ఐషర్ 5 టన్నులలోపు వాహనాలు వస్తున్నాయ్.. | New government to spur demand for trucks: Eicher | Sakshi
Sakshi News home page

ఐషర్ 5 టన్నులలోపు వాహనాలు వస్తున్నాయ్..

Published Tue, May 13 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM

ఐషర్ 5 టన్నులలోపు వాహనాలు వస్తున్నాయ్..

ఐషర్ 5 టన్నులలోపు వాహనాలు వస్తున్నాయ్..

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన దిగ్గజాలు వోల్వో గ్రూప్, ఐషర్ మోటార్స్‌ల అనుబంధ కంపెనీ వీఈ కమర్షియల్ వెహికిల్స్(వీఈసీవీ) సరికొత్త సంచలనాలకు రెడీ అవుతోంది. ఐషర్ బ్రాండ్‌లో తేలికపాటి రవాణా వాహనాలను పరిచయం చేయాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం వీఈ కమర్షియల్ బస్‌లతోపాటు 5 నుంచి 49 టన్నుల సామర్థ్యం గల హాలేజ్, టిప్పర్, ఆర్టిక్యులేటెడ్ ట్రాక్టర్లను భారత్‌తోపాటు విదేశాల్లో విక్రయిస్తోంది. 5 టన్నుల లోపుండే తేలికపాటి వాహనాల విభాగంలోకి ప్రవేశిస్తామని వీఈసీవీ సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ మాలర్ సోమవారం తెలిపారు. ఐషర్ ప్రో సిరీస్ ట్రక్‌లను ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో ప్రత్యేకంగా మాట్లాడారు.

 మూడేళ్లలో కొత్త విభాగంలోకి..
 5-49 టన్నుల విభాగంలో ఐషర్ తన బ్రాండ్ హవా కొనసాగిస్తోందని శ్యామ్ మాలర్ చెప్పారు. అన్ని రకాల రవాణా వాహనాలను తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఈ నేపథ్యంలో 5 టన్నుల లోపు విభాగంలోని ప్రవేశించేందుకు కసరత్తు ప్రారంభించామని పేర్కొన్నారు. తేలికపాటి రవాణా వాహనాలకు(ఎల్‌సీవీ) భారత్‌లో విపరీత డిమాండ్ ఉందని తెలిపారు. వాహనాల అభివృద్ధి, ఉత్పత్తికి మూడేళ్ల సమయం పడుతుందని వివరించారు.

 పాతవాటి స్థానంలో..
 ఐషర్ బ్రాండ్‌లో ఇప్పటి వరకు విక్రయిస్తున్న మోడళ్ల స్థానంలో ‘ప్రో’ పేరుతో కొత్తవాటిని పరిచయం చేస్తోంది. ఈ ఏడాది 40 వేరియంట్ల దాకా రానున్నాయి. ప్రస్తుతం ఐషర్ ప్రో 1000లో 5-14 టన్నుల్లో లైట్, మీడియం డ్యూటీ, ప్రో 3000 సిరీస్‌లో 9-14 టన్నుల సామర్థ్యం గల మీడియం డ్యూటీ వాహనాలను తయారు చేస్తున్నారు. ప్రో 6000లో 16-40 టన్నులు, ప్రో 8000లో 25-49 టన్నుల హెవీడ్యూటీ ట్రక్కులు కొద్ది రోజుల్లో మార్కెట్లోకి రానున్నాయి. స్కైలైన్ ప్రో బస్‌లు కూడా భారతీయ రోడ్లెక్కనున్నాయి. మెరుగైన పనితీరు కనబరిచేలా వీటిని తీర్చిదిద్దుతున్నట్టు కంపెనీ తెలిపింది.

 మార్కెట్ వాటా 15 శాతం..
 భారత వాణిజ్య రవాణా వాహనాల రంగం 27 నెలలుగా తిరోగమనంలో ఉందని శ్యామ్ మాలర్ తెలిపారు. ఎన్నికల తర్వాత మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గోవాతోపాటు ఉత్తర కర్నాటక, ఒరిస్సాలో మైనింగ్ అనుమతులతో కొంతైనా మార్పు వస్తుందన్నారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్య, ఇండోనేషియా మార్కెట్లలో అవకాశాలను అందిపుచ్చుకుంటామని వివరించారు. 2013లో అన్ని విభాగాల్లో కలిపి 44 వేల ఐషర్ వాహనాలు అమ్ముడయ్యాయి. మార్కెట్ వాటా 13.8 శాతం ఉంది. 2014లో ఇది 15 శాతానికి చేరొచ్చని పేర్కొన్నారు. గతేడాది 2 వేల ఐషర్ వాహనాలను ఆంధ్రప్రదేశ్‌లో విక్రయించామని తల్వార్ గ్రూప్ ఎండీ సునీల్ తల్వార్ తెలిపారు. అమ్మకాల పరంగా భారత్‌లో టాప్-1 డీలర్‌గా కొనసాగుతున్నామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement