పెదపులిపాక ఇసుక క్వారీలో నిలిచిన ఇసుక రవాణా
► కోర్టు ఉత్తర్వులకు తలొగ్గిన అధికారులు
► ఇంకా క్వారీలోనే యంత్రాలు!
పెదపులిపాక (పెనమలూరు): పెదపులిపాక ఇసుక క్వారీలో ఇసుక రవాణాకు ఆదివారం నుంచి ఎట్టకేలకు తెరపడింది. ఈ క్వారీలో ఇసుక తవ్వకాలు చేయరాదని హైకోర్టు గత శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ నియోజకవర్గ ముఖ్యనేత పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి శనివారం వరకు ఇసుక లోడింగ్ చేయిం చారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి శనివారం ఆందోళనకు దిగారు.
ఈ వ్యవహారంపై సాక్షిలో కథనం రావడంతో జిల్లా అధికారులు ఎట్టకేలకు స్పందించి ఇసుక రవాణాను నిలుపుదల చేశారు. టీడీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయటంతో ప్రజలకు ఇసుక అందుబాటులోకి వచ్చింది. అలాగే దాదాపు 2 వేలమంది కూలీలకు కూడా ఉపాధి దొరికింది. అయితే టీడీపీ నేత తన పొక్లయినర్లు ఇసుక క్వారీలోకి దించి లోడింగ్ చేపట్టాడు.
దీనిని పెదపులిపాక గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా టీడీపీ నేత వైఖరిలో మార్పురాలేదు. టీడీపీ నేత దందాపై హైకోర్టునాశ్రయించారు. కోర్టు పూర్వాపరాలు విచారణ చేసి స్టే ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ క్వారీ విషయంలో పోలీసులు టీడీపీ నేతలకు అండగా అత్యుత్సాహం చూపడం విమర్శలకు దారి తీసింది.
ఆదాయానికి గండి
ఇసుక క్వారీలో లోడింగ్ ఆగిపోవడంతో టీడీపీ నేత ఆదాయానికి భారీగా గండిపడింది. ఈ నేతకు లోడింగ్ పుణ్యమాని రోజుకు రూ.2 లక్షలు ఆదాయం వచ్చేది. అయితే నేత అత్యాశకు పోవడంతో వ్యవహారం బెడిసింది. మొత్తం మీద క్వారీ నిలుపుదల చేయటంతో గ్రామస్తులు మాత్రం ఆనందంగా ఉన్నారు. టీడీపీ నేతలకు తగిన గుణపాఠం చెప్పామని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే క్వారీలో ఇంకా టీడీపీ నేతకు సంబంధించిన యంత్రాలు అక్కడే ఉన్నాయి. వాటిని వెంటనే తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.