పేద నిరుద్యోగులకు మినీ ట్రక్కులు | AP Govt Distributes Mini Trucks For Poor Unemployes | Sakshi
Sakshi News home page

పేద నిరుద్యోగులకు మినీ ట్రక్కులు

Published Sat, Nov 21 2020 9:45 PM | Last Updated on Sat, Nov 21 2020 10:11 PM

AP Govt Distributes Mini Trucks For Poor Unemployes - Sakshi

సాక్షి, అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. తాజాగా ఆయా వర్గాల్లోని పేద నిరుద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలని నిర్ణయించింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న 9,260 మంది పేద నిరుద్యోగులను ఎంపిక చేసి ప్రభుత్వం వారికి భారీ సబ్సిడీతో మినీ ట్రక్కులు ఇవ్వనుంది. ఇంటింటికీ సబ్సిడీ సరుకుల పంపిణీకి ఈ వాహనాలను వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో వాహనాల కొనుగోలుకు సంబంధించి సెప్టెంబర్‌ 11న పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసింది.

ఆరేళ్లలో లబ్ధిదారునికి వాహనం సొంతం
ఒక్కో వాహనం ఖరీదు రూ. 5,81,190గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 60% అంటే రూ.3,48,714 సబ్సిడీ కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. 30% అంటే రూ.1,74,357 బ్యాంకు రుణం కింద అందజేస్తుంది. మొత్తం వాహనం ఖరీదులో కేవలం 30% మాత్రమే బ్యాంకు నుంచి రుణంగా తీసుకుంటున్నందున లబ్ధిదారులపై పెద్దగా భారం పడదు. సులభ వాయిదాలలో రుణం చెల్లించేందుకు వీలవుతుంది. ఇక లబ్ధిదారుని వాటా కింద కేవలం 10% అంటే రూ.58,119 మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. కాగా బ్యాంకు రుణ మొత్తాన్ని ఆరు సంవత్సరాల్లో చెల్లించేట్లుగా నిబంధనలు విధించారు. అంటే ఆరేళ్లలో వాహనం లబ్ధిదారుని సొంతమవుతుందన్న మాట. ఏదైనా పథకం కింద ఇంత భారీ స్థాయిలో సబ్సిడీ ఇవ్వడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. 

నెలకు రూ.10 వేల నికర ఆదాయం
ప్రభుత్వం వచ్చే జనవరి నుంచి ఇంటింటికీ సబ్సిడీ బియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేయనుంది. ఇప్పటివరకు చౌకధరల దుకాణాల నుంచి కార్డుదారులు బియ్యం తెచ్చుకుంటున్నారు. ఇకపై వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం ఇంటింటికీ బియ్యం, సరుకులు అందజేయనుంది. ఈ నేపథ్యంలోనే ట్రక్కుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదట మండల స్థాయి గోడౌన్‌ పాయింట్ల నుంచి సరుకులు మినీ ట్రక్కుల ద్వారా డీలర్‌ షాపులకు చేరుస్తారు. అక్కడి నుంచి ఇంటింటికీ చేర్చే కార్యక్రమాన్ని చేపడతారు. బ్యాంకు రుణం, ఇతర ఖర్చులు పోను లబ్ధిదారునికి నెలకు రూ.10 వేలు కార్పొరేషన్‌ చెల్లిస్తుంది.

 27 వరకు దరఖాస్తుల స్వీకరణ
మినీ ట్రక్కులకు దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలైంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకుని పూర్తి చేసిన అనంతరం తిరిగి అక్కడే అందజేయాలి. ఈనెల 27వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్‌ 4న ఇంటర్వ్యూలు ఉంటాయి. 5న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తారు.

కార్పొరేషన్ల వారీగా ప్రభుత్వం ఎంపిక చేసే లబ్ధిదారుల సంఖ్య ఇలా.. 
 

బీసీలు 3,800
ఈబీసీలు 1,800
ఎస్సీలు 2,300
ఎస్టీలు 700
క్రైస్తవులు 104
మైనార్టీలు     556
మొత్తం 9,260

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement