బ్యారేజీలు లేకున్నా పూడిక తీస్తున్నారు
తెలంగాణలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీలో పిటిషనర్లు
సాక్షి, న్యూఢిల్లీ: బ్యారేజీలు లేకున్నా పూడికతీత పేరుతో ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారని తెలంగాణలో ఇసుక తవ్వకాలపై దాఖలైన కేసులో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కు పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీకి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. దీనిపై ట్రిబ్యునల్ మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. కంతనపల్లి డ్యాం లేకున్నా పూడికతీత పేరుతో ప్రభుత్వం ఇసుకను అక్రమంగా తరలిస్తోందన్నారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సంజీవ్‌కుమార్‌ను ట్రిబ్యునల్ వివరణ కోరగా.. ప్రభుత్వం పూడికతీతను స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారదర్శకంగా జరుపుతోందని, ఇసుకను నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి, ఇతర ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తోందని పేర్కొన్నారు. ఒక శాతం ఇసుకను ప్రభుత్వ అవసరాలకు వినియోగించి, 99 శాతం అమ్ముకుంటూ ఉండవచ్చు కదా అని ట్రిబ్యునల్ ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, ఇసుక వినియోగానికి సంబంధించిన పూర్తి లెక్కలున్నాయని సంజీవ్ సమాధానమిచ్చారు.