కరీంనగర్ టు హైదరాబాద్...!
- కొత్తపల్లి వాగు నుంచి ఇసుక రవాణా
- సీసీ కెమెరాలు లేకుండా తవ్వకాలు
- యథేచ్ఛగా యంత్రాల వినియోగం
- టీఎస్‌ఎండీసీ ముసుగులో అక్రమ దందా
- రోజుకు 500లకు పైగా లారీల్లో రవాణా
- ఓవర్‌లోడ్‌ను పట్టించుకోని అధికారులు
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట– కొత్తపల్లి శివారు వాగు నుంచి ఇసుక అక్రమమార్గం పడుతోంది. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) నిబంధనలకు వక్రభాష్యం చెబుతూ డంపింగ్ యార్డులు లేకుండా ఏకంగా కొత్తపల్లి వాగులోనే యంత్రాలు పెట్టి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఇసుక తవ్వకాలు జరుపుతున్న ప్రదేశం సీసీ కెమెరాల నిఘాలో ఉండాల్సి ఉండగా, ఆ నిబంధనలను పట్టించుకోవడం లేదు. టీఎస్‌ఎండీసీ, కాంట్రాక్టర్లు కుమ్ముక్కై లారీల్లో పరిమితులను మించి ఇసుక నింపుతూ అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక తవ్వకాలు జరపాల్సి ఉండగా.. పొద్దంతా కొత్తపల్లి సమీపంలోని రామంచకు తరలించి అక్కడి నుంచి అర్ధరాత్రి వరకు కూడా రవాణా సాగిస్తున్నారు. ఇలా రోజుకు 400 నుంచి 500 లారీల్లో కరీంనగర్ నుంచి హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్‌లకు ఇసుక అక్రమమార్గం పడుతోంది.
ప్రభుత్వ ఖజానాకు రూ.లక్షల్లో గండి....
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి శివారు మానేరువాగు నుంచి ఏప్రిల్ 11 నుంచి ఇసుక తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇసుక రీచ్‌ను రేణికుంట బ్రిడ్జికి 500 మీటర్ల దూరంలో తవ్వాలి. వాగులో ఉన్న మొత్తం ఇసుకలో కేవలం 30 శాతం మాత్రమే తొలగించాలి. ఇసుక తవ్వకాలు, రవాణా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యనే సీసీ కెమెరాల నిఘాలో చేయాలి. ఇసుక తవ్వకాల సమయంలో సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి కాగా, రాత్రిపూట ఇసుక రవాణా నేరం. ప్రతీ ఆదివారం ఇసుకు రీచ్‌కు సెలవు. అయితే, టీఎస్‌ఎండీసీ, కాంట్రాక్టర్లు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఇసుక తవ్వకాలు, రవాణాను నిరంతరం పర్యవేక్షించాల్సిన రెవెన్యూ, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎడాపెడా ఇష్టారాజ్యంగా వాగులో తవ్వకాలు జరుపుతుండటంతో సమీప గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే ఇన్‌టెక్‌వెల్ పైపులైను బయటపడగా, భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదంతా జరుగుతున్నా టీఎస్‌ఎండీసీ, ఇతర శాఖలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి.
ఇష్టారాజ్యంగా ఇసుక రవాణా..
కొత్తపల్లి క్వారీ నుంచి తీసే ఇసుక క్యూబిక్ మీటర్‌కు రూ.550లుగా ప్రభు త్వం ధర నిర్ణయించింది. ఈ మేరకు ‘మీ సేవ’కేంద్రాల్లో అవసరమున్న మేరకు డబ్బులు చెల్లించిన వారికి కొత్తపల్లి వాగు నుంచి కాంట్రాక్టర్లు ఇసుక సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం వాగు సమీపంలో ఇసుక నిల్వచేసేందుకు డంపింగ్ యార్డు కోసం ప్రభుత్వం స్థలం కేటాయించింది. ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు ఇసుకను చేర్చి అక్కడ జేసీబీ యంత్రాలతో లారీలలో నింపాల్సి ఉంది. ఇదేమీ పట్టిం చుకోని టీఎస్‌ఎండీసీ, కాంట్రాక్టర్లు ఏకం గా వాగులోనే యంత్రాలు పెట్టి లారీలు నింపుతున్నారు. ఇదిలా వుండగా నిబంధ నల ప్రకారం 10 టైర్ల లారీలో 10.5 క్యూబి క్ మీటర్ల (15.75 టన్నులు) ఇసుక నింపాలి.
అలాగే 12 టైర్ల లారీలో 13.5 (18.75 టన్నులు) క్యూబిక్ మీటర్లు, 14 టైర్ల లారీలో 17 క్యూబిక్ మీటర్లు (25.5 టన్ను లు)నింపాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్లు, టీఎస్‌ఎండీసీ అధికారులు, లారీల యజ మానులు కుమ్ముక్కై ఒక్కో లారీలో ఒకటి నుంచి రెండున్నర క్యూబిక్ మీటర్ల వరకు అధికంగా నింపుతూ రోజుకు లక్షలాది రూపాయల అక్రమార్జకు పాల్పడుతున్నా రు. ఓవర్‌లోడ్‌తో వాగు నుంచే వెళ్లే లారీల ను నియంత్రించాల్సిన రవాణా, పోలీసుశా ఖల అధికారులు చోద్యం చూస్తుండగా, రోజుకు రూ.లక్షల్లో ప్రభుత్వాదాయానికి గండి పడుతోంది.