- అమలు కాని ప్రభుత్వ నిర్ణయం
- కానరాని రవాణా
- ఇబ్బంది పడుతున్న ప్రజలు
- డీఆర్‌డీఏకు కొత్త తలనొప్పులు
వెంకోజీపాలెం : ఇసుక విక్రయ బాధ్యతలు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. మీసేవ కేంద్రాలలో సొమ్ము చెలిస్తే ఇంటికే ఇసుక పంపిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ఆర్భాటమేనని తేలిపోయింది. ఇసుక రవాణా బాధ్యత ఎవరిదన్నది శేష ప్రశ్నగానే మిగిలిపోతోంది. లారీలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం సొమ్ము ఇస్తుందన్న గ్యారంటీ లేకపోవడంతో ఏమిచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.
జిల్లాలో ఇసుక రీచ్‌లను పొదుపు సంఘాలకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చీడికాడ మండలం కోనాం, వి.మాడుగుల మండలం సాగరం, మాకవరపాలెంలోని జి.కోడూరు, యలమంచిలిలోని ఏటికొప్పాక, కోటవురట్లలోని పందూరు ప్రాంతాలలో ఐదు రీచ్ నుంచి కొద్దినెలలుగా ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. మొదట్లో ప్రభుత్వ పనుల కోసమే ఇసుక విక్రయించారు. ప్రజలు, బిల్డర్ల అవసరాల దృష్ట్యా కొన్నాళ్లుగా అందరికీ ఇసుక విక్రయిస్తున్నారు. క్యూబిక్ మీటర్‌కు రూ.500 వంతున మీసేవ కేంద్రాలలో రుసుం వసూలు చేస్తున్నారు.
సర్వీస్ చార్జీల కింద మరో రూ.25 చెల్లించాల్సి ఉంది. చిక్కంతా ఇసుక రవాణా వద్దే ఎదురవుతోంది. సొమ్ము కట్టినవారంతా తమ ఇంటికి ఇసుకను ఎప్పుడు పంపుతారని ప్రశ్నిస్తుండడంతో మీసేవ నిర్వాహకులు, డీఆర్‌డీఏ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే మీసేవ అధికారులు డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ వి.సత్యసాయి శ్రీనివాస్‌తో చర్చించారు. ప్రస్తుతం ఇసుక రవాణా విషయమై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు.
ఒక ట్రాక్టర్‌లో 3 క్యూబిక్ మీటర్లు, క్వారీ లారీలో 9 క్యూబిక్‌మీటర్ల ఇసుక రవాణా చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు 3 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయాలతో పొదుపు సంఘాలకు రూ.10 లక్షల వరకు ఆదాయం సమకూరింది. ప్రస్తుతం సాగరంలో 110, కోడూరులో 16,250, ఏటికొప్పాకలో 7920, పందూరులో 4320 క్యూబిక్ మీటర్ల వంతన ఇసుక అందుబాటులో ఉంది.
మూడేళ్లుగా విశాఖ నగరం, జిల్లాలో నిర్మాణ అవసరాలకు ఇసుకను శ్రీకాకుళం లేదా రాజమండ్రి నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దూరం ఎక్కువ కావడంతో రవాణా చార్జీలు తడిసిమోపెడవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇసుక అందుబాటులోకి వచ్చినా రవాణా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇసుక వున్నా దొరకని దుస్థితి నెలకొంది.
కొంతమంది శ్రీకాకుళం, రాజమండ్రిలలో ఇసుక కోసం సొమ్ము చెల్లించడానికి మీసేవా కేంద్రాలకు వెళితే అక్కడ చుక్కెదురవుతోంది. జిల్లాలోని ఇసుక రవాణాకే దిక్కులేని పరిస్థితుల్లో అంతదూరం నుంచి ఇసుక ఎవరు తెస్తారన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతోంది.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం
జిల్లాలో ఇసుక లభిస్తోంది. కానీ రవాణా సమస్య ఆటంకంగా ఉంది. ప్రస్తుతం ఇసుక రవాణాకు డీఆర్‌డీఏ వద్ద ఏర్పాట్లు లేవు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. ఆయన సూచనల మేరకు నడుచుకుంటాం.
- వి.సత్యసాయి శ్రీనివాస్, ప్రాజెక్ట్ డెరైక్టర్, డీఆర్‌డీఏ, విశాఖపట్నం