ఇసుక దుమారం
* పోలీసులు వర్సెస్ రైతులు
* సోమేశ్వర్‌బండలో ఉద్రిక్తత
మక్తల్: ఇసుక తరలింపు వ్యవహారంలో పోలీసులు, రైతులు ఒకరిపై మరొకరు దాడులు, ప్రతిదాడులు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం సోమేశ్వర్‌బండలో శనివారం రాత్రి జరిగింది. ఓ ఇసుక కాంట్రాక్టర్ లారీలు, జేసీబీల సహాయంతో సోమేశ్వర్‌బండ వాగు సమీపంలో నిలిపి ఇసుకను వాగులోంచి ఒడ్డుపైకి డంప్‌చేశారు. దీంతో రైతులు అక్కడికి చేరుకుని ఇసుక తరలిస్తే తమబోర్లు ఎండిపోయి పంటలు పండవని, తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని ఆందోళనకు దిగారు.
అయితే లారీ, జేసీబీ డ్రైవర్లు వినకుండా ఇసుక తవ్వేందుకు ప్రయత్నించారు. వాహన యజమానులు మాగనూరు, మక్తల్ పోలీసులకు సమాచారమందించారు. మక్తల్, మాగనూరు పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. రైతులు వినకపోవడంతో లాఠీచార్జి చేసి, లారీలో ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో రైతులు పోలీసులపై రాళ్లవర్షం కురిపించారు. పోలీసులు కూడా రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రైతులు మాధవరెడ్డి, అనంతరెడ్డి, అయ్యలప్ప, సిద్దప్ప, శివారెడ్డి, జ గన్నాథ్‌రెడ్డి గాయపడ్డారు. కానిస్టేబుల్ రాంకుమార్ గాయపడ్డాడు.