సాక్షి, ముంబై: మామిడి పండ్ల ప్రియులకు శుభవార్త. ఉగాది నాటికి మార్కెట్‌లోకి మామిడి పళ్లు రానున్నాయి. కొంకణ్‌లో వర్షాలు నిలిచిపోవడంతో మామిడి కాయలు ఉగాది పండుగ నాటికి సరఫరా అవుతాయని వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రం (ఏపీఎంసీ) వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే మార్కెట్‌కి సరఫరా అవుతాయని చెబుతున్నారు. దీంతో నగరవాసులు కూడా తెలుగు నూతన సంవత్సరాన్ని ఇష్టమైన మామిడి పండ్లతో ఆహ్వానం పలకవచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాయ్‌ఘడ్, రత్నగిరి, సిందుదుర్గ్ జిల్లాల నుంచి ఉగాదికి 50,000 పండ్ల బాక్సులు నగరానికి వస్తాయని పండ్ల వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఉగాది పురస్కరించుకొని చాలా మంది మామిడిపళ్లు కొనుగోలు చేస్తుంటారని, పండగ వరకు ఏపీఎంసీ మార్కెట్ కళకళలాడాలని వ్యాపారి విజయ్ ధోబ్లే ఆశాభావం వ్యక్తం చేశారు. మొన్న కురిసిన వర్షాల వల్ల ఆల్‌పోన్సో లాంటి ప్రత్యేక జాతికి చెందిన మామిడి పండ్ల సరఫరా ఈ ఏడాది తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. కొన్ని వేల సంఖ్యలో మాత్రమే ఆ మామిడి పళ్లు సరఫరా అయ్యే అవకాశం ఉందని వ్యాపారులు తెలుపుతున్నారు.
వాషిలోని ఏపీఎంసీ మార్కెట్‌కు చెందిన పండ్ల వ్యాపారి బాలకృష్ణ షిండే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మామిడి పండ్ల నాణ్యత, పరిమాణం ఆధారంగా వాటి ధర నిర్ణయించనున్నట్లు పేర్కొన్నారు. హోల్ సేల్ మార్కెట్‌లో వీటి ధర డజన్ రూ.200 నుంచి రూ.600 వరకు ఉంటుందన్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఈ ధరలు తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పండ్ల నాణ్యత బాగానే ఉంటుందని చెప్పారు. ఇక్కడ మామిడి పండ్ల దిగుబడి ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రస్తుతం అల్పూన్‌సన్ అనే జాతి మామిడి పండ్లను రీటైల్ మార్కెట్‌లో డజన్ రూ.900 నుంచి రూ.1,000 వరకు విక్రయిస్తారని తెలిపారు. అయితే ఏప్రిల్‌లో మామిడి పండ్ల సరఫరా పెరగడంతో... ధరలు తగ్గుముఖం పడుతాయని చెప్పారు.
ఉగాదికి ‘మామిడి’ రెడీ
Published Sun, Mar 15 2015 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM
Advertisement