15 ఏళ్లు దాటితే పక్కనబెట్టాల్సిందే..
కాలుష్య సమస్యతోపాటు ప్రమాదాలకు కారణమువుతున్న పాత వాహనాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు కొత్త విధానాన్ని రూపొందిస్తున్నామని, ఇది అమలైతే 15 ఏళ్ల నాటి 11.5 లక్షల ట్రక్కులు, బస్సులు కనుమరుగవుతాయని అధికారులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : అనేక సమస్యలకు కారణమవుతున్న 15 ఏళ్లకు పైబడిన వాహనాలన్నింటినీ దశల వారీగా తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక విధానం రూపొందించాలని నిర్ణయించింది. ఈ విధానం అమలైతే రోడ్లపై చక్కర్లు కొడుతున్న 15 ఏళ్ల నాటి 11.5 లక్షల ట్రక్కులు, బస్సులు కనుమరుగవుతాయి. వాటి స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై రూ.నాలుగు వేల కోట్ల భారం పడనుంది. కాలుష్యభరితమైన పాత వాహనాల తొలగింపుపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రవాణా మంత్రి నితిన్ గడ్కారీ చర్చలు జరిపారు.
పాత వాహనాల తొలగింపునకు ప్రత్యేక విధానం రూపొందించాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మొదటి దశలో పాత ట్రక్కులు, భారీ వాహనాలకు, రెండో దశలో 15 ఏళ్ల కిందటి 60 లక్షల నాలుగు చక్రాల వాహనాలకు స్వస్తి పలుకనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కాలుష్య నిబంధనలకు అనుగుణంగా లేని పాత వాహనాలను తప్పనిసరిగా తొలగించాలనే నిబంధనను తీసుకురావాలని ఆర్థిక మంత్రి భావిస్తున్నట్టు నితిన్ గడ్కారీ తెలిపారు. ‘పాత వాటి స్థానంలో కొత్తవి కొనేవారికి నేరుగా నగదు ప్రయోజనాలు కల్పిస్తాం. అయితే ఎక్సైజ్ డ్యూటీ మాత్రం చెల్లించాల్సిందే. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు లేకపోవడం వల్ల కొత్త వాహనాల అమ్మకంతో ప్రభుత్వానికి సుమారు రూ.19 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుంది. చమురు దిగుమతులు కూడా తగ్గించుకుని, ఏటా రూ.7,700 కోట్ల వరకు ఆదాయం సమకూర్చుకోవాలని మా మంత్రిత్వశాఖ నిర్ణయించింది’ అని మంత్రి గడ్కారీ వివరించారు.