APMC
-
చర్చలు అసంపూర్ణం
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు, కేంద్ర మంత్రులకు మధ్య గురువారం జరిగిన నాలుగో విడత చర్చలు ఎలాంటి నిర్ణయాత్మక ఫలితం రాకుండానే, అసంపూర్తిగా ముగిశాయి. రేపు(శనివారం) మరో విడత చర్చలు జరగనున్నాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు, దాదాపు 40 మంది రైతు సంఘాల ప్రతినిధుల మధ్య ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సుమారు 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. చర్చల సందర్భంగా ప్రభుత్వం నుంచి మంచినీరు కూడా రైతు ప్రతినిధులు స్వీకరించలేదు. ప్రభుత్వం ఆఫర్ చేసిన టీ, లంచ్‌ను వారు తిరస్కరించారు. హడావుడిగా తీసుకువచ్చిన సాగు చట్టాల్లోని లోటుపాట్లను ప్రస్తావించి, వాటిని రద్దు చేయాలని మరోసారి గట్టిగా డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని, ఆ విషయంలో అపోహలు వద్దని చర్చల సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. ఆ విధానాన్ని టచ్ కూడా చేయబోమని హామీ ఇచ్చారు. పార్లమెంటు సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. ‘చర్చించాల్సిన అంశాలను నిర్ధారించాం. వాటిపై శనివారం చర్చ జరుగుతుంది. అదే రోజు రైతుల నిరసన కూడా ముగుస్తుందని ఆశిస్తున్నా’ అని చర్చల్లో పాల్గొన్న వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ పేర్కొన్నారు. ‘చర్చల సందర్భంగా కొన్ని అంశాలను రైతు ప్రతినిధులు లేవనెత్తారు. కొత్త చట్టాల వల్ల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ)లు మూత పడ్తాయేమోనని వారు భయపడ్తున్నారు. ప్రభుత్వానికి పట్టింపులేవీ లేవు. సానుకూల దృక్పథంతో రైతులతో చర్చలు జరుపుతున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీలను మరింత బలోపేతం చేయడానికి, ఆ కమిటీల కార్యకలాపాలను విస్తృతం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం’ అని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ‘కొత్త చట్టాల ప్రకారం.. ఏపీఎంసీ పరిధికి వెలుపల ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లు ఉంటాయి. రెండు విధానాల్లోనూ ఒకే విధమైన పన్ను వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు. ‘రైతులు తమ ఫిర్యాదులపై ఎస్డీఎం(సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్) కోర్టులకు వెళ్లవచ్చని చట్టంలో ఉంది. అది కింది కోర్టు అని, పై కోర్టుల్లో దావా వేసే వెసులుబాటు ఉండాలని రైతు ప్రతినిధులు కోరారు. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం’ అని తోమర్ తెలిపారు. రైతులు కోరుతున్నట్లు.. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారా? అన్న మీడియా ప్రశ్నకు తాను భవిష్యత్తును చెప్పేవాడిని కాదని తోమర్ బదులిచ్చారు. తోమర్, సోమ్ ప్రకాశ్‌లతో పాటు రైల్వే, వాణిజ్య, ఆహార శాఖ మంత్రి పియూష్ గోయల్చర్చల్లో పాల్గొన్నారు. చర్చల అనంతరం రైతు సంఘాల ప్రతినిధులు నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. ‘మా వైపు నుంచి చర్చలు ముగిశాయి. ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపనట్లయితే.. తదుపరి చర్చలకు రాకూడదని మా నేతలు నిర్ణయించారు’ అని ఏఐకేఎస్‌సీసీ(ఆల్ ఇండియా కిసాన్ సంఘర్‡్ష కోఆర్డినేషన్ కమిటీ) సభ్యురాలు ప్రతిభ షిండే తెలిపారు. ‘ఎమ్మెస్పీ సహా పలు అంశాలపై ప్రభుత్వం నుంచి చాలా ప్రతిపాదనలు వచ్చాయి. వాటిపై శుక్రవారం రైతు సంఘాల ప్రతినిధులు చర్చిస్తారు’ అని మరో నేత కుల్వంత్ సింగ్ సంధు తెలిపారు. ‘చట్టాల్లో సవరణలు చేయడం కాదు.. ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే మా ప్రధాన డిమాండ్’ అని ఏఐకేఎస్‌సీసీ ప్రధాన కార్యదర్శి హన్నన్ మోలా స్పష్టం చేశారు. రైతు సంఘాల ప్రతినిధులు శుక్రవారం సమావేశమై, త్రదుపరి చర్చలపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. మీ ఆతిథ్యం మాకొద్దు చర్చల సందర్బంగా ప్రభుత్వ ఆతిథ్యాన్ని రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. తమకోసం సింఘు నుంచి వ్యాన్‌లో వచ్చిన భోజనాన్ని స్వీకరిం చారు. చర్చల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన టీ, మంచినీరును కూడా వారు తీసుకోలేదు. ‘సహచర రైతులు రోడ్లపై ఉంటే, మేం ఇక్కడ ప్రభుత్వ ఆతిథ్యాన్ని ఎలా తీసుకుంటాం’ అని చర్చల్లో పాల్గొన్న రైతు నేత షిండే వ్యాఖ్యానించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ వద్ద నిరసన తెలుపుతున్న రైతులు -
అన్నదాతలే వెన్నెముక
న్యూఢిల్లీ: 2014లో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంతో పండ్లు, కూరగాయల సాగుదారులు లాభపడగా, ఇప్పుడు ధాన్యం రైతులకు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు తగినంత స్వేచ్ఛ లభించిందని ప్రధాన మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో కూడా రైతుల వల్లే వ్యవసాయ రంగం బలోపేతమైందని, స్వయం సమృద్ధ భారత్‌కు అన్నదాతలు కీలకంగా ఉన్నారని కొనియాడారు. ఆదివారం మాసాంతపు ‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణ బిల్లులపై ఒక వర్గం రైతులు ఆందోళనలు కొనసాగిస్తుండగా ప్రధాని వారిపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. అదే సమయంలో ఆయన గత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలపై మండిపడ్డారు. మహాత్మాగాంధీ ఆర్థిక సిద్ధాంతాలను కాంగ్రెస్ పాటించి ఉంటే ఇప్పుడు ‘ఆత్మనిర్భర్ భారత్’ యోజన అవసరం ఉండేదే కాదన్నారు. దేశం ఎప్పుడో స్వయం సమృద్ధం సాధించి ఉండేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రైతు సంఘా లతో ముచ్చటించారు. 2014లో చేసిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)చట్టంతో లాభం పొందిన హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రైతుల అనుభవాలను వివరించారు. ఉత్పత్తులను విక్రయించే సమయంలో వీరికి దళారుల బెడద తప్పిందని, మెరుగైన ధర లభించిం దని పేర్కొన్నారు. ఇప్పుడు వరి, గోధుమ, చెరకు రైతులకు కూడా ఇదే స్వేచ్ఛ లభించనుందని, వారు మంచి ధర పొందనున్నారని అన్నారు. కథలు చెప్పడం మన సంస్కృతిలో భాగమంటూ ఆయన.. సైన్స్‌కు సంబంధిం చిన కథలు ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని ‘బెంగళూరు స్టోరీ టెల్లింగ్ సొసైటీ’ సభ్యులతో ముచ్చటించారు. వారితో తెనాలి రామకృష్ణుడి కథ ఒకటి చెప్పించారు. ప్రజలంతా కూడా పిల్లలకు కథలు చెప్పేందుకు కొంత సమయం కేటాయించాలని కోరారు. మాలి దేశానికి చెందిన సేదు దెంబేలే గురించి ప్రధాని తెలిపారు. ఆయనకు భారత్‌పై ఉన్న అభిమానాన్ని వివరించారు. ప్రధాని ఇంకా ఏమన్నారంటే.. ► కథలు ప్రజల సృజనాత్మకతను ప్రకటిస్తాయి. నేను నా జీవితంలో చాలా కాలం దేశమంతటా సంచరించాను. ప్రతి రోజు ఒక కొత్త ఊరు, కొత్త ప్రజలు. నా పర్యటనల్లో నేను పిల్లలతో మాట్లాడేవాడిని. వారిని కథలు చెప్పమని అడిగేవాడిని. కానీ వారు జోక్స్ చెబుతామని, మాకు జోక్స్ చెప్పండని అడగేవారు. నేను ఆశర్యపోయేవాడిని. వారికి కథలతో పరిచయం ఉండటం లేదు. గతంలో ఇంట్లో పెద్దలు పిల్లలకు కథలు చెప్పేవారు. ఆ కథల్లో శాస్త్రం, సంప్రదాయం, సంస్కృతి, చరిత్ర ఉండేవి. కథల చరిత్ర మానవ నాగరికత అంత పురాతనమైంది. కథలు చెప్పే సంప్రదాయం అంతరించిపోకుండా ఇప్పటికీ కొందరు కృషి చేస్తున్నారు. ఐఐఎం(ఏ)లో ఎంబీఏ చేసిన అమర్వ్యాస్ వంటి కొందరు వెబ్‌సైట్స్‌ను ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతికత సాయంతో ఆసక్తి ఉన్నవారికి పలు కథారీతులను పరిచయం చేస్తున్నారు. బెంగుళూరులో శ్రీధర్ అనే వ్యక్తి గాంధీజీ కథలను ప్రచారం చేస్తున్నారు. ► ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వం టి పెద్దలుంటే వారి వద్ద కథలను విని, రికార్డ్ చేసుకోండి. భవిష్యత్తులో ఉపయోగ పడ్తాయి. ► ఆధునిక వ్యవసాయ పద్దతులను ఉపయోగించడం వల్ల వ్యయం తగ్గుతుంది. దిగుబడి, నాణ్యత పెరుగుతుంది. రైతులు మార్కెట్ అవసరాలకనుగుణంగా పంటలు వేయాలి. ► సెప్టెంబర్ 28 షహీద్ భగత్ సింగ్ జయంతి. బ్రిటిష్ వారిని గడగడలాడించిన సాహస దేశభక్తుడు భగత్ సింగ్. లాలా లాజ్‌పత్ రాయ్ పట్ల ఆయనకున్న అంకితభావం, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వంటి విప్లవకారులతో అనుబంధం చాలా గొప్పది. ఆయనకు నా వినమ్ర నివాళులు. భగత్‌సింగ్‌లా కావడం ఎలా? హైదరాబాద్ వ్యక్తికి మోదీ సమాధానం నమో యాప్‌లో ఒక ప్రశ్న చూశాను. ఈ తరం యువత భగత్‌సింగ్‌లా కావడం ఎలా? అని హైదరాబాద్‌కు చెందిన అజయ్ ఎస్జీ అడిగారు. మనం భగత్‌సింగ్ కాగలమో, లేదో తెలియదు కానీ, ఆయనకు దేశంపైన ఉన్న ప్రేమను, దేశ సేవ కోసం ఆయన పడే తపనను మనం పెంపొందించుకోవచ్చు. అదే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి. దాదాపు నాలుగేళ్ల క్రితం ఇదే సమయంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో మన సైనికుల శక్తి సామర్థ్యాలను చూశాం. అప్పుడు ఆ వీర సైనికుల మనస్సులో ఒకటే ఉంది.. దేశ రక్షణ ఒకటే వారి లక్ష్యం. తమ ప్రాణాలకు వారు ఎలాంటి విలువనివ్వలేదు. పని ముగించుకుని, వారు విజయవంతంగా తిరిగిరావడం మనం చూశాం. దేశ మాత గౌరవాన్ని వారు మరింత పెంచారు. -
1000 కిలోలు అమ్మితే రూపాయి మిగిలింది!
పుణే: పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటన్న రైతుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో ఉల్లి రైతుల పరిస్థితి అలాగే ఉంది. మహారాష్ట్ర రైతులకు ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టించి, అమ్మకానికి తెచ్చేసరికి ధరాఘాతం ఆవహించడం రైతన్నను షాక్ కు గురిచేస్తోంది. టన్నులకొద్దీ ఉల్లిపాయలు అమ్మినా.. సాగు, ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కూడా చేతికి రాకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే టన్ను(1000 కిలోలు) ఉల్లి అమ్మితే తనకు వచ్చిన ఆదాయం కేవలం ఒక్క రూపాయి అని రైతు చెబుతున్నాడు. రైతు దేవిదాస్ పర్భానే తనకున్న రెండెకరాలలో ఉల్లిని సాగుచేశాడు. నాసిక్ కు చెందిన కొందరు వర్తకులు, ఏపీఎంసీ సభ్యులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ ను కలిసి గిట్టుబాటు ధర కల్పించి రైతులను, మార్కెట్లను ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. జిల్లా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కు తన పంటను తీసుకొచ్చాడు. 80 వేల రూపాయలు ఖర్చుపెట్టి రెండకరాల్లో చేసిన సాగును అమ్మకానికి పెట్టగా వచ్చిన ధరకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నాడు. టన్ను ఉల్లిపాయలు విక్రయించగా కేవలం 1523 రూపాయలే వచ్చాయని, ఇందులో లేబర్ చార్జీలు, ట్రక్ డ్రైవర్ కు రూ.1320, ఇతర ఖర్చులు అన్ని తీసివేయగా తనకు మిగిలింది కేవలం ఒక్క రూపాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అతిపెద్ద ఉల్లిపాయల హోల్ సేల్ మార్కెట్లలో ఒకటైన మారాఠ్వాడా లోని లాసూర్ మార్కెట్లో మంచి నాణ్యత కలిగిన ఉల్లిపాయలు తీవ్ర ధరాఘాతానికి గురై.. వేలంలో 100 కేజీలకు 500 నుంచి 600 రూపాయలు ధర రావడం, చివరగా కేజీకి 50 పైసలు మాత్రమే వచ్చిందని రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
ఉగాదికి ‘మామిడి’ రెడీ
సాక్షి, ముంబై: మామిడి పండ్ల ప్రియులకు శుభవార్త. ఉగాది నాటికి మార్కెట్లోకి మామిడి పళ్లు రానున్నాయి. కొంకణ్‌లో వర్షాలు నిలిచిపోవడంతో మామిడి కాయలు ఉగాది పండుగ నాటికి సరఫరా అవుతాయని వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రం (ఏపీఎంసీ) వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే మార్కెట్‌కి సరఫరా అవుతాయని చెబుతున్నారు. దీంతో నగరవాసులు కూడా తెలుగు నూతన సంవత్సరాన్ని ఇష్టమైన మామిడి పండ్లతో ఆహ్వానం పలకవచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాయ్‌ఘడ్, రత్నగిరి, సిందుదుర్గ్ జిల్లాల నుంచి ఉగాదికి 50,000 పండ్ల బాక్సులు నగరానికి వస్తాయని పండ్ల వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఉగాది పురస్కరించుకొని చాలా మంది మామిడిపళ్లు కొనుగోలు చేస్తుంటారని, పండగ వరకు ఏపీఎంసీ మార్కెట్ కళకళలాడాలని వ్యాపారి విజయ్ ధోబ్లే ఆశాభావం వ్యక్తం చేశారు. మొన్న కురిసిన వర్షాల వల్ల ఆల్పోన్సో లాంటి ప్రత్యేక జాతికి చెందిన మామిడి పండ్ల సరఫరా ఈ ఏడాది తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. కొన్ని వేల సంఖ్యలో మాత్రమే ఆ మామిడి పళ్లు సరఫరా అయ్యే అవకాశం ఉందని వ్యాపారులు తెలుపుతున్నారు. వాషిలోని ఏపీఎంసీ మార్కెట్‌కు చెందిన పండ్ల వ్యాపారి బాలకృష్ణ షిండే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మామిడి పండ్ల నాణ్యత, పరిమాణం ఆధారంగా వాటి ధర నిర్ణయించనున్నట్లు పేర్కొన్నారు. హోల్ సేల్ మార్కెట్లో వీటి ధర డజన్ రూ.200 నుంచి రూ.600 వరకు ఉంటుందన్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఈ ధరలు తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పండ్ల నాణ్యత బాగానే ఉంటుందని చెప్పారు. ఇక్కడ మామిడి పండ్ల దిగుబడి ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రస్తుతం అల్పూన్సన్ అనే జాతి మామిడి పండ్లను రీటైల్ మార్కెట్లో డజన్ రూ.900 నుంచి రూ.1,000 వరకు విక్రయిస్తారని తెలిపారు. అయితే ఏప్రిల్‌లో మామిడి పండ్ల సరఫరా పెరగడంతో... ధరలు తగ్గుముఖం పడుతాయని చెప్పారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
ఏపీఎంసీ సభ్యుల స్థానాలకు మద్దతుదారులతో నామినేషన్లు దాఖలు గంగావతి: గంగావతి తాలూకాలో రెండు ఏపీఎంసీ సభ్యు ల స్థానాలకు ఈనెల 18న నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శనివారం ముగిసింది. శనివారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు మద్దతుదారులతో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నగరంలోని ఏపీఎంసీ కార్యాలయంలో జనసందోహంతో కిక్కిరిసిపోయింది. గంగావతి, కారటగి రెండు ఏపీఎంసీలలో 14 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గంగావతి ఏపీఎంసీకి 13 మంది వ్యవసాయ క్షేత్ర సా ్థనాల పరిధిలో 71,735 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 53,398 మంది పురుష ఓటర్లు, 19,337 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. వర్తకుల క్షేత్ర స్థానం పరిధిలో 888 మంది ఓటర్లు కలిగి ఉండగా, ఇందులో 864 మంది పురుష ఓటర్లు, కేవలం 24 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. కారటగి ఏపీఎంసీ పరిధిలో 33,784 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 24,596 మంది పురుష ఓటర్లు, 9,188 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈనెల 18న జరిగే ఎన్నికలకు గంగావతి ఏపీఎంసీకి 145 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. కారటగి ఏపీఎంసీకి 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు ఏపీఎంసీలకు వర్తకుల కోసం కేటాయించిన ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ,జేడీఎస్ నాయకులు ఈ ఎన్నికల్లో అన్ని స్థానాలకు తమ మద్దతుదారులైన అభ్యర్థులను రంగంలోకి దింపారు. -
తగ్గిన కూరగాయల ధరలు
సాక్షి, ముంబై: వాతావరణం అనుకూలించడంతో ప్రస్తుతం కొన్ని కూరగాయల ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా టమాటా ధరలు గణనీయంగా పడిపోయాయి. ఈసారి వర్షాలు ఆలస్యంగా కురవడం అదేవిధంగా ఇతర కారణాల వల్ల గత రెండు నెలలుగా కూరగాయల ధరలలో హెచ్చుతగ్గులు వస్తూనే ఉన్నాయి. వర్షాలు ఆలస్యంగా కురిసినప్పటికీ సంతృప్తి కరంగా కురవడంతో గత నెలలో వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రానికి (ఏపీఎంసీ) కూరగాయల సరఫరా కూడా పెరిగింది. దీంతో కూరగాయల ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ సందర్భంగా సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ.. రోజుకు 500 నుంచి 600 ట్రక్కుల కూరగాయలు ఈ మార్కెట్‌కు సరఫరా అవుతున్నాయని పేర్కొన్నారు. గతంతో పోల్చితే ఇది చాలా ఎక్కువన్నారు. గతంలో రోజుకు కేవలం 350- 400 ట్రక్కుల కూరగాయలు మాత్రమే సరఫరా అయ్యేవని తెలిపారు. ఇప్పుడు సరఫరా పెరగడంతో టమాటాల ధరలు గణనీయంగా తగ్గాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో టమాటా ధర కిలోకు రూ.8 నుంచి 10 వరకు పలుకుతోంది. కాగా, మరికొన్ని వారాల వరకు కూరగాయల ధరల్లో తగ్గుదల కనిపిస్తుందని కూరగాయల వ్యాపారి రామ్‌దాస్ పవాలే తెలిపారు. కాగా, క్యారెట్, క్యాబేజీ, దొండకాయలు, పచ్చి బఠాణీ, పచ్చి మిరప ధరలు కూడా గణనీయంగా తగ్గగా గోరుచిక్కుడు, గోబి పువ్వు, బెండకాయల ధరలు స్థిరంగా ఉన్నాయి. -
అలీపుర్లో కిసాన్ మండీ
► ఏపీఎంసీతో సంబంధం లేకుండా దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు ► లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ ►రైతులు తమ ఉత్పత్తులను ఇక్కడ నేరుగా విక్రయించుకోవచ్చు ►గ్రేడింగ్, ప్యాకింగ్ వంటి సౌకర్యాలను కూడా కల్పిస్తున్న కన్సార్షియం సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ(ఏపీఎంసీ) పరిధిలో కాకుండా స్వతంత్రంగా అలీపూర్‌లో కిసాన్ మండీ ఏర్పాటవుతోంది. ఆకాశాన్నంటుతోన్న పళ్లు, కూరగాయల ధరల నుంచి నగరవాసులకు ఊరటనివ్వడం కోసం దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఏపీఎంసీతో సబంధం లేకుండా దేశంలోనే ఏర్పాటవుతున్న మొట్టమొదటి కిసాన్ మండీ ఇదే కావడం విశేషం. స్మాల్ ఫార్మ ర్స్ అగ్రి బిజినెస్ కన్సార్షియం ఏర్పాటుచేసే ఈ మార్కెట్‌కు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. 20 కిలోల ఉల్లిపాయలను సఫల్కు విక్రయించడంతో మండీని లాంఛనంగా ప్రారంభించారు. ఆరు నెలల తరువాత మండీ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు. పళ్లు కూరగాయల రైతు లు నేరుగా తమ ఉత్పత్తులను వినియోగదారులకు విక్రయించే ఉద్దేశంతో ఈ మార్కెట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. మండీలో దళారుల ప్రమేయం ఉండదని, దీం తో రైతులకు అధిక ధర గిట్టుబాటు కావడమేకాక వినియోగదారులకు తక్కువ ధరలకు పళ్లు, కూరగాయలు లభిస్తాయన్నారు. హర్యానా ఉత్తర సరిహద్దునానుకొని ఉన్న అలీపుర్ గ్రామంలో 1.6 ఎకరాల విస్తీర్ణంలో ఈ మండీని ఏర్పాటుచేశారు. కిసాన్మండీ పూర్తిగా పనిచేయడం ప్రారంభించిన తరువాత 30 నుంచి 40 వ్యవసాయోత్పత్తుల సంస్థలు, రైతు సంఘాలు తమ ఉత్పత్తుల నమూనాలను ఇక్కడ ప్రదర్శిస్తాయి. మండీ నిర్వహణకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్షియం అందిస్తుంది. ఫార్మ్ గేట్ వద్దనే పళ్లు, కూరగాయలను వేరుచేసి, గ్రేడింగ్, ప్యాకింగ్ చేసే వసతులను కన్సార్షియం సమకూరుస్తుంది. -
మళ్లీ కూర‘గాయాలు’..
- నానాటికీ పెరిగిపోతున్న కూరగాయల ధరలు - ఉత్పత్తి తగ్గడమే ప్రధాన కారణమంటున్న అధికారులు - దీపావళి సమయానికి మరింత మండిపోయే అవకాశం - ఇబ్బందులు పడుతున్న స్థానికులు సాక్షి, ముంబై: కూరగాయల ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి కూరగాయల లోడుతో వస్తున్న ట్రక్కులు, టెంపోల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. ఫలితంగా సరుకు కొరత ఏర్పడి ధరలు మండిపోవడం మొదలుపెట్టాయి. ఏపీఎంసీకి యేటా సెప్టెంబర్‌లో దాదాపు 700 వరకు ట్రక్కులు, టెంపోలు కూరగాయల లోడ్లు వస్తాయి. కాని ఈ ఏడాది సెప్టెంబర్‌లో 350-400 లోపు వస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు జూన్, జూలై ఆఖరు వరకు కురవలేదు. దీంతో కూరగాయల పంటల దిగుబడి తగ్గిపోయింది. ఆ తర్వాత ఆగస్టులో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని ఏపీఎంసీ డెరైక్టర్ శంకర్ పింగలే చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 60 శాతం మాత్రమే కూరగాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. వాటి నాణ్యత కూడా సాధారణ స్థాయిలో ఉందని వ్యాపారులు అంటున్నారు. మంచి నాణ్యత ఉన్న కూరగాయలు రావడంలేదని, గత్యంతరం లేక నాణ్యత లోపించిన కూరగాయలనే విక్రయించాల్సి వస్తోందని వ్యాపారులు అంటున్నారు. సరుకు కొరత కారణంగా కూరగాయల ధరలు 25-30 శాతం పెరిగాయి. దీపావళి తర్వాత కొత్త పంటలు చేతికొస్తాయని, ఆ తరువాత కూరగాయల ధరలు వాటంతట అవే దిగివస్తాయని కొందరు హోల్ సెల్ వ్యాపారులు అంటున్నారు. త్వరలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సమయంలో అనేక మంది భక్తి శ్రద్ధలతో ఉపవాసాలుంటారు. దీంతో మాంసం, చేపలకంటే కూరగాయలకే మరింత డిమాండ్ పెరుగుతుంది. దీన్ని అదనుగా చేసుకుని చిల్లర వ్యాపారులు ధరలు పెంచేసి జేబులు నింపుకునే ప్రయత్నాలు చేస్తారు. కూరగాయల నిల్వలు ఉన్నప్పటికీ కావాలనే కృత్రిమ కొరత సృష్టించి కొందరు వ్యాపారులు అందినంత దండుకునేందుకు యత్నిస్తారు. చౌకధరల కూరగాయల కేంద్రాలు మాయం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన చౌక ధరల కూరగాయల కేంద్రాలు ముంబై, ఠాణే, నవీముంబైలో కనిపించడం లేదు. ఆకస్మాత్తుగా అవి మాయం కావడంతో పేదలు ఇబ్బందుల్లో పడిపోయారు. గత ఏడాదివర్షాలు లేక కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో అందరికి అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం ముంబై, ఠాణే, నవీముంబైలో అక్కడక్కడ 125 చౌక ధరల కూరగాయల కేంద్రాలు ప్రారంభించింది. ఈ మధ్యకాలంలో కూరగాయల దిగుబడి పెరిగి పరిస్థితులు ధరలు సాధారణ స్థితికి వచ్చాయి. దీంతో ఈ కేంద్రాలకు ఆదరణ కరువైంది. కాలక్రమేణా అవి మూతపడిపోయాయి. -
ఉల్లిగడ్డుకాలం
సాక్షి, ముంబై: నగరవాసులపై ఉరుముల పిడుగులకు బదులుగా ఉల్లి పిడుగులు పడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కాస్త ఫరవాలేదనిపించిన ఉల్లి గత వారం రోజుల్లోనే రెట్టింపు ధర పలుకుతోంది. నిన్నమొన్నటి దాకా రూ.15 కిలో విక్రయించిన ఉల్లి మంగళవారం ఒక్కసారిగి రూ. 30-35కు చేరింది. వ్యాపారులు కుమ్మక్కవడం, వర్షాలు కురవకపోవడం, సరుకు సరఫరా తగ్గడం వంటివి ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. నవీముంబైలోని వాషిలోగల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ(ఏపీఎంసీ)కి ఉల్లితో వచ్చే ట్రక్కులు, టెంపోల సంఖ్య గత రెండు వారాల్లో గణనీయంగా తగ్గిందని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లోనే రూ.25కు పైగా పలుకుతున్న ఉల్లి రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి మరో పది రూపాయలు అదనంగా వచ్చి చేరుతోంది. దీంతో వంటింటి బెడ్జెట్ అమాంతంగా పెరుగుతోంది. విదేశాలకు ఉల్లిని ఎగుమతి చేయడంతోనే ఉల్లి ధరలు పెరుగుతున్నాయంటూ వ్యాపారులు గగ్గోలు పెట్టడం, కిలో ఉల్లి ధర రూ. 60-80కి పెరగడంతో కేంద్రం ఉల్లి ఎగుమతులను నిలిపివేసింది. దీంతో ఉల్లి ధర దిగొచ్చిందని సంబరపడిన ఇల్లాలికి ఆ ఆనందం ఎన్నోరోజులు ఉండలేదు. మళ్లీ ఉల్లి పైపైకే చూస్తోంది. కరెంటు కోతలు, నీటి కోతలు, నిత్యావసరాల వాతలకు తోడు పెరుగుతున్న ఉల్లి కూడా సామాన్యుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది. రోజుకు ఏపీఎంసీ మార్కెట్లోకి దాదాపు 300-350 వరకు రావల్సిన ఉల్లీ ట్రక్కులు సోమవారం సాయంత్రం వరకు కేవలం 125 మాత్రమే వచ్చాయి. ఉల్లి పంటలకు పేరుగాంచిన నాసిక్ జిల్లా లాసల్గావ్లో గత వారంపది రోజుల నుంచి ఉల్లి ధర ఎగబాకుతోంది. గత వారం రోజుల కిందట ఉల్లి క్వింటాలుకు రూ.800 ధర పలికింది. ఇప్పుడు ఏకంగా రూ.2,400 ధర పలకడంతో పంట పండించిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నా వాటిని కొనుగోలుచేస్తున్న గృహిణులు మాత్రం క ంటతడి పెడుతున్నారు. వర్షాల పరిస్థితి ఇలాగే కొనసాగితే ధరలు మరింత మండిపోయే సూచనలున్నాయని లాసల్గావ్ మార్కెట్లోని ఉల్లి వ్యాపారులు అంటున్నారు. -
‘రైతులకు స్వేచ్ఛ’ అమలయ్యేనా?
ముంబై: వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టాన్ని తాత్కాలికంగా రద్దు చేయాలని, పండ్లు, కూరగాయలు రైతులు తమకిష్టం వచ్చినచోట విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడంపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అయోమయంలో పడ్డారు. ఈ విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, సంబంధిత వ్యక్తులతో మాట్లాడిన తర్వాత వారి సమస్యలు విని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము తీసుకునే నిర్ణయం రైతులకు ప్రయోజనకరంగానే ఉంటుందని చెప్పారు. వ్యవసాయదారుల కుంభమేళాగా చెప్పుకునే ‘కృషి వసంత్’ మేళా ప్రారంభించే విషయమై ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. ‘కృషి వసంత్’ ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నాగపూర్‌లో జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో రైతులకు ప్రయోజన ం చేకూరేలా నిర్ణయం తీసుకున్నారని, పండ్లు, కూరగయాలను తమకు అనుకూలమైన చోట విక్రయించుకునే అవకాశం కల్పించాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన ఆదేశించారని, అందుకోసం ఏపీఎంసీ చట్టాన్ని తాత్కాలికంగా రద్దు చేయాలని ఆయన సూచించారన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా రైతులకు కొంత స్వేచ్ఛ లభిస్తుందన్నారు. ఏపీఎంసీలోనే తమ పంటలను విక్రయించాలనే ఒత్తిడి నుంచి వారికి విముక్తి లభిస్తుందన్నారు. ఎక్కడ ఎక్కువ ధర పలికితే అక్కడ తమ పంటలను విక్రయించుకునే అవకాశం లభిస్తుందన్నారు. -
దిగిన ధర
సాక్షి, ముంబై: ఉల్లి ధర పెరుగుదల కారణంగా ఇప్పటిదాకా ఇబ్బందిపడిన కొనుగోలుదారుడికి కొంతమేర ఉపశమనం లభించింది. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి వచ్చే ఉల్లి లారీల సంఖ్య ఇటీవల పెరిగింది. దీంతో దాని ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్నామొన్నటిదాకా టోకు మార్కెట్లో కిలో ఉల్లిపాయల ధర రూ. 50-58గా ఉంది. సామాన్యుడి వద్దకు చేరుకునే సరికి వాటి ధర రూ.70-75 దాకా పలికింది. అయితే ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న సరుకు పరిమాణం పెరిగిపోవడంతో క్రమేణా ధర తగ్గుతోంది. టోకు మార్కెట్లో కిలో ఉల్లిపాయలు రూ. 25 పలుకుతోంది. ఇక చిల్లర విక్రేతలు రూ.30-35 మధ్య విక్రయిస్తున్నారు. వాషి మార్కెట్‌కు మూడు రోజులుగా భారీ సంఖ్యలో ఉల్లి ట్రక్కులు వచ్చాయి. కాగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన అకాల వర్షాలతో దిగుబడి తగ్గిపోయింది. దీంతో కొరత ఏర్పడి ధరలు పెరిగాయి. దీంతో హోటల్ యజమానులు సైతం ధరలు పెంచారు. రోడ్లపై స్టాళ్లలో విక్రయించే పకోడీ, వడ, దోశ తదితర తినుబండారాలు పేదలకు అందకుండా పోయాయి. దళారుల బెడద నుంచి కొనుగోలుదారుడిని కాపాడేందుకు పాకిస్థాన్నుంచి ప్రభుత్వం ఉల్లిపాయలను దిగుమతి చేసింది. అయితే నాణ్యతా లోపం కారణంగా వీటిని ఎవరూ కొనుగోలు చేయలేదు. చేసేదేమీలేక చైనా నుంచి కూడా ఉల్లిపాయలను దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అప్పట్లో పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ మళ్లీ మొదటికొచ్చింది. అయితే రెండురోజులుగా రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో నిల్వ ఉంచిన ఉల్లిపాయలను విక్రయించడం ప్రారంభించారు. దీంతో ఏపీఎంసీలోకి రెండు రోజులుగా ఉల్లి లోడుతో ట్రక్కులు రావడం మొదలైంది. సరుకు రాక ఇంకా పెరుగుతుంది. కాగా లసల్గావ్ మార్కెట్లోనూ ఉల్లి ధరలు తగ్గిపోయాయి. కొద్దిరోజుల క్రితం క్వింటాల్ ఉల్లిపాయలు రూ. 5,000 పలకగా, ఇప్పుడది రూ. 3,100లకు పడిపోయింది. ఉల్లి రాక ఇంకా పెరుగుతుంది ఈ విషయమై లసల్గావ్ మార్కెట్‌కు చెందిన చిల్లర వ్యాపారి ఒకరు మాట్లాడుతూ ఉల్లి లారీల రాక ఇంకా పెరుగుతుందన్నారు. టోకు ధరల పెరుగుదల ప్రభావం చిల్లర విక్రేతలపై పడిందన్నారు. నాణ్యమైన ఉల్లిపాయల ధర శుక్రవారం కిలో రూ. 40 నుంచి రూ. 45 దాకా పలికిందన్నారు. ఇదే విషయమై మార్కెట్ అధికారి ఒకరు మాట్లాడుతూ తాజా ఉల్లిపాయల లారీలు పెద్దసంఖ్యలో వస్తున్నాయని తెలిపారు. ఈ నెల తొలివారంలో రోజుకు మూడు వేల లారీలు రాగా ఆ సంఖ్య ప్రస్తుతం నాలుగు వేలకు చేరుకుందన్నారు. -
ఉల్లి ధరలకు మళ్లీ రెక్కలు
నాసిక్: లసల్గావ్లోని వ్యవసాయ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు శుక్రవారం ఒక్కసారిగా విపరీతంగా పెరిగాయి. క్వింటాల్ ఉల్లిపాయలు అత్యధికంగా రూ. 5,600కు చేరుకున్నాయి. సెప్టెంబర్ ఒకటో తేదీన ఈ మార్కెట్లో క్వింటాల్ ఉల్లిపాయల ధర రూ. 5.501గా ఉంది.హోల్‌సేల్ మార్కెట్లో ధరలు పెరిపోవడం కొనుగోలుదారులకు ఇబ్బందికరంగా పరిణమించింది. చిల్లర మార్కెట్లో కిలో ఉల్లిపాయలను రూ. 60కి విక్రయిస్తున్నారు. జిల్లా మార్కెట్లలో క్వింటాల్ ఉల్లిపాయల సగటు ధర గురువారం రూ. 5,451 నుంచి రూ. 5,751కి పలుకింది. అంతకుముందురోజు రూ. 5,350కి విక్రయించారు. శుక్రవారం లసల్గావ్ మార్కెట్లో ఎనిమిది వేల క్వింటాళ్ల ఉల్లిపాయలను వేలం వేశారు. సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చె బుతున్నాయి. ఖరీఫ్ దిగుబడి మార్కెట్‌కు రావడం మొదలైందని, అయితే పెద్దమొత్తంలో రావడం లేదని, ఇందుకు మరికొంత సమయం పడుతుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. శుక్రవారం మార్కెట్‌కు ఖరీఫ్‌లో పండించిన 200 క్వింటాళ్ల ఉల్లిపాయలొచ్చాయని, అయితే ఉల్లిపాయలు క్రమం తప్పకుండా వస్తే ధరలు తగ్గిపోయే అవకాశముంటుందన్నారు. వేసవికాలంలో పండించిన ఉల్లిపాయలు మార్కెట్‌కు వచ్చినప్పటికీ అవన్నీ అమ్ముడుపోయాయన్నారు. కొత్త పంట రాకపోవడం, వేసవిలో పండించిన ఉల్లిపాయల నిల్వలు మొత్తం అమ్ముడుపోయిన నేపథ్యంలో ధరల పెరుగుదల మరో పదిరోజులపాటు కొనసాగే అవకాశముందన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లనుంచి తాజా సరుకు రావడం ప్రారంభమైందన్నారు. కాగా ఇక పింపల్గావ్ మార్కెట్లోనూ ఉల్లిపాయల ధరలు పెరిగాయి. శుక్రవారం ఈ మార్కెట్లో క్వింటాల్ ఉల్లిపాయలు రూ. 5,451 పలికాయి. అంతకుముందు ఇది రూ. 5.251గా ఉంది. ఈ మార్కెట్లో శుక్రవారం 500 క్వింటాళ్ల ఉల్లిపాయలను వేలం వేశారు. కాగా జిల్లాలోని యోలా మార్కెట్లో శుక్రవారం క్వింటాల్ ఉల్లిపాయలు రూ. 5,700 పలికాయి. -
ఉల్లి వచ్చేసిందోచ్!
సాక్షి, ముంబై: ఈజిప్టు, పాకిస్థాన్‌తోపాటు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లి నిల్వలు ముంబైకి వస్తుండడంతో ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) ఆవరణలోకి ఆదివారం భారీగా సరు కు చేరుకోవడంతో ముంబైకర్లకు త్వరలో చౌక ధరకే ఉల్లి లభిస్తుందని అధికారులు చెబుతున్నా రు. ఇదివరకు ఆకాశాన్నంటిన ఉల్లి ధరలతో బేజారవుతున్న ముంబైకర్లకు ఈ ఉల్లిరాకతో కొంతమేర ఊరట లభించనుంది. ఏపీఎంసీలోకి 56 టన్నుల చైనా ఉల్లి దిగుమతి కావడంతో టోకు వ్యాపారులకు దీన్ని రూ.37 కేజీ చొప్పున విక్రయిస్తున్నారు. ఉల్లి ధరలు అకస్మాత్తుగా పెరిగిపోవడంతో గృహిణుల ఆర్థిక అంచనాలు తారుమారయ్యాయి. ధరలను నియంత్రించేందుకు వ్యాపారులు ఈజిప్టు, పాకిస్థాన్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకున్నారు. అయినప్పటికీ మార్కెట్లో ఉల్లి ధరలు పెద్దగా తగ్గలేదు. దీంతో గత్యంతరం లేక వ్యాపారులు చైనా నుంచి రెండు కంటెయినర్ల (56 క్వింటాళ్లు) ఉల్లిని దిగుమతి చేసుకున్నారు. ఈ ఉల్లి ఏసీ కంటెయిన ర్లో రావడం వల్ల కొంత తడిగా ఉన్నాయి. అయినప్పటికీ ఆకారంలో ఇవి పెద్దగా ఉండడంతో ఒకే రోజు మొత్తంసరుకు అమ్ముడుపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. భారత్‌లో ఉల్లి సాగుకు నాసిక్ జిల్లా లాసల్గావ్, నిఫాడ్ ప్రాంతాలు ప్రఖ్యాతి చెందాయి. ప్రపంచంలో ఉల్లి పండించే దేశాల్లో చైనా ప్రథమస్థానంలో ఉండగా భారత్ రెండోస్థానంలో ఉంది. 2012లో చైనాలో 2,05, 07,759 మెట్రిక్ టన్నుల ఉల్లి ఉత్పత్తికాగా భారత్‌లో 2012లో 1,33,72,100 మెట్రిక్ టన్నుల ఉల్లి పండింది. చైనా ఉల్లి చూడడానికి పెద్దగా, రుచి కూడా ఉంటుంది. 2010లో ఇలాగే ఉల్లి కొరత ఏర్పడినప్పుడు ముంబైకి చైనా నుంచి దిగుమతి అయిం ది. దీంతో ధరలు కొంత అదపులోకి వచ్చాయి. ఒకపక్క వివిధ ప్రాంతాల నుంచి ట్రక్కులు రాకపోవడంతో లాసల్గావ్ మార్కెట్లో ఉల్లి ధరలు 7.5 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. మరోపక్క ఎపీఎంసీకు చైనాతోపాటు కర్ణాటక, ఇతర రాష్ట్రా ల నుంచి పెద్ద సంఖ్యలో ఉల్లి రావడంతో కొత్త ఉల్లి కేజీకీ రూ.25-40 చొప్పున విక్రయిస్తున్నారు. త్వరలో ఉల్లి ధరలు నియంత్రణలోకి వస్తాయని ఎపీఎంసీకి చెందిన ఉల్లి వ్యాపారి శివాజీ డెంబరే ఆశాభావం వ్యక్తం చేశారు. -
దిగొస్తున్న ధరలు
సాక్షి, ముంబై: ఆకాశన్నంటిన కూరగాయల ధరలు దిగొస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల మార్కెట్లోకి వచ్చే కూరగాయల సరఫరా తగ్గడంతో కొండెక్కిన ధరలు మళ్లీ నేలవైపు చూస్తున్నాయి. నగరంలోని అన్ని మార్కెట్లోకి కూరగాయల తాకిడి పెరిగింది. మరోవైపు వీటి వినియోగం తగ్గడం కూడా ధరల తగ్గుదలకు కారణంగా చెప్పవచ్చు. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)లోకి కూరగాయల లోడుతో వస్తున్న ట్రక్కులు, టెంపోల సంఖ్య పెరిగింది. దీంతో సరుకు నిల్వలు పేరుకుపోతుండటంతో వ్యాపారులు ధరలు కొంతమేర తగ్గించారు. శ్రావణ మాసం ప్రారంభం నుంచి గణేశ్ ఉత్సవాలు ముగిసేవరకు అత్యధిక శాతం ప్రజలు మాంసానికి దూరంగా ఉన్నారు. దీంతో కూరగాయాలకు డిమాండ్ పెరిగింది. అయితే ఈ ఉత్సవాలు ముగియడంతో కూరగాయలు కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గింది. అదే సమయంలో ఏపీఎంసీలోకి కూరగాయల లోడుతో వస్తున్న భారీ వాహనాల సంఖ్య పెరిగింది. ఫలితంగా మొన్నటి వరకు చుక్కలను తాకిన కూరగాయల ధరలు మెల్లమెల్లగా దిగి వస్తున్నాయి. మొన్నటివరకు కేజీ రూ.80లు ధర పలికిన ఉల్లి ఇప్పుడు సుమారు రూ.50 ధర పలుకుతోంది. ఇదే తరహాలో కేజీకీ రూ.50 ధర పలికిన వివిధ రకాల కూరగాయలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో గృహిణిలకు కొంతమేర ఊరట లభిస్తోంది. కొన్నినెలలుగా పేదలకే కాకుండా మధ్య తరగతి కుటుంబాలకు అందకుండాపోయిన కూరగాయల ధరలను నియంత్రించేందుకు కేంద్రం చౌక ధరల కూరగాయల కేంద్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవడంతో కూరగాయల దిగుబడి కూడా పెరిగింది. గత మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ సుమారు 450కిపైగా ట్రక్కులు, టెంపోలు వచ్చాయి. కానీ శని, ఆదివారాల్లో మాత్రం ఈ సంఖ్య 600కుపైగా చేరింది. దీంతో ధరలు కొంతమేర దిగివచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ధరలు మరింత దిగివస్తాయని హోల్‌సేల్ వ్యాపారి రాజేశ్ గుప్తా చెప్పారు.