తమ్మిలేరుపై రాబందులు..
► మళ్లీ చెలరేగిన ఇసుక మాఫియా అడ్డుకున్న గ్రామస్తులు
► పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
ఎల్లాపురం(ముసునూరు) : తమ్మిలేరును దోచుకునేందుకు ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అడ్డగోలుగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు జిల్లాల మధ్య వివాదంగా చూపి సొమ్ము చేసుకునేందుకు కుట్ర చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు వర్తించవంటూ బుకాయించే ప్రయత్నించారు. కాని వారి కుట్రను గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో తవ్వకాలను నిలిపివేశారు.
వివరాలు.. తమ్మిలేరు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు మధ్యలో ఉంది. కృష్ణా జిల్లాలో తమ్మిలేరులో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. ఇటీవల నూజివీడు సబ్‌కలెక్టర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇసుక తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని చెప్పారు. కొందరు అనుమతి ఇచ్చినట్లు ప్రకటన చేస్తున్నారని వారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. తవ్వకాలు జరిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కృష్ణా జిల్లా పరిధిలో తవ్వకాలను నిలిపివేశారు.
డొంకదారిలో ఇసుక మాఫియా
కృష్ణాజిల్లా పరిధిలో అనుమతులు లేకపోవడంతో ఇసుక తరలింపు సాధ్యం కావడం లేదు. దీంతో పశ్చిమ గోదావరి పరిధిలో అనుమతులు ఉన్నాయంటూ తమ్మిలేరు మధ్యలోకి వచ్చి బుధవారం తవ్వకాలు ప్రారంభించారు. దీంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. మాఫియాకు గ్రామస్తులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అనుమతి పత్రాలు చూపాలంటూ నిలదీశారు. 11 ట్రాక్టర్లు యథేచ్ఛగా తవ్వకాలు సాగించేందుకు ప్రయత్నించారు. అయితే గ్రామస్తులు పట్టువిడవకుండా పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తవ్వకాలను నిలిపివేశారు. అంతటితో వివాదానికి తెరపడింది.