మళ్లీ కూర‘గాయాలు’..
- నానాటికీ పెరిగిపోతున్న కూరగాయల ధరలు
- ఉత్పత్తి తగ్గడమే ప్రధాన కారణమంటున్న అధికారులు
- దీపావళి సమయానికి మరింత మండిపోయే అవకాశం
- ఇబ్బందులు పడుతున్న స్థానికులు
సాక్షి, ముంబై: కూరగాయల ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి కూరగాయల లోడుతో వస్తున్న ట్రక్కులు, టెంపోల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. ఫలితంగా సరుకు కొరత ఏర్పడి ధరలు మండిపోవడం మొదలుపెట్టాయి. ఏపీఎంసీకి యేటా సెప్టెంబర్‌లో దాదాపు 700 వరకు ట్రక్కులు, టెంపోలు కూరగాయల లోడ్లు వస్తాయి. కాని ఈ ఏడాది సెప్టెంబర్‌లో 350-400 లోపు వస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు జూన్, జూలై ఆఖరు వరకు కురవలేదు. దీంతో కూరగాయల పంటల దిగుబడి తగ్గిపోయింది.
ఆ తర్వాత ఆగస్టులో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని ఏపీఎంసీ డెరైక్టర్ శంకర్ పింగలే చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 60 శాతం మాత్రమే కూరగాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. వాటి నాణ్యత కూడా సాధారణ స్థాయిలో ఉందని వ్యాపారులు అంటున్నారు. మంచి నాణ్యత ఉన్న కూరగాయలు రావడంలేదని, గత్యంతరం లేక నాణ్యత లోపించిన కూరగాయలనే విక్రయించాల్సి వస్తోందని వ్యాపారులు అంటున్నారు. సరుకు కొరత కారణంగా కూరగాయల ధరలు 25-30 శాతం పెరిగాయి. దీపావళి తర్వాత కొత్త పంటలు చేతికొస్తాయని, ఆ తరువాత కూరగాయల ధరలు వాటంతట అవే దిగివస్తాయని కొందరు హోల్ సెల్ వ్యాపారులు అంటున్నారు. త్వరలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సమయంలో అనేక మంది భక్తి శ్రద్ధలతో ఉపవాసాలుంటారు.
దీంతో మాంసం, చేపలకంటే కూరగాయలకే మరింత డిమాండ్ పెరుగుతుంది. దీన్ని అదనుగా చేసుకుని చిల్లర వ్యాపారులు ధరలు పెంచేసి జేబులు నింపుకునే ప్రయత్నాలు చేస్తారు. కూరగాయల నిల్వలు ఉన్నప్పటికీ కావాలనే కృత్రిమ కొరత సృష్టించి కొందరు వ్యాపారులు అందినంత దండుకునేందుకు యత్నిస్తారు.
చౌకధరల కూరగాయల కేంద్రాలు మాయం
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన చౌక ధరల కూరగాయల కేంద్రాలు ముంబై, ఠాణే, నవీముంబైలో కనిపించడం లేదు. ఆకస్మాత్తుగా అవి మాయం కావడంతో పేదలు ఇబ్బందుల్లో పడిపోయారు. గత ఏడాదివర్షాలు లేక కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో అందరికి అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం ముంబై, ఠాణే, నవీముంబైలో అక్కడక్కడ 125 చౌక ధరల కూరగాయల కేంద్రాలు ప్రారంభించింది. ఈ మధ్యకాలంలో కూరగాయల దిగుబడి పెరిగి పరిస్థితులు ధరలు సాధారణ స్థితికి వచ్చాయి. దీంతో ఈ కేంద్రాలకు ఆదరణ కరువైంది. కాలక్రమేణా అవి మూతపడిపోయాయి.