇసుకను ప్రొక్లయిన్‌తో తీయించి పొరకను వేసి దానిపై మట్టితో రోడ్డు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి ఇసుకలో రోడ్డు వేసేందుకు మట్టిని అక్రమంగా భారీ టిప్పర్లు, ప్రొక్లెన్‌లతో తరలిస్తున్నారు. ఈ వ్యవహారమంతా అక్రమంగా సాగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఈ రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకోవటానికి మీనమేషాలు లెక్కపెడుతున్నారు.
స్పందించని అధికారులు
ఈ విషయాన్ని కొందరు యువకులు స్థానికంగా ఉండే రెవెన్యూ సిబ్బంది దృష్టికి తీసుకుని పోయారు. వారు చుట్టపు చూపుగా వెళ్లి పనులను నిలిపివేస్తున్నట్టు నటిస్తున్నారు. కానీ గోదావరి నదిలో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేసేందుకు ఉపయోగిస్తున్న యంత్రాలు, భారీ వాహనాలను మాత్రం సీజ్ చేయటం లేదు. ఈ విషయమై మంథని ఆర్డీఓ శ్రీనివాసరెడ్డిని ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా.. స్థానికంగా తహశీల్దార్ లేడని, ఆర్‌ఐ, వీఆర్వోలను పంపి పనులను నిలిపివేస్తామని అన్నారు. కలెక్టర్ స్పందించి గోదావరి నదిలో అక్రమంగా నిర్మిస్తున్న రోడ్డు వ్యవహారంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి అవసరముంది.