రాయచూరు : ఇన్నాళ్లు వంకల్లో, నదుల్లో ఇసుకను కొల్లగొట్టిన అక్రమ రవాణాదారులు ఇప్పుడు అధికారులు స్వాధీనం చేసుకున్న ఇసుక నిల్వలపై కన్నేశారు. గస్తీ దళాల కన్నుగప్పి ఆ ఇసుక నిల్వలను దొంగచాటుగా తరలిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాలు..జిల్లాలో ఇసుక రవాణాపై దాడులు ముమ్మరం చేసిన అధికారులు ఇప్పటివరకు రూ.5 కోట్ల విలువైన సుమారు 72 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను స్వాధీనం చేసుకొని పలు ప్రాంతాలలో నిల్వ చేశారు. అక్రమార్కులపై సీఆర్‌పీ2 చట్టంకింద జిల్లాలోని వివిధ కోర్టులలో 159 కేసులు దాఖలు చేశారు. స్వాధీనం చేసుకున్న అక్రమ ఇసుకను ప్రజా పనుల శాఖ పర్యవేక్షణకు వదిలేశారు. ఆ నిల్వలకు పోలీసులు, హోంగార్డులు పహార కాస్తున్నారు.
కోర్టులు తీర్పు ఇచ్చిన తర్వాతనే ఈ ఇసుకను విక్రయించాలి. దీనిని క్యూబిక్ మీటర్ రూ. 630 చొప్పున అమ్మితే ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.7 కోట్ల ఆదాయం చేకూరనుంది. అయితే కేసుల తెగని నేపథ్యంలో నిల్వ పర్యవేక్షణ పెద్ద సమస్యగా మారిందని చెబుతున్నారు. దేవదుర్గ తాలూకా గూగల్, గోపాలపుర, అంజుళ, రాయచూరు, మాన్వి తాలూకాలలో నిల్వ చేయగా, వీటిపై కన్నేసిన కొందరు ఆ నిలువలు తరిగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాతున్నాయి.
దొంగచాటున తరలిస్తున్నారు
దేవదుర్గ తాలూకాలో 47 స్థలాలలో నిలువచేసిన 47381 క్యూబిక్ మీటర్ల అక్రమ ఇసుకను పంపిణీ చేయకపోవడంతో కొందరు దొంగచాటున తరలిస్తున్నారు. ఇందులో ప్రముఖుల హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నా దర్యాఫ్తులో ఏమీ తేల్చలేకపోయారు. ఎవరిని అరెస్టు చేయలేదు. చిన్నచితక రైతులను మాత్రం అక్రమ ఇసుక నిలువచేసిన ఆరోపణలపై కేసులు పెట్టారు. -భీమరాయ, జనసంగ్రామ పరిషత్
నిల్వలు తరగడం లేదు
నిల్వ ఉన్న ఇసుకను కొందరు తరలిస్తున్నారన్న ఆరోపణలను రాయచూరు ఇంచార్జి అదనపు జిల్లాధికారి, అసిస్టెంట్ కమిసనర్ మారుతి దృష్టికి తీసుకెళ్లగా స్వాధీనం చేసుకున్న అక్రమ ఇసుకను ఒక్కరేణువు కూడా విడిచిపెట్టమన్నారు. నిల్వలు తరగుతున్నాయన్న ఆరోపణలపై దర్యాఫ్తు పీడబ్ల్యూడీ అధికారులతో దర్యాప్తు చేయించామని, లాంటిదేవి లేదని తేలిందన్నారు. కోర్టు అనుమతి మేర ఈ ఇసుకను పంపిణీ చేస్తామన్నారు. ఇదే విషయంపై జిల్లా ఎస్పీ నాగరాజు మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాలో ప్రముఖుల హస్తంపై ఆధారాలు లభ్యం కాలేదన్నారు. అయితే కొందరిపై సీఆర్‌పీ2 చట్టప్రకారం నమోదు చేసిన కేసులపై కోర్టులలో విచారణ జరుగుతోందన్నారు.
ఇసుకాసురులు
Published Mon, Sep 29 2014 3:21 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement