తవ్వుకున్నోళ్లకి తవ్వుకున్నంత!
⇒ డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం నదుల నుంచి ఇసుక తరలించొచ్చు
⇒ ఉచితంగా పొందే వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం
⇒ తవ్వుకుని తరలించే బాధ్యత కాంట్రాక్టర్లదే
⇒ ఆ పేరుతో అధిక మొత్తంలో అక్రమంగా తరలించే ప్రమాదం!
సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్లకు కావాల్సిన ఇసుకను కాంట్రాక్టరే నేరుగా నదుల్లోంచి తోడుకుని, సరఫరా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటి వరకు కేవలం వాగులు, వంకల నుంచి ఉచితంగా ఇసుక పొందే వెసులుబాటు ఉండగా, తాజాగా నదుల్లోంచి కూడా పొందేందుకు అవకాశం కల్పించింది. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటంతో ఇసుకను ఉచితంగా అందించాలని ప్రభుత్వం గతేడాదే నిర్ణయించింది. అయినా పెద్దగా స్పందన లేదు. దీంతో నదుల నుంచి కూడా ఇసుకను పొందేందుకు వీలు కల్పిస్తూ తాజాగా ఇసుక విధానానికి సవరణలు చేసింది. దీంతో ఇక రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి చాలినంత ఇసుకను ఉచితంగా నదుల నుంచి తోడుకునేందుకు వీలు చిక్కింది.
అక్రమాలను ఆపతరమా..?
ఎలాంటి అనుమతులు లేనివారే యథేచ్ఛగా లారీలను నదుల వద్దకు తీసుకెళ్లి పొక్లెయిన్‌లతో ఇసుకను తోడి తీసుకెళ్తున్నా పట్టించుకునే దిక్కు లేదు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వమే ఇసుకను తోడుకునేందుకు అవకాశం కల్పిస్తే అక్రమాలను నిరోధించటం సాధ్యమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంత ఇసుక కావాలో ముందే నిర్ణయించి అధికారులు అంతమేర నదుల నుంచి తోడుకునేందుకు కాంట్రాక్టర్లకు అనుమతిస్తారు. కానీ అంతకంటే ఎక్కువ ఇసుక తవ్వి తీసుకెళ్తే నియంత్రించటం సాధ్యమేనా.. అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పేరుతో అవసరమైనదాని కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఇసుకను తవ్వి అక్రమంగా అమ్ముకునే అవకాశం ఉందని కొందరు అధికారులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇసుకను తవ్వి తరలించాలంటే రవాణా, కూలీల ఖర్చు పైన పడుతుందన్న ఉద్దేశంతో నేరుగా కాంట్రాక్టరే తవ్వుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ ఇప్పుడది మొదటికే మోసం తెచ్చేలా కనిపిస్తోంది. దీనికి బదులు ప్రభుత్వమే ఇసుకను ఉచితంగా సరఫరా చేసి, రవాణా ఖర్చులను కాంట్రాక్టర్ నుంచి వసూలు చేస్తే బాగుండేదని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. అలా చేస్తే ఉచితంగా ఇసుక ఇచ్చినట్టు ఎలా అవుతుందని మరికొందరు పేర్కొంటున్నారు. వెరసి ఈ గందరగోళంలో నదుల ఇసుకను అక్రమంగా తరలించేందుకు మార్గం సుగమం చేసినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే ఇది అమలులోకి వస్తోంది.