'అదనపు బకెట్’పై ఏడీ విచారణ
► ‘సాక్షి’ కథనాలతో
► స్పందించిన ఖనిజాభివృద్ధి సంస్థ
► ఇసుక క్వారీల వద్ద వే బ్రిడ్జిల ఏర్పాటుకు నిర్ణయం
► అధికారులు, కాంట్రాక్టర్ల దందాకు అడ్డుకట్ట
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లాలోని ఇసుక క్వారీల్లో ‘అదనపు బకెట్’ అక్రమాలపై ఏప్రిల్ 27,28 తేదీల్లో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎండీసీ) స్పందించింది. ఈ మేరకు ప్రభుత్వ క్వారీలన్నింటి వద్ద కచ్చితంగా వేబ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించింది. ఇన్నాళ్లుగా అక్రమాలతో లబ్ధిపొందిన అధికారులు, కాంట్రాక్టర్లు వేబ్రిడ్జిల ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఉన్నతాధికారులపై వివిధ మార్గాల ద్వారా ఒత్తిడి పెంచేందుకు యత్నిస్తున్నారు. ఇసుక అమ్మకాలతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని అధికారులు, కాంట్రాక్టర్లు జేబులో వేసుకుంటున్నారు. వరంగల్‌లోని క్వారీల వద్ద అనధికారింగా అదనపు బకెట్ ఇసుక లోడింగ్ చేస్తున్న అంశంపై తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని భూగర్భ శాఖ సహాయ సంచాలకుడు(ఏడీ) బాలదాసును టీఎస్‌ఎండీసీ మేనేజింగ్ డెరైక్టర్(ఎండీ) ఇలంబర్తి ఆదేశించారు.
ఈ మేరకు జిల్లా ఏడీ క్వారీలవారీగా వివరాలను సేకరించి, ప్రత్యేక నివేదిక రూపొందించారు. క్వారీల వద్ద వేబ్రిడ్జిలు ఏర్పాటు చేస్తే అనధికారికంగా అధిక లోడింగ్ ఉండదని సూచించారు. వేబ్రిడ్జి లేకపోవడంతో ఎక్కువసార్లు అధిక లోడింగ్ జరుగుతుందనే సమాచారం ఉందని పేర్కొన్నారు. విచారణ నివేదిక ఆధారంగా టీఎస్‌ఎండీసీ ఎండీ ఇలంబర్తి చర్యలు తీసుకున్నారు. ఇలంబర్తి ప్రస్తుతం కేరళ అసెంబ్లీ ఎన్నికల పర్యవేక్షకుడిగా వెళ్లారు. దీంతో వేబ్రిడ్జిల ఏర్పాటు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఇలంబర్తి ఎన్నికల విధుల నుంచి రాగానే వేబ్రిడ్జిల ఏర్పాటు దిశగా చర్యలు వేగం పుంజుకోనున్నారుు.
లోడింగ్‌లో మాయూజాలం
టీఎస్‌ఎండీసీ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రస్తుతం ఏటూరు ఏ, ఏటూరు బీ, ఏటూరు 2, ఏటూరు 3, సింగారం, తుపాకులగూడెం, రామన్నగూడెం, చుంచుపల్లిల్లో ఇసుక క్వారీలు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ క్వారీల్లో అధిక లోడింగ్ అక్రమాలు జరుగుతున్నాయి. అధికారులు, ఇసుక అక్రమార్కులు కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయూనికి గండిపెడుతున్నారు. ఇసుకను లారీల్లోకి లోడింగ్ చేసే డంపింగ్ యార్డు వద్దే అక్రమాలకు నాంది పలుకుతున్నారు. లారీలను డంపింగ్ యార్డుకు తీసుకొస్తున్నప్పుడే అక్కడ ఉంటున్న సిబ్బంది లారీల డ్రైవర్ల వద్దకు వెళ్లి అనధికారింగా రూ.1000 తీసుకుంటున్నారు. ఇలా ఇచ్చిన వారి లారీల్లోకి, పొక్లెరుున్ బకెట్‌లో నిర్దేశిత పరిమాణం కంటే అదనంగా ఇసుకను లోడ్ చేసి వేరుుస్తున్నారు.
దీన్నే ‘అదనపు బకెట్’ అని అంటారు. దీని కారణంగా లారీల వారికి 5 నుంచి 6 టన్నులు అదనంగా ఇసుక లోడ్ అవుతోంది. టన్నుకు రూ.1000 చొప్పున లారీల నిర్వాహకులు అదనపు ఇసుకను బహిరంగ మార్కెట్‌లో విక్రయించుకొని సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని 6 క్వారీలకు ప్రతి రోజు సగటున 500 లారీలు వస్తుంటారుు. ఒక్క ఏటూరు క్వారీకే 300 లారీలు వస్తుంటారుు. లారీలో అదనంగా ఒక బకెట్ ఇసుకను లోడింగ్ చేయడం వల్ల ప్రతిరోజు 1500 టన్నుల దాకా ఇసుక అక్రమంగా తరలివెళ్తోంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు రూ.5,73,525 చొప్పున భారీ నష్టం కలుగుతోంది. ఈ నష్టాన్ని నివారించే దిశగా వడివడిగా చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.